– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలో ఇటీవల శిథిలావస్థకు చెందిన గోడ కూలి ముగ్గురు కూలీలు మత్యువాత పడ్డారని, ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బాధిత కుటుంబాలను ఆయన సందర్శించి పరామర్శించారు. గోడ కూలిన ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండ్ర దంపతులు మండల కేంద్రానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోవడంతో, నిరుపేదలు శిథిలావస్థకు చెందిన ఇండ్లలో నివసిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరీ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదని స్పష్టం చేశారు. మండల కేంద్రానికి 108 అంబులెన్స్ లేకపోవడం వల్ల నిరుపేదల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయన్నారు. అంబులెన్స్ కోసం పలుమార్లు విన్నవించిన ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా గండ్ర దంపతులు స్పందించి మండలంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, మడికొండ ప్రశాంత్, మండల అధ్యక్షులు ఇస్మాయిల్, నజీర్, లక్ష్మణ్, రామ్ చరణ్, రాజకుమార్, తిలక్, శశాంక్ పాల్గొన్నారు.