చైనా కుండపోత వర్షాలు.. 47 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: చైనాను మరోసారి వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాల కారణంగా దక్షిణ చైనాలో వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు చోట్ల భారీగా చెట్లు నేలకూలాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారులు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా మీడియా వెల్లడించింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు పేర్కొంది. ఈ జల విలయంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదలకు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు చైనా మీడియా వెల్లడించింది.

Spread the love