Sunday, April 26, 2026
E-PAPER
Homeసోపతిసహస్ర సృజనల వైభవం

సహస్ర సృజనల వైభవం

- Advertisement -

అక్షరం కేవలం భావవ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు, అది కాలాన్ని దాటే సాక్ష్యం, సమాజాన్ని మేల్కొలిపే శక్తి, మానవ విలువలను నిలబెట్టే ధర్మధ్వజం. అలాంటి అక్షరసాధనను తపస్సుగా స్వీకరించి, భావాన్ని బాధ్యతగా మలిచి, ఆలోచనను ఆవిష్కరణగా మార్చిన సాహిత్యకారుని ప్రస్థానం సాధారణ రచనా యానం కాదు… అది ఒక సాహిత్య దీక్ష, ఒక చైతన్య ప్రయాణం. శతాధిక పత్రికలను సాక్షిగా చేసుకుని సహస్ర సృజనల వైభవాన్ని విరాజిల్లించిన ఆత్మనిబద్ధ కలం వెనుక ఉన్న సాధన, సమాజంపై ఉన్న నిబద్ధత, అక్షరాలపై ఉన్న ఆరాధన ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే మహత్తర ప్రమాణాలు… తన ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్న రచయితలలో చిటికెన కిరణ్‌ కుమార్‌ ఒకరు.

అక్షరాలపై అపారమైన అభిమానం, సామాజిక అంశాలపై స్పష్టమైన అవగాహన, విశ్లేషణాత్మక దృక్పథం… ఇవన్నీ ఆయన రచనా స్వభావాన్ని నిర్వచిస్తాయి. పత్రికా ప్రపంచం నుంచి సాహిత్య వేదికల వరకు ఆయన పేరు గౌరవంగా వినిపించడం ఆయన నిరంతర కృషికి నిదర్శనం.
కిరణ్‌ కుమార్‌ రచనల్లో ప్రధానంగా కనిపించే అంశం ‘సామాజిక చైతన్యం’. మన సమాజంలో మానవ విలువలు తగ్గిపోతున్నాయనే ఆలోచన ఆయన వ్యాసాల్లో స్పష్టంగా వ్యక్తమవుతుంది. చదువు, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్‌ యుగంలో సామాజిక న్యాయం, దేశభక్తి వంటి విభిన్న అంశాలపై ఆయన నిరంతరం స్పందిస్తూ ఉంటారు. సమస్యను మాత్రమే ప్రస్తావించకుండా, దాని లోతులను విశ్లేషించడం ఆయన రచనా లక్షణం.
పత్రికలలో ప్రచురితమైన అనేక వ్యాసాలు ఆయన ఆలోచనా పరిధి విస్తృతిని తెలియజేస్తాయి. సమకాలీన పరిణామాలను అధ్యయనం చేసి, వాటిపై తన అభిప్రాయాన్ని సమగ్రంగా వ్యక్తపరచడం ఆయన రచనల ప్రత్యేకత. అందువల్లే ఆయన రచనలు పాఠకుడిని ఆలోచింపజేసే శక్తిని కలిగి ఉంటాయి.
వివిధ పత్రికలలో ఆయనపై వచ్చిన విశ్లేషణలు చూస్తే, ఆయనను కేవలం రచయితగా కాకుండా సామాజిక చింతకుడిగా కూడా గుర్తించినట్లు స్పష్టమవుతుంది.
కిరణ్‌ కుమార్‌ అనేక సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. ఆయన కషికి జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ‘డా. వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కారం’ అందుకోవడం ఆయన సాహిత్య ప్రయాణంలో ఒక విశిష్ట ఘట్టంగా నిలిచింది. ఇతర అనేక పురస్కారాలు కూడా ఆయన సాహిత్య సేవకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

అతని రచనా ప్రయాణం ఒక్కరోజులో ఆవిర్భవించినది కాదు. నిరంతర సాధన, అధ్యయనం, సమాజంపై గమనిక… ఇవన్నీ కలసి ఆయనను ఈ స్థాయికి చేర్చాయి. ప్రతి వ్యాసం వెనుక ఒక పరిశీలన, ప్రతి ఆలోచన వెనుక ఒక బాధ్యత స్పష్టంగా కనిపిస్తుంది.
కిరణ్‌ కుమార్‌ జన్మస్థలం సిరిసిల్ల. కవిగా ఆయన భావోద్వేగాలను, సమాజంలోని వివిధ కోణాలను విశ్లేషణాత్మకంగా రాస్తారు. విమర్శకుడిగా సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసి నిర్మాణాత్మక దక్పథంతో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. భావానికి భాషను, ఆలోచనకు ఆకతిని ఇచ్చే సామర్థ్యం ఆయనకు సహజసిద్ధం. ఈ విధంగా కవిత్వం, కథ, వ్యాసం, సాహిత్య విమర్శ రంగాలలో తనకంటూ ప్రత్యేకమైన ప్రస్థానాన్ని నిర్మించుకున్నారు.
ఆయన సాహిత్య ప్రస్థానం విస్తతమైనది, ప్రభావవంతమైనది. వంద పైచిలుకు పత్రికలలో వేల రచనలు అచ్చుకావడం ఆయన కలానికి వచ్చిన విశేష ఆదరణకు నిదర్శనం. సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కోణాలలో ఆయన రచనలు చేశారు. ఆయన వెలువరించిన ‘చైతన్య స్ఫూర్తి.. చిటికెన వ్యాసాలు’ సంపుటి ఆలోచనా లోతుతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ‘మగ్గం మాట్లాడింది’ అనే కవిత శక్తివంతమైన ప్రతిధ్వనిగా నిలిచి, సాహిత్య లోకానికే కాకుండా చేనేతల కన్నీటి గాథలను హదయాన్ని కదిలించేలా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఆయన సేవలను గుర్తిస్తూ ఇంటర్నేషనల్‌ బెనెఓలెంట్‌ రీసర్చ్‌ ఫోరం సభ్యుడిగా కొనసాగుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అనేకం అందుకున్న ఆయన ముఖ్యమంత్రులు, గవర్నర్లచే సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు.

కిరణ్‌ కుమార్‌ రచించిన ‘ఓ తండ్రి తీర్పు’ సామాజిక కోణంలో ఆవిష్కరించబడిన గాఢమైన భావోద్వేగ కథగా విశేష గుర్తింపు పొందింది. కుటుంబ విలువలు, బాధ్యత, నైతిక సంఘర్షణ వంటి అంశాలను హదయాన్ని కదిలించే రీతిలో ప్రతిబింబించిన ఈ కథ పాఠకుల్లో ఆలోచన రేకెత్తించింది. ‘ఓ తండ్రి తీర్పు’ లఘు చిత్రాన్ని చిటికెన కిరణ్‌ కుమార్‌ రచించారు. ఇది మంచి ఆదరణ పొందడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి రెండు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డులు అందుకుంది. కథగా ప్రారంభమైన ఆ ఆలోచన లఘు చిత్ర రూపంలో విస్తరించి సమాజానికి గాఢమైన సందేశాన్ని చేరవేసింది.
అక్షరాన్ని ఆరాధనగా, ఆలోచనను బాధ్యతగా, సాహిత్యాన్ని సమాజానికి సేవగా స్వీకరించిన రచయితగా చిటికెన కిరణ్‌ కుమార్‌ ప్రస్థానం విశిష్టమైనదిగా నిలుస్తుంది. కవిత్వంలో సున్నితత్వం, కథల్లో కన్నీటి గాథలు, వ్యాసరచనలో విశ్లేషణాత్మకత, విమర్శలో నిర్మాణాత్మక దృక్పథం ఈ మూడు ధారలు కలిసి ఆయన కలాన్ని సమకాలీన సాహిత్యంలో ప్రత్యేక స్వరంగా నిలబెట్టాయి. మారే పరిస్థితులను అక్షరాల్లో ఆవిష్కరించుతూ, విలువలను పదిలపరుస్తూ, చైతన్యాన్ని రగిలించే ఆ కలం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది.

సోపతి డెస్క్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -