Sunday, April 26, 2026
E-PAPER
Homeసోపతిబోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్టా

బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్టా

- Advertisement -

కేతిగాడు : అనుకున్నదొక్కటి… అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌ పిట్టా.. ఆహా… బిజెపి పిట్టా…
జుట్టుపోలుగాడు : మా బిజెపోళ్లను ఇలా ఆటపట్టించడం ఏం బాగోలా. నేను కూడా సోలో ట్రాజెడీ యాక్షన్‌ చేయగలను తెల్సా… అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదేలే.. అదేమిటో ఆడదంటే ప్రతివానికి అలుసులే. మీ కాంగ్రెసోళ్లు ఎప్పుడూ ఇంతే మహిళా ద్రోహులే.
కేతిగాడు : నువ్వు శాలువా కప్పుకుని ఎంతగా కన్నీరు పెట్టుకున్నా నీ మాటలు అసలెవరూ వినరు. మీ వ్యూహం బెడిసికొట్టింది.
జుట్టుపోలుగాడు : మా నిజాయితీని మీరు శంకిస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఓడగొట్టి పైగా సంబరాలా..?
బంగారక్క : ఆ.. ఆ… కంగారు పడకండి. అసలు విషయానికి వద్దాం. పైపై కొట్లాటలతో ప్రజలకు ఒరిగేదేముండదు. రాజ్యాంగ సవరణ బిల్లు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, చట్టసభల నియోజకవర్గాల పునర్‌ వర్గీకరణ బిల్లు అన్నీ కలిపి సంయుక్తంగా బిజెపి ప్రభుత్వం హడావుడిగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
జుట్టుపోలుగాడు : ఆ తీర్మానం నెగ్గితే ఇక మా బిజెపి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఢోకానే వుండేది కాదు. తెల్సా?
కేతిగాడు : ఒకవేళ ఓడిపోతే.. మహిళా సెంటిమెంట్‌ను బాగా రెచ్చగొట్టి మహిళా ఓట్లు, సానుభూతి పొందవచ్చని ఆశ… అబ్బా! ఆశ.. దోశ.. అప్పడం. అందుకే మీ పప్పులేం వుడకలేదు.
జుట్టుపోలుగాడు : రేరు కేతిగా… రాష్ట్రపతిగా మొట్టమొదటిసారి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది మా బిజెపి కాదా? కీలకమైన ఆర్థికశాఖను నిర్మలా సీతారామన్‌కు అప్పగించింది మా బిజెపి కాదా?
కేతిగాడు : రేరు జుట్టుపోలుగా… చరిత్రను ఓ సారి చదువుకోరా. సతీసహగమన నిషేధానికి నడుంకట్టింది రాజా రామ్మోహన్‌రారు. బాల్యావివాహాలు వద్దని, వితంతు పునర్వివాహాలు జరగాలని కోరుకుంది వీరేశలింగం పంతులు. అంతెందుకు స్త్రీలకు విద్యకు కావాలని బాలికలకు బడులు పెట్టింది సావిత్రీబాయి పూలే. మహిళా ఉద్దారకులు అంటే వార్రా. వేషాలు వేయడం కాదు.
బంకారక్క : ఆగండ్రా. ముందు నే చెప్పేది వినండి. అసలు రెండున్నర ఏళ్లకు క్రితమే 2023లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. మరల దీనిని ముందుపెట్టి, చట్టసభ స్థానాలను అడ్డగోలుగా పెంచి, అందుకు రాజ్యాంగ సవరణ గావించేందుకు ఇలా కలగాపులకం చేసి బిల్లును ప్రవేశపెట్టింది బిజెపి. 528 మంది ఓటింగ్‌లో పాల్గొంటే, ఈ బిల్లు ఆమోదానికి మూడింట రెండింతలు మెజారిటీ రావాలి. అంటే 352 రావాలి. కాని వచ్చింది. 298 ఓట్లు మాత్రమే. వ్యతిరేకంగా వచ్చింది 230.
కేతిగాడు : ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుద్దో వాడే పండుగాడు’. అలా బిజెపోళ్లకు మైండ్‌ ఇప్పుడు బ్లాక్‌ అయింది కదా అమ్మీ.
జుట్టుపోలుగాడు : అవునక్కా… బిల్లు ఓడిపోతుందని మాకు ఏకోసానా లేదు. సంబరాలు చేసుకుందామని మా మహిళా నాయకులందర్నీ ఢిల్లీకి రప్పించారు మా వాళ్లు. బిల్లు పాసవడానికి ఎలాంటి అడ్డంకులు లేవు అన్నారు. కానీ ఘోరం జరిగిపోయిందక్కో… అక్కా…
బంగారక్క : ఏడుపు ఆపి విషయం వినరా.. 2026లో జరిగే జనగణనాననంతరం నియోజకవర్గాల పునర్విభజన. ఆ తర్వాతనే చట్టసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్‌ అమలు అని అప్పుడే మహిళా రిజర్వేషన్‌ బిల్లులో పొందుపరిచారు కూడా. నిజంగా మీ బిజెపి వారికి చిత్తశుద్ధి వుంటే 2025లో తక్షణం జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో అమలు చేయాలని విపక్షాలు అప్పుడే డిమాండ్‌ చేశాయి. అప్పుడు పెడచెవిన పెట్టిన బిజెపి ఇప్పుడు తగుదునమ్మా అని ముందుకు రావడం విచిత్రం కదా…
కేతిగాడు : ఈ లోగుట్టును ప్రజలు తెలుసుకోలేరని భావించడమే ఇంకా విచిత్రం అమ్మీ..
బంగారక్క : ‘అబ్‌కే బార్‌ చార్‌ సౌపార్‌'(నాలుగొందల సీట్టు దాటుతాం) అని గొప్పలు పోయిన మోడీషా ద్వయం ఆ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ రాక తెలుగుదేశం, జెడియు నితీష్‌ పార్టీ ఊత కర్రలతో బిజెపి సర్కార్‌ నిలబడ్డ విషయం అందరికీ తెలిసిందే.
ఇక అసలు విషయం… రాబోయే ఎన్నికల్లోనే కాదు, శాశ్వతంగా ఢిల్లీ సింహాసనం చేజిక్కించుకోవాలనే దుగ్దతో ఇప్పుడీ కొత్త ఎత్తు వేశారు. రాజ్యాంగ సవరణ 2/3 మెజార్టీతో నెగ్గితే ఇక సాధారణ మెజార్టీ మందబలంతో అన్నీ చట్టాలను మసిపూసి మారేడు కాయ చెయ్యొచ్చని అనుకున్నారు.
కేతిగాడు : ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా అమ్మీ..?
బంగారక్క : నీ మాటకు బలం చేకూర్చే పని ఇంకోటి. జనాభాతో నిమిత్తం లేకుండా 50 శాతం సీట్లు పెంచుతామని పైకి చెబుతున్న అంశాన్ని పోనీ నిజాయితీగా ఈ బిల్లులో పొందుపరిచారా అంటే అదీ లేదు. నోటిమాటగా చెప్పారు.
కేతిగాడు : పార్లమెంటు అన్నా, ప్రతిపక్షం అన్నా, రాజ్యాంగం అన్నా వీరికి ఎంత చిన్న చూపు అమ్మీ.
బంగారక్క : ఒకవేళ బిల్లు గనుక నెగ్గి అమలయితే భారీగా నష్టపోయేది దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలే. సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు లేక కేంద్ర పెత్తనానికి బానిసల్లా లొంగిపోయే పరిస్థితి ఏర్పడేది. అందుకే తమిళనాడు స్టాలిన్‌ వంటివారు దీన్ని బలంగా వ్యతిరేకించారు. ఇకపోతే 2026 జనగణన అంటే కుల గణన కూడా లెక్కలోకి రావాలి. అప్పుడు మహిళలతో పాటు బడుగు బలహీనవర్గాల వారికి రిజర్వేషన్‌ ఇవ్వాలి. అలాకాకుండా జరగాలంటే బిల్లును ఎలాగో అలా దొడ్డిదారిలో అమలుపరుచుకోవాలి. ఈ కుట్రను గమనించారు గనుకనే సమాజవాది, ఆర్‌జెడి పార్టీలు నిర్ద్వందంగా ఈ బిల్లును వ్యతిరేకించాయి.
కేతిగాడు : వామ్మో.. వామ్మో… ఎంత ఘోరం?
బంగారక్క : అందుకే బిల్లు ఆగిపోయిందనే బాధ కంటే కుట్ర భగమైందనే బాధే ఎక్కువైంది బిజెపికి.
కేతిగాడు : దీన్నే ‘దొంగ బాధ కంటే లింగ బాధ ఎక్కువైందని’ అంటారు మరి.
బంగారక్క : అసలు ఈ గోలంతా ఎందుకు? 2029 వరకు ఆగేకంటే తక్షణమే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలుపరిచేలా చట్టాన్ని సవరిస్తే తాము సహకరించడానికి సిద్ధం అంటూ విపక్షం ఎదురు సవాలు విసరడంతో బిజెపి నోట్లో వెలక్కాయ పడింది.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -