నవతెలంగాణ హైదరాబాద్: ఒక్క రోజే 400 కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ పరిష్కరించింది. వేగవంతమైన న్యాయపరిష్కారాలు అందించేందుకు సర్వోన్నత న్యాయస్థానం మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ‘సమాధాన్ సమరోహ్ 2026’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకత్వంలో పని చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి రోజైన శుక్రవారం 400 కేసుల్లో పరిష్కారాలు చూపింది. ఆదివారంతో ఈ లోక్ అదాలత్ ముగియనుంది.
పెండింగ్‌లో ఉన్న వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పించడమే ఈ ప్రత్యేక లోక్ అదాలత్ లక్ష్యమని సుప్రీంకోర్టు వెల్లడించింది. సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన ఇద్దరు సిట్టింగ్ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, అడ్వొకేట్-ఆన్-రికార్డ్ (AORలు), ఇతర న్యాయవాదులతో కూడిన 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌లు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నట్టు తెలిపింది. లోక్ అదాలత్‌లో మొదటి రోజు 600కు పైగా కేసులు పరిష్కారం కోసం లిస్ట్ కాగా.. వాటిలో 400కు పైగా కేసులను సామరస్యంగా పరిష్కరించినట్టు పేర్కొంది. వీటిలో వైవాహిక, ఆస్తి, వాహన ప్రమాద క్లెయిమ్‌లు, నష్టపరిహారం, కార్మిక వివాదాలు వంటివి ఉన్నాయి.



