రూ.33 వేలా 660 కోట్లు కేంద్రం ముద్రించిన ఎన్నికల బాండ్లు..

Rs.33 thousand 660 crores Election Bonds printed by the Center..– ఆరేండ్లలో బీజేపీకి అందిన విరాళం రూ.6,565 కోట్లు
– కాంగ్రెస్‌కు వచ్చింది రూ.1,123 కోట్లే
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల (ఈబీ) పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి…అంటే 2018 నుండి కేంద్ర ప్రభుత్వం రూ.33,660 కోట్ల విలువైన బాండ్లను ముద్రించింది. వీటిలో ఒక్కోటి కోటి రూపాయల విలువ కలిగిన 33 వేల బాండ్లు, ఒక్కోటి పది లక్షల రూపాయల విలువ కలిగిన 26,600 బాండ్లు ఉన్నాయి. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ఈ నెల 15న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్‌ 29వ తేదీ నుంచి సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకూ ప్రభుత్వం ఒక్కోటి కోటి రూపాయల విలువైన 6,350 బాండ్లను ముద్రించింది. సమాచార హక్కు చట్టం కింద రిటైర్డ్‌ సైనికోద్యోగి లోకేష్‌ కే బత్రా అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
ఎన్నికల బాండ్ల ముద్రణ, కమిషన్‌ నిమిత్తం ప్రభుత్వానికి రూ.13.94 కోట్లు ఖర్చయ్యాయి. ఎన్నికల బాండ్లను విక్రయించినందుకు కమిషన్‌ రూపంలో ఎస్‌బీఐకి జీఎస్టీ సహా రూ.12.04 కోట్లు చెల్లించారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి 30 విడతలుగా ఈ బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. దాతలు లేదా రాజకీయ పార్టీల నుండి ఎలాంటి కమిషన్‌ తీసుకోలేదు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీల వార్షిక నివేదికలను ఎన్నికల కమిషన్‌ ఇంకా ప్రచురించనప్పటికీ 2018 మార్చి, ఈ సంవత్సరం జనవరి మధ్య కాలంలో ఈబీల విక్రయం ద్వారా రాజకీయ పార్టీలకు రూ.16,518 కోట్ల నిధులు సమకూరాయి. వీటిలో సగానికి పైగా నిధులు అధికార బీజేపీ ఖాతాకే చేరాయి. 2017-2023 మధ్య కాలంలో బాండ్ల ద్వారా విరాళాల రూపంలో రూ.6,565 కోట్లు అందాయని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన డిక్లరేషన్‌లో బీజేపీ తెలిపింది. అదే కాలంలో రూ.1,123 కోట్ల విరాళాలతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది.
2019 ఏప్రిల్‌ 12 నుండి వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేసిన బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీ లోగా ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్‌ ఆ వివరాలను మార్చి 13 లోగా తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే ఎస్‌బీఐ తన వద్ద ఉన్న సమాచారాన్ని నిర్దిష్ట నమూనాలో అందజేస్తుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఫార్మెట్‌ రూపంలో వివరాలు ఉంటే బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తులు లేదా కంపెనీలు వాటినే రాజకీయ పార్టీలకు అందజేసిందీ లేనిదీ తెలిసిపోతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కార్పొరేట్‌ సంస్థలు, సంపన్న వర్గాల వారు మాత్రమే రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలు అందజేశారు. ఎన్నికల సంఘం రికార్డులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే దాతలు కొనుగోలు చేసిన బాండ్లలో 94 శాతం వరకూ కోటి రూపాయల విలువ కలిగినవే. అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత కార్పొరేట్‌ సంస్థలు, సంపన్నులకు కాకుండా ఎవరికి ఉంటుంది?

Spread the love