రామగిరి అనే రాజ్యాన్ని పాలించే ఉదయసేనుడికి ప్రజలు అంటే పంచ ప్రాణాలు. తను సాధారణ జీవితాన్ని గడుపుతూ నిత్యం ప్రజల యోగ క్షేమాల కోసం ఆలోచిస్తాడు.అన్ని రాజ్యాల కంటే రామగిరి రాజ్యం సుఖ సంతోషాలతో ఉండడం చూసి పొరుగు రాజులు అసూయ చెందేవారు. రామగిరి రాజ్యాన్ని ఆక్రమించడానికి వారు ఎన్నో సార్లు దాడులు చేసారు.ప్రతి సారి వారికి ఓటమే ఎదురైంది.కారణం ఉదయ సేనుడి తెల్ల గుర్రం.
శత్రు రాజులు దాడి చేసిన ప్రతి సారి ఉదయ సేనుడే స్వయంగా తెల్ల గుర్రం పై యుద్ధంలో పాల్గొనేవాడు. తెల్ల గుర్రం అత్యంత శక్తి వంతమైనది.వేగంగా పరుగెత్తగలదు. శత్రు సైనికులపై ఎగిరి దూకగలదు.వంద మంది సైనికుల పని గుర్రం ఒక్కటే చేయడం చూసి శత్రు రాజ్యాలు ఓటమి తో వెనుతిరిగాయి.
రామగిరి పొరుగున ఉన్న ఆరుగురు రాజులు ఒకేసారి ఉదయ సేనుడి పై దండయాత్ర చేయాలని,ముందుగా తెల్ల గుర్రాన్ని ఎత్తుకు రావాలని కొందరు గజ దొంగలను రామగిరి లోకి పంపించారు.
ఇరవై మంది దొంగలు యాత్రికుల వేషంలో రాజ్యంలోకి ప్రవేశించారు. రాజు ని చూడాలనే కోరికతో రాజా భవనంలోకి వచ్చి,దొంగ చాటుగా అశ్వశాల లోకి వెళ్ళారు.అక్కడ తెల్ల గుర్రానికి రక్షణగా పది ఎర్ర గుర్రాలు ఉన్నాయి.
దొంగలను పసి కట్టిన గుర్రాలు వారిపై దూకి తొక్కి చంపేసాయి.దొంగల శవాలను రాజ్యం వెలుపల పడేసారు.
”నేను తలచుకుంటే మీ రాజ్యాలను తేలికగా ఆక్రమించు కోగలను.నేను ఆ పని చేయను.నాకు రాజ్య కాంక్ష లేదు. అసూయ మాని ప్రజా క్షేమం పై దష్టి పెట్టండి ”అని ఆరు రాజ్యాలకు హెచ్చరించాడు. ఉదయ సేనుడిని ఓడించడం కంటే అతనిలా రాజ్యాన్ని పాలించడమే సరైందని పొరుగు రాజులకు అర్థమైంది.
దుర్గమ్ భైతి, 9959007914



