ఒక్కరోజే 702 కేసులు

– 24 గంటల వ్యవధిలో కోవిడ్‌తో ఆరు మరణాలు
– భారత్‌లో కరోనా ఉధృతి
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పంజా విసురుతోంది. కేసుల సంఖ్యా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 702 కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం నివేదికలో పేర్కొంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,097కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో ఆరు కొత్త మరణాలు నమోదవ్వగా, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, కర్నాటక, కేరళ, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని తెలిపింది.
కొత్త వేరియంట్‌..వాతావరణ మార్పులతో..
డిసెంబర్‌ 5 వరకు కేసులు రెండంకెలకు పడిపోయాయని, అయితే కొత్త వేరియంట్‌ , చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపింది. డిసెంబర్‌ 22న దేశంలో 752 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 మహమ్మారి ప్రారంభంలో రోజువారీ కేసులు లక్షల్లో గరిష్టస్థాయికి చేరుకున్నాయి. 4.5కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా సుమారు నాలుగేళ్లలో 5.3 లక్షల మంది మరణించారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లను దాటింది.

Spread the love