ఉదయగిరి గ్రామ పెద్ద ధర్మరాజుకు ఊరి ప్రజలంటే చాలా ఇష్టం. ప్రతి రోజు ఉదయం ప్రజల యోగ క్షేమాలు తెలుసుకున్న తర్వాతే, మిగతా పనులు ప్రారంభిస్తాడు. ప్రతి సంవత్సరం ప్రజలకు ఉపయోగపడే పనులు చేసిన వారిని గుర్తించి, స్వాతంత్ర దినోత్సవం రోజున సన్మానించడం అనవాయితీ గా చేస్తున్నాడు. భూదానం, వస్త్ర దానం, విద్యా దానం, రక్త దానం, అన్న దానం లాంటి సామాజిక సేవా గుణం కల వారు ఊరిలో కొంత మంది ఉన్నారు.. అందులో వారెవరిని కాకుండా ధర్మరాజు ఈ సారి సన్మానానికి బీరప్పను ఎంపిక చేయడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. బీరప్ప రైతు కూలీ. వేసవి కాలంలో తన ఊరిలో చలివేంద్రము ఏర్పాటు చేసాడు. ”చాలా మందితో పోల్చుకుంటే, బీరప్ప చేసింది మామూలు సేవనే కదా” కొందరు గ్రామస్తులు ధర్మరాజును ప్రశ్నించారు.
”నిజమే. మిగతా వారు తమ కున్న దాంట్లో కొంత భాగం దానం చేసారు. అది గొప్ప విషయమే. కాదనను. వేసవి కాలం మండే ఎండలో దారి వెంబడి నడుస్తున్న బాటసారుల దాహార్తి తీర్చడానికి బీరప్ప చలివేంద్రము ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రతి రోజు వాటికి నీరు అందించడం సామాన్యమైన విషయమా? బీరప్ప ఒక కూలీ. పొలంలో పని చేస్తేనే పూట గడుస్తుంది. అపరిచిత బాటసారుల కోసం అతడు నిత్యం నీటి దానం చేయడం నా దష్టిలో అత్యుత్తమ సేవా కార్యం ”అని ధర్మరాజు చెప్పగానే రచ్చబండ చప్పట్లతో మారు మ్రోగింది.
– దుర్గమ్ భైతి, 9959007914



