విద్యార్థి మృతి

– అనుమానాస్పదంగా విద్యార్థి మృతి
నవతెలంగాణ-డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్థిపూర్ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం ఇద్దరు విద్యార్థుల మద్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్కు చెందిన షేక్ సోఫియాన్ (14) అనే విద్యార్థి మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, మృతుడి కుటుంబీకులు, గురుకుల పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మద్యాహ్న భోజనం కోసం విద్యార్థులు మెస్కు చేరుకున్నారు.
వారిలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థులు సోఫియాన్, అతీఫ్ లు ప్లేట్లలో భోజనం వడ్డించుకుని తినడానికి బెంచీ వద్దకు చేరుకున్నారు. నేను ముందు వచ్చాను. అంటే నేను వచ్చానని బెంచీపై కూర్చునే విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. ఆవేశానికి లోనైన అతిఫ్ పిడికిలి బిగించి సోఫియాన్ చాతీపై బలంగా కొట్టడంతో అతడు నేలపై బోర్లాపడిపోయాడు. మెస్ హాల్లో ఉన్న ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వెంటనే అక్కడి చేరుకుని సోఫియాన్ ను లేపగా అప్పటికే అతడు ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. అందోళన చెందిన ఉపాధ్యాయులు విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ ఎండీజమీల్ కు తెలిపారు. వెంటనే సోఫియాన్ ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
సోఫియాన్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి వారు వచ్చిన తర్వాత తమపై దాడి చేస్తారేమోననే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆస్పత్రికి చేరుకున్న సోఫియాన్ తల్లి, కుటుంబీకులు, బంధువులు మృతదేహాం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యార్థి మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది భిన్నమైన కారణాలు చెప్పడంతో సోఫియాన్ కుటుంబీకులు, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
వెంటనే మైనార్టీ స్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ తో సహా, బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్ పల్లి ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా మైనార్టీ గురుకుల పాఠశాల వద్ద డిచ్ పల్లి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Spread the love