మధుకి, తన జీవిత విశేషాలతో పాటు, రాజకీయ జీవితం గురించి, తను స్వయంగా రాసిన డైరీ నుండి, స్వయంగా వివరించే సమాచారం ఆధారంగా పుస్తకం తీసుకువస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉండేది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు చొరవతో, కామ్రేడ్ ఝాన్సీ, దేవేంద్ర,స్వేచ్ఛా టి.వి సహకారంతో మధు ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు.మధు జీవించి ఉన్న సమయంలోనే ఈ పుస్తకం పూర్తి కావాల్సి ఉన్నా, కారణాలు ఏవైనా ఆలస్యం జరిగింది.
మధు బాల్య జీవితం వారి స్వగ్రామం లాలాపురంతో పాటు, ఎక్కువగా వారి మేనమామ గ్రామమైన గండలపాడులో గడిచింది. ఆనాడు కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరరావు ప్రయివేటు పాఠశాల నడిపేవారు. వారే మధుసూదన్ రావుకి అక్షరాభ్యాసం చేశారు. మరొక ఉపాధ్యాయులు శాఖమూరి సీతారామయ్య, ఐదవ తరగతి వరకు ప్రయివేటుగా పాఠాలు నేర్పారు. ఆనాడు కమ్యూనిస్టులకు బలమైన కేంద్రంగా ఉన్న గండగలపాడు గ్రామం ఉండేది. నిజాం వ్యతిరేక పోరాటంలో అమరుడైన తన చిన్న బాబాయి సంక్రాంతి రామచంద్రయ్య, యూనియన్ సైన్యం జరిపిన కాల్పులలో అమరుడైన అదే గ్రామానికి చెందిన దేవభక్తిని నరసయ్య ప్రభావం చిన్నతనంలోనే మధుపై పడింది. ఆనాడు కరువు పరిస్థితులు, జాగిర్దారుల దౌర్జన్యాలు, లైంగికదాడులతో పాటు, కుటుంబాల మధ్య ఘర్షణలను సృష్టించేవారు. వారికి ఎదురొడ్డి పోరాడేవారే కమ్యూనిస్టులు అనే భావన ప్రజల్లో కల్పించారు. తన బాల్యంలో బాల సంఘాలను ఏర్పాటు చేశారు. వాలీబాల్ లాంటి ఆటలు ఆడేవారు. ఆటలతోపాటు ప్రజల కోసం పనిచేయాలని బోడేపూడి ఇచ్చిన సూచన మేరకు, గండగలపాడు గ్రామంలో తన స్నేహితులతో కలిసి రోడ్లు వేశారు. తాగుడుకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేశారు
సుందరయ్య నాయకత్వంలో కొల్లిపరలో నిర్వహించిన రాజకీయ తరగతులకు హాజరయ్యాడు. ఆ తరగతులలో పాల్గొన్న తరువాత సైద్ధాంతిక స్పష్టతతో పాటు, క్షేత్రస్థాయిలో వర్గ పోరాటాలు నిర్వహించేందుకు అతనికి ఏ విధంగా సహకరించింది. చెరువు మునుక భూమిని వర్గదృష్టితో పంచడంలో, ఈ వర్గీకరణ తరగతులు ఎంతో ఉపకరించాయి. వైరా జనతా హోటల్ వద్ద జరిగిన ఘర్షణను, కామ్రేడ్ మంచికంటితో పాటు, తాను ఇతర కామ్రేడ్స్ సహకారంతో ఎదుర్కొన్న తీరును వివరించారు. ఈ సందర్భంలోనే స్థానిక కాంగ్రెస్ నాయకులు మధుని అవమానించి, బెదిరించే ప్రయత్నం చేసినప్పుడు, నిర్భయంగా వారిని ఎదిరించిన తీరు, బెదిరిస్తే బెదిరేది లేదనే భావనను వారికి కల్పించడం వీరి ధైర్యానికి తార్కాణం.
వీరి రాజకీయ జీవితంలో మరొక కీలక ఘట్టం యాదగిరిరావు హత్య కేసు. మనకు తెలుసు అతను మన కామ్రేడ్ మంచికంటి అల్లుడు. మధుకి గానీ, ఇతరులకు గాని ఈ హత్యతో ప్రమేయం లేకపోయినా నిర్బంధించి వైరా గ్రామంలో చేతులు బంధించి రోడ్లమీద తిప్పిన వైనం, ఇరవై పోలీస్‌స్టేషన్లకు పైగా తిప్పి జైలుపాలు చేయటం అక్కడి పోరాటానికి సజీవసాక్ష్యం. ఈ కేసులలో లాయర్ బోడేపూడి రాధాకృష్ణ సహకారం మరువ లేనిది. వీరి జీవితంలో ఎక్కువ భాగం ఏలూరు సత్యంపై నైతికంగా నేకాక, ఆయన స్వాధీనం చేసుకున్న పేదల భూము లను విడిపించేందుకుగాను, రాజకీయంగా వారిపై పోరాటం చేసే సందర్భంలో ఘర్షణలు, భౌతిక దాడులు, బాంబు దాడులకు గురయ్యారు. వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమ సహచరులైన, ధూళిపాళ సోదరులు తదితర కామ్రేడ్స్ తో కలిసి దీర్ఘకాలిక పోరాటం చేశారు. ఈ పోరాటం పరిమిత ప్రాంతంలో జరిగినా ఇది వర్గ పోరాటమే అంటారు మధు.
తన స్వల్పకాలిక నక్సలైట్ ప్రస్థానాన్ని గురించి వివరిస్తూ, లాయర్ కె.వి సుబ్బారావుగారు, బత్తుల వెంకటేశ్వరరావు ప్రభావంతో నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లానని, ఆచరణలో చూసినప్పుడు, అది తప్పు సిద్ధాంతమని తెలిసి, తాను తిరిగి వచ్చిన ఉదంతాన్ని, బోల్షెవిక్ పార్టీ చరిత్ర అధ్యయనం, సీపీఐ(ఎం) నుంచి నక్సలైట్ల పేరుతో చీలిక వల్ల పార్టీ నష్టపోయిన విధానాన్ని, విద్యార్థి యువజన సంఘాల నిర్మాణంతో, తిరిగి పార్టీ నిలదొక్కుకున్న విధానాన్ని చెప్పారు. నక్సలైట్ పంథా సరియైనది కాదని తెలుసుకుని, తాను తిరిగి మార్క్సిస్టు పార్టీలోకి రావడానికి పడిన తపనను చెప్పారు. ఈ పుస్తకంలోని అనుబంధాలుగా తనతో పెనవేసుకున్న అనేక విషయాలతో పాటు, వ్యక్తులు స్నేహితులు, సంస్థలతో పాటు మిత్రులను గురించి వివరించారు.
(ఏప్రిల్ 27, కామ్రేడ్ సంక్రాంతి మధు సూధనరావు
ప్రధమ వర్ధంతి)
మల్లెంపాటి వీరభద్రరావు



