వేముల ఎల్లయ్య రాసిన నవల ‘కక్క’. ఇది తెలంగాణ మాండలికం వాడుక భాషలో వెలువడిన తొలి దళితవాద నవల అనవచ్చు. ఈ పుస్తకం వచ్చి పాతిక సంవత్సరాలయ్యింది. ఈ నవలలను ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలలో ”లోకల్ కాంఫరిషన్స్ లాంగ్వేజ్ సబ్జెక్ట్”గా ఎంపిక చేయడం జరిగింది. మన దేశంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా సబ్జెక్ట్‌గా ఎంచుకోవడం జరిగింది. ఈ పుస్తకాన్ని కె.పురుషోత్తం, గీతా రామస్వామి వారు ఇంగ్లీష్ లోకి అనువదించారు.
కక్క అనే పాత్రదారుడు పటేండ్ల (దొరలు) దగ్గర జీతగానిగా పనిచేస్తూ పటేండ్లతో, పటేలమ్మతో మానసికంగా (బూతులు), శారీరకంగా గాయపడేవాడు. కక్క చదువుకోలేపోయిన తనలో చైతన్యం కలవాడిగా కనిపిస్తాడు. గ్రామీణ ప్రాంతాలలో వాస్తవిక జీవితాలను చూపించడం జరుగుతుంది.
కక్కని తల్లి కలెమ్మ పటేండ్లు కొడుకును పెట్టే బాధలకు జీతం మాన్పించే ప్రయత్నంలో ఘర్షణ తలెత్తుతుంది. ఆ ఘర్షణకు కక్క వాళ్ళ పెద్దయ్య కారణం. ఘర్షణ అనంతరం గ్రామ పెద్దమనుషులు కక్కని ఇంటిని సామూహిక అంతర్గత బహిష్కరణ చేయడం జరిగింది. ఆ అవమానం తట్టుకోలేని కక్క తల్లికి మరో పెళ్ళి చేస్తాడు. తల్లిని అత్తవారింటికి పంపే సందర్భంలో తల్లికొడుకుల భావోద్వేగాలు పాఠకుడిని కంటతడి పెట్టించేలా ఈ పుస్తకంలో ఉంటుంది.
ఒంటరిగా ఉన్న కక్కకి పకీరుతాతతో పరిచయం ఏర్పడుతుంది. తన దగ్గర కులవత్తులు నేర్చుకుంటాడు. పకీరుతాత మనవరాలితో పెళ్ళి ఖాయమై, పెళ్ళి కార్యక్రమాలు జరుగుతాయి. పెళ్ళి జరిగే ఇంటికి పుట్టమన్ను తెచ్చుకొని ఇంటికి అలుకుపోయడం ఆచారం. పుట్టమన్ను కొరకు వచ్చిన మాదిగలను అగ్రకులస్తుడైన రెడ్డిగారు సుదరోళ్ళతో ఉద్దేశపూర్వకంగా రెండుసార్లు దాడి చేయిస్తాడు. మూడవసారి దాడి చేయించే ప్రయత్నంలో మాదిగలు ప్రతిదాడి చేస్తారు. అది తీవ్రరూపం దాల్చి మాదిగలు పోలీసు స్టేషన్లలో ఉంటారు. పకీరయ్య వేసిన వేలిముద్ర తెల్లపేపర్ పటేల్ దగ్గర ఉండడం అందుకు కారణం. అది ఎలాగో ఈ పుస్తకం అధ్యయనం చేయడం ద్వారా తెలుస్తుంది.
చివరకు గ్రామంలోని మాదిగలకు, సిందులకు, సూదరోళ్ళకు గుడిసెల కొరకు భూమి పంపిణీ చేయాలని నిర్ణయానికి వస్తారు. దీనికి ఆధిపత్య కులాలు ససేమిరా అంటూ వాగ్వాదానికి దారి తీస్తుంది. ఈ వాగ్వాదంలో కమ్యూనిస్టులు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం ఈ నవలలో కనిపిస్తుంది. తెలంగాణ భాష, యాస మీద ఏమాత్రం అవగాహన లేనివారు ఈ పుస్తకం త్వరగా అర్థం చేసుకోలేరు. ఈ పుస్తకానికి ఇప్పటికీ విశేషమైన ఆదరణ లభిస్తుంది.
అక్షరజ్వాల, 9010483021



