నిప్పుల కొలిమిలా.. 192 మంది నిరాశ్రయులు మృతి

నవతెలంగాణ – న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నిప్పుల కొలిమిలా మారింది. ఒకవైపు నీటి సంక్షోభం, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలతో ఢిల్లీవాసులు అల్లాడిపోతున్నారు. ఢిల్లీలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఆ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనీసం రాత్రిపూట కూడా వాతావరణం చల్లబడడం లేదు. గత పద్నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రివేళ కూడా రాజధానిలో 35.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక నిరాశ్రయుల సంగతి సరేసరి. ఉండడానికి నీడ లేక.. ఫుట్‌పాత్‌లపైనే కాలం వెళ్లదీసేవాళ్లు ఎండవేడిమికి తట్టుకోలేక వందలాది మంది నిరాశ్రయులు మృతి చెందుతున్నారు. ఈ నెల జూన్‌ 11 నుంచి 19వ తేదీ వరకూ తొమ్మిది రోజుల వ్యవధిలో 192 మంది నిరాశ్రయులు చనిపోయారు. ఎన్జీవో సెంటర్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ పేర్కొంది. గత ఐదేళ్లలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే అని ఎన్జీవో స్పష్టం చేసింది. ఎన్‌జివో ఎగ్జికూటివ్‌ డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌ అలెడియా మాట్లాడుతూ.. ‘జూన్‌ 11 నుంచి 19వ తేదీ వరకూ .. కేవలం తొమ్మిది రోజుల్లో తీవ్రమైన ఎండల కారణంగా.. వడదెబ్బకు గురై ఢిల్లీలో 192 మంది నిరాశ్రయులు మృతి చెందారు.’ అని ఆయన అన్నారు.
కాగా, గత ఐదేళ్లలో జూన్‌ 11 నుంచి 19 వరకూ ఢిల్లీలో ఎంతమంది నిరాశ్రయులు చనిపోయారో ఎన్‌జివో వివరించింది. 2019లో జూన్‌ 11 నుంచి 19 వరకూ 143 మంది చనిపోయారు. 2020లో 124 మంది, 2021లో 58 మంది, 2022లో 150 మంది, 2023లో 75 మంది, ఈ ఏడాది ఏకంగా 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు.

Spread the love