Sunday, April 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకెరీర్‌ మీ చేతల్లోనే...

కెరీర్‌ మీ చేతల్లోనే…

- Advertisement -

”ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరిచి నిదురపోకుమా” అంటాడు ఓ సినీకవి. మన కోసం ఎవరూరారు, ఏమీ చెయరు. మీ యుద్ధం మీరు చేయాల్సిందే, మీ తరుపున ఎవరు వకాల్తా పుచ్చుకోరు. మీ పరీక్ష మీరు రాయాల్సిందే ఎవరు వచ్చి రాయరు, మీ దేశానికి రాజు, బంటు మీరే. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ చుట్టూవున్న వారిని (తల్లీదండ్రి, కుటుంబసభ్యులను) కూడా రాజు మాదిరిగా నిత్యం కాచుకొని వుండాలి. అందుకే మీరు ఒంటరిగానే యుద్ధం చేయడానికి మానసికంగా సిద్ధం కావాలి. మీరు మీ అమ్మ కడుపులో తొమ్మిది నెలలు చీకటి ప్రపంచంలో పోరాటం చేశారు. భూమిపైకి రాగానే మీ చుట్టు ఎన్నో రుగ్మతలు, వ్యాధులు చుట్టు ముట్టాలని ప్రయత్నం చేస్తాయి వాటిని మీవారు మీ దరి చేరకుండా కాపాడ్తారు. వారు అలా ఎంతకాలం మిమ్మల్ని కాపాడుతారు.

మనదేశంలో విద్యార్థులు గుడ్డిగా కెరీర్‌ ఎంపిక చేసుకుంటున్నారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 90 శాతం మంది స్టూడెంట్స్‌కి సరైన మార్గదర్శకత్వం కరువు. మనదేశంలో కెరీర్‌ కౌన్సెలింగ్‌ లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం తేల్చింది. దాని ప్రకారం కేవలం 10 శాతం విద్యార్థులకు మాత్రమే కెరీర్‌కి సంబంధించిన సలహాలు లభిస్తున్నాయి, మిగతా 90 శాతం మంది కుటుంబ సభ్యులసలహాలు, సామాజిక ఒత్తిడులు, ‘సురక్షితమైన’ ఉద్యోగాల ఆకర్షణలో పడిపోయి సరైన కెరీర్‌ ఎంపిక చేసుకోవడం లేదు. ఏడు రాష్ట్రాల్లో 9-12 తరగతులు చదువుతున్న 21,239 మంది విద్యార్థులను సర్వే చేసి ఐరాస ఈ అధ్యయనాన్ని వెలువరించింది. గాలప్‌ 2024 గ్లోబల్‌ వర్క్‌ ప్లేస్‌ రిపోర్ట్‌ ప్రకారం కేవలం 14 శాతం భారతీయ ఉద్యోగులు మాత్రమే తాము కెరీర్లో అభివద్ధి చెందుతున్నట్టు భావిస్తున్నారు. వ్యక్తిగత ఆసక్తులు, నైపుణ్యాలతో సంబంధం లేకుండా కెరీర్‌ని ఎంపిక చేసుకోవడం వల్ల ఈ అంతరం ఏర్పడిందని దీని వల్ల ఉద్యోగ అసంతప్తి విస్తతంగా వ్యాపించిందని నిపుణులు తెలిపారు. 10 శాతం మంది విద్యార్థులకు మాత్రమే తమ కోర్సుల ఫీజు, ఎంపికలు, విద్యా సంస్థలు, అవకాశాల గురించి తెలుసు. ప్రభుత్వ స్కూళ్లలో ‘కెరీర్‌ కౌన్సెలింగ్‌’ లభించడం లేదు. కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లలో అదొక ఖరీదైన వ్యవహారంగా ఉంది. మనదేశంలో చాలాచోట్ల కెరీర్‌ కౌన్సిలర్‌ కూడా ఉండటం లేదు. తల్లిదండ్రులు ఇంకా ఇంజినీరింగ్‌, వైద్య విద్య, సివిల్‌ సర్వీసెస్లను ఎంపిక చేసుకోవాలని పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. కెరీర్‌ కౌన్సెలింగ్‌ అంతరాన్ని ఏఐతో పనిచేసే కెరీర్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా, స్థానిక భాషల్లోని మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా, ఆన్‌లైన్‌ మెంటర్‌షిప్‌ నెట్‌వర్క్‌ ద్వారా కొంత మేరకు భర్తీ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పుడు మీ చేతిలో డిగ్రీ పట్టానో, ఇంజనీరింగ్‌ పట్టానో, మెడిసిన్‌, ఐఐటి పట్టానో ఉండవచ్చు. బాల్యంలో తరగతి గది వరకు వెంట వచ్చిన మీ అమ్మ నాన్న మీతోపాటే తరగతి గదిలో కూర్చొలేదు కదా? మీరు ఒంటరిగానే పాఠాలు విన్నారు కదా? మరి ఇప్పుడు మీ వయస్సు 20-25 సం||లు ఉండొచ్చు. ఇంతకాలం తరగతి గదిలోనో, శిక్షణా కేంద్రంలోనో ఒంటరిగా ‘అభ్యసనం’ చేసినప్పుడు మీ ‘కేరీర్‌’ను నిర్మించుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు నిరాశకు లోనవుతున్నారు? మీరు ఏ పరీక్ష రాసినా ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పిన మీ అమ్మ-నాన్న పరీక్ష గదిలోకి వచ్చి పరీక్ష రాయలేదు కదా! పరీక్ష మీరే రాశారు. దాని అంతిమ ఫలితం మీరే ఆస్వాదించారు. ఫలితంగా మీ కుటుంబం కూడా మీ ఆనందంలో భాగంపంచుకుంటుంది. కాబట్టి మీ దగ్గర ఏ డిగ్రీ వుందో, మీరు ఏ రంగంలో రాణించాలని కలలుకన్నారో ఇప్పుడు మీరు వాటిని నిజం చేసుకునే సందర్భం వచ్చిందని భావించండి. బయట చాలామంది వారి దగ్గర వున్న పట్టాలకు (డిగ్రీలకు) వారు చేస్తున్న ఉద్యోగాలకు సంబంధం వుండదు. కారణం మనిషి అంతిమ లక్ష్యం డబ్బు సంపాదన. మరి అలాంటప్పుడు వారు చదువుకున్న డిగ్రీ వారి నైపుణ్యాన్ని పెంపొందించిదని భావించాలి తప్ప. వారికి ఉపయోగపడలేదని భావించకూడదు.
ఓ కానిస్టేబుల్‌ కుమారుడు బికామ్‌ డిగ్రీతో తనకు ఇష్టమైన సినిమా రంగం మీద మక్కువతో మొగల్తూర్‌ నుండి పయనమై చిన్న చిన్న పాత్రలు, విలన్‌ వేషాలు వేసి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ‘మెగా కాంపౌండ్‌’ సృష్టించిన వైనం నేటి యువతకు స్ఫూర్తి. ఇప్పుడు కొత్తగా వస్తున్న అనేక మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులకి, హీరోలకి స్ఫూర్తి ఆయనే.

ఢిల్లీ యూనివర్సిటీలో పట్టా పుచ్చుకున్న పాతికేళ్లు కూడా లేని షారుఖ్‌ ఖాన్‌ తనకు ఇష్టమైన నటనారంగం మీద దష్టిపెట్టి మొదట్లో టీవీ సీరియళ్లలో నటించి నేడు వేల కోట్లకు అధిపతిగా, ఎలా మారాడో తెలుసుకోవాలి. ఎంచుకునే రంగం ఏదైనా కావొచ్చు, సివిల్‌ సర్వీసెస్‌, సమాజ సేవ, వ్యాపారం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇలా ఏదైనా ప్రారంభంలో మీకు కొత్త అనిపించినా కాలంతోపాటు అందులో నైపుణ్యం (ూసఱశ్రీశ్రీ), అనుభవం (వఞజూవతీఱవఅషవ) పెరుగుతూ వస్తాయి. ఓ కంపెనీని స్థాపించగానే వేయి కోట్ల లాభాలు వస్తాయని ఆశించడం అత్యాశ అవుతుంది. మార్కెట్‌ సూత్రాలకు అనుగుణంగా మీ వ్యాపార లావాదేవీలు, ఉత్పత్తిలో నాణ్యత, సరఫరా, ధర, మీ సేవలు మొదలైన వాటిపైన మీరు స్థాపించిన కంపెనీ భవిష్యత్‌ ఆధారపడుతుంది. స్మార్ట్‌ఫోన్‌ సేవలలో ప్రపంచం వ్యాప్తంగా మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న ‘నొకియా’ కంపెనీ ఆ తర్వాత ఎందుకు నిలబడలేకపోయిందో ఓసారి ఆలోచించండి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానానికి అందుకోలేకపోయింది. ఫలితంగా దాని స్థానాన్ని సామ్‌సంగ్‌, ఐ-ఫోన్‌ మొదలైనవి ఆక్రమించాయి. క్రమంగా నొకియా కనుమరుగైంది.
ఈ సత్యం ఒక్క నోకియాకి మాత్రమే కాదు. ప్రతి వ్యాపారానికీ వర్తిస్తుంది. ఎప్పటికప్పుడు మీ ఆలోచనలు, భావాలు, సూత్రాలు, సిద్ధాంతాల్లో వైవిధ్యం, సజనాత్మకత వుండాలి. లేకపోతే పోటీ ప్రపంచంలో రాణించలేరు. అంతెందుకు ‘బజాజ్‌ చేతక్‌’ స్కూటర్‌ ‘హమారా బజాబ్‌’ అంటూ అందరి హదయాలను దొచుకున్న ఆ స్కూటర్‌్‌ రెండు దశాబ్దాల పాటు కనుమరుగై మళ్లీ నేడు ఎలక్ట్రానిక్‌ స్కూటర్లని తయారు చేస్తుంది. అది తిరిగి పునర్వైభవం పొందుతుందా లేదా అన్నది ప్రశ్న.
అందుకే మీ భవిష్యత్తు చిలక జోస్యం చెప్పేవాడి వద్దనో, డాక్టర్‌ చేతిలోనో, లేదా మీ దగ్గరి బంధువుల వద్దనో వుండదు. మీ చేతిలోనే వుంటుంది. మీరు చేసే ఆలోచనలపై ఆధారపడి వుంటుంది. యుద్ధ భూమిలోకి వెళ్ళిన అర్జునుడికి తన వారందరిని చూసి వైరాగ్యం పట్టుకుంటే, కష్ణుడు చేసిన గీతోపదేశం తిరిగి కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. మరి మీకు? సొంతంగా ఎవరికి వారు చైతన్యం పొందాలి తప్ప, ఎవరో వచ్చి కర్తవ్యోపదేశం చేయరు. సొంత నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

కిరాణా దుకాణానికి వెళ్ళిన మీరు కావలసినవే ఖరీదు చేస్తారు తప్ప అనవసరమైనవి కొని డబ్బులు వథా చేయరు కదా. కాలం/ విధి కూడా మీకు సమయానుకులంగా మీకు కావలసినదే (మీ సంకల్పం బలమైనదైతే) మీ చెంతకు పంపుతుంది. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే వద్ధిలోకి వస్తారు. దుర్వినియోగం చేసుకుంటే కిందకు పడిపోతారు. యిది వ్యక్తికైనా, వ్యాపారస్థుడికైనా వర్తించే సూత్రం. ఈ సందర్భంగా ఓ చిన్న కథను చదవండి.
ఓ తాగుబోతు వ్యక్తికి ఇద్దరు కొడుకులు. అతడు రోజూ రాత్రి బాగా తాగి వచ్చి భార్యాపిల్లలను వేధించేవాడు. కొద్ది రోజులకు భార్య మరణిస్తుంది.
అది తట్టుకోలేక ఇంకా మద్యానికి బానిసై ఇద్దరు పిల్లల పోషణభారం వహించలేక రాత్రివేళ వచ్చి పిల్లలను కూడా వేధించేవాడు. ఈ పిల్లలు పెద్దయ్యాక వాళ్లిద్దరిలో పెద్దవాడు తండ్రిని అనుసరించి తాగుబోతుగా మారుతాడు. రెండో వాడు తన తండ్రిని, అన్నని చూసి వాళ్లలా మారకూడదని శ్రద్ధగా చదువుకొని ఐపీఎస్‌ పాసవుతాడు. తమ్ముడు పోస్టింగ్‌ తీసుకునే రోజే అన్న తాగిన మైకంలో చేసిన నేరానికి జైలుశిక్ష పూర్తి చేసుకొని విడుదలవుతాడు. చూశారా ఇద్దరూ ఒకే కుటుంబం, ఒకే పరిసరాలలో పెరిగారు. ఒకడు నేరస్తుడిగా మారిపోతే, రెండోవాడు మంచి చెడు గుర్తించి, చదువుపై శ్రద్ధపెట్టి తన లక్ష్యాన్ని సాధించాడు. మీరు కూడా అంతే మీ మనస్సులో ఏది బలంగా నాటుకుంటే అదే చేస్తారు. అది మంచైనా చెడైనా. చెడుచేయడం తేలిక మంచిగా బతకడం కష్టం. మీరు ఏది ఎంచుకుంటారో మీ మానసిక స్థితిపై ఆధారపడి వుంటుంది.

ప్రతి మనిషికి జీవితం రెండు రకాల దారుల్ని ఇస్తుంది. ఒకటి మంచిగా బతకటం, రెండవది చెడ్డవ్యక్తిగా బతకడం, మొదటిది చాలా కష్టం, మీ ఎదురుగా చెడ్డ వ్యక్తులు చెడ్డ పరిసరాలు డ్రగ్స్‌, మద్యం, గంజాయి, సిగరెట్‌ వంటివి ఊరిస్తున్నప్పుడు వాటివైపు వెళ్ళకుండా నియంత్రించుకోవడం మీదే వ్యక్తిత్వం ఆధారపడి వుంటుంది. అప్పుడే గొప్పగా ఎదుగుతారు. ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పవాడిగా ఎదుగుతారు. అందుకే కెరీర్‌ పట్ల ఫోకస్‌ పెడితే విజయం వరిస్తుంది. ఫోకస్‌ పోతే కెరీర్‌ దూరమైతుంది. లక్ష్యం పట్ల శ్రద్ధపెట్టి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.
”83 సంవత్సరాల వయస్సులో అమితాబచ్చన్‌ కోట్లు సంపాదిస్తున్నప్పుడు మీ వయస్సెంతో ఒకసారి ఆలోచించండి. మీరు ఎక్కడ తడబడుతున్నారో పరిశీలించుకోండి. మీ కెరీర్‌కి ఎలాంటి బాటలు వేసుకుంటున్నారో, అవి సక్రమంగా వున్నాయో లేవో ఓసారి పరిశీలించుకోండి.
(ఈవ్యాసం ఇటీవలే విడుదలైన ”మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయి” వ్యక్తిత్వ వికాసం – కెరీర్‌ గైడెన్స్‌ పుస్తకంలో నుండి )

– డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -