ఆరో దశలో 59.06 శాతం పోలింగ్‌

59.06 percent in the sixth phase Polling– పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మకం
– ఇక్కడే అత్యధికంగా 78 శాతం ఓటింగ్‌..బీహార్‌లో అత్యల్పం
– ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకూ 59.06 శాతం పోలింగ్‌ నమోదైంది. శనివారం దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 58 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. అలాగే ఒడిశాలో అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్‌ జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం, రాత్రి 7.45 గంటల వరకు పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 78 శాతం పోలింగ్‌ నమోదుకాగా, అత్యల్పంగా బీహార్‌లో 53.19 శాతం నమోదు అయింది. జార్ఖండ్‌లో 62.66 శాతం, ఒడిశాలో 59.92 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 54.03 శాతం పోలింగ్‌ నమోదైంది. ఢిల్లీలో 54.37 శాతం, హర్యానాలో 58.24 శాతం పోలింగ్‌ నమోదు అయింది. జమ్మూకాశ్మీర్‌ లోని అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలో 51 శాతం పోలింగ్‌ నమోదైంది. 1989లో కాశ్మీర్‌లో మిలిటెన్సీ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం.
అయితే ఇవి తాత్కాలిక గణాంకాలే అని, తుది ఓటింగ్‌ శాతం స్వల్పంగా పెరుగుతుందని ఈసీ పేర్కొంది. ”దేశంలోని కొన్ని ప్రాంతాలలో వేడి వాతావరణం ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఓటు వేయడానికి ఓపికగా క్యూలో నిల్చున్నందున ఓటర్లు తమ ఉత్సాహాన్ని చూపించారని” అని ఎన్నికల సంఘం తెలిపింది.
సమైక్యత, సామరస్య పరిరక్షణకే ఓటు : ఏచూరి – ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న కరత్‌ దంపతులు
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శనివారం ఢిలీల్లో తన ఓటుహక్కు వినియోగించు కున్నారు. అనంతరం ఏచూరి మాట్లాడుతూ, దేశం కోసం,రాజ్యాంగ పరిరక్షణ కోసం, భారత దేశ ఐక్యత, సామరస్యాన్ని కాపాడడం కోసం ఓటు వేశాను అని చెప్పారు. సీతారాం ఏచూరితోబాటు ప్రకాశ్‌ కరత్‌, బృందాకరత్‌ కూడా ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఆ బూత్‌లో ఓటింగ్‌ మెషిన్‌ మొరాయించడంతో కొద్ది సేపు పోలింగ్‌కు అంతరాయమేర్పడింది. ఉదయం 9.15 గంటలకే ఓటింగ్‌ మెషిన్‌ బ్యాటరీ డౌన్‌ అవడం వల్ల 30 నిమిషాలసేపు పనిచేయలేదు. దీనిపై బృందా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరిగింది.
కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది.
తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌, బీజేపీ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్‌, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌, ఢిల్లీ మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ తదితరులు తొలి గంటల్లో ఓటేశారు.
నియంతృత్వం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటు వేశా : కేజ్రీవాల్‌
చాందినీ చౌక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తండ్రి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చి ఓటు వేశాను. అనారోగ్యం కారణంగా మా అమ్మ పోలింగ్‌ కేంద్రానికి రాలేకపోయారు. నేను నియంతృత్వానికి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ (బీజేడీ) పార్టీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. హర్యానా సిఎం నాయబ్‌ సింగ్‌ సైనీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ శనివారం ఢిల్లీలో ఓటు వేశారు.
భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. లోక్‌సభ ఆరో విడత ఎన్నికల్లో భాగంగా హర్యానాలో తన సతీమణితో కలిపి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఇండియన్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు
ఆరో దశ పోలింగ్‌ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ లతో పాటు పారిశ్రామిక, క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌ కాంప్లెక్స్‌లోని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, ఆయన సతీమణి సుదేశ్‌ క్యూలైన్లో నిల్చుని ఓటు వేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఉదయం 9.30 గంటలకు నిర్మాణ్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు వేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి గంటల్లో ఓటేశారు. కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరియా, కుమారుడు రేహాన్‌ వాద్రా క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Spread the love