రాము, శ్రీను అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే బడిలో, ఒకే తరగతి చదువుతున్నారు. రాముకి మొక్కలంటే ప్రాణం. ఒకరోజు తను తిన్న మామిడి పండు టెంకను వాళ్ళ ఇంటి వెనుక పెరట్లో ఎంతో ఆశగా నాటాడు. ప్రతిరోజూ బడి నుండి రాగానే ఆ మొక్క చుట్టూ ఉన్న కలుపు తీసి, ప్రేమగా నీరు పోసేవాడు. రాము సంరక్షణలో ఆ చిన్న మొక్క క్రమేపి పచ్చగా ఎదుగుతోంది. ఒక రోజు సాయంత్రం రాము, శ్రీను కలిసి ఆ పెరట్లోనే ఆడుకుంటున్నారు. ఆట జోరులో శ్రీను బంతిని చాలా బలంగా కొట్టాడు. దుర దృష్టవశాత్తూ ఆ బంతి వెళ్ళి సరిగ్గా ఎదుగుతున్న మామిడి మొక్కకు తగిలింది. అంతే… ఆ దెబ్బకు మొక్క మధ్యలోని ప్రధాన కాండం మొదట్లోకి విరిగి కిందకు వాలిపోయింది. అది చూసి రాము గుండె పగిలినంత పనైంది. ”శ్రీనూ… ఎంత పని చేశావ్! నా ప్రాణం లాంటి మొక్కను ఎందుకు ఇలా విరిచేసావు? ఇప్పుడు అది చచ్చిపోతుంది కదా!” అంటూ ఏడుస్తూ గట్టిగా అరిచాడు. శ్రీను భయంతో, బాధతో వణికిపోతూ… ”క్షమించు రామూ! నేను కావాలని చేయలేదు. ఆటలో బంతి అలా వెళ్ళింది కానీ, నీ మొక్కను బాధపెట్టాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు” అని బ్రతిమాలాడు. కానీ కోపంతో ఊగిపోతున్న రాము, ”నీతో ఇక జీవితంలో మాట్లాడను! నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపో!” అంటూ శ్రీనును వెనక్కి తోసేసాడు. శ్రీను తన తప్పుకు ఎంత ప్రాధేయపడినా, కన్నీరు పెట్టుకున్నా రాము మనసు కరగలేదు.
ఆ రోజు నుండి రాము, శ్రీనుతో మాట్లాడటం పూర్తిగా మానేశాడు. బడిలో కూడా ఎప్పుడూ పక్కపక్కనే కూర్చునేవాళ్ళు కాస్తా, ఇప్పుడు దూరంగా కూర్చోవడం మొదలుపెట్టారు. శ్రీను పలకరించాలని చూసినా రాము మొహం తిప్పుకునేవాడు. కొన్ని రోజుల తరువాత రాముకి తీవ్రమైన జ్వరం వచ్చింది. కళ్ళు తెరవడానికి కూడా ఓపిక లేనంత నిస్సత్తువ ఆవహించింది. దాంతో వారం రోజుల పాటు బడికి వెళ్ళలేకపోయాడు. వారం తర్వాత జ్వరం తగ్గి కాస్త కోలుకున్నాక, బడికి వెళ్ళాలని రాము తన పుస్తకాల బ్యాగు తెరిచాడు. ఆశ్చర్యం! తను బడికి వెళ్లని ఆ వారం రోజుల హోం వర్కులు, నోట్స్ అన్నీ పూర్తిగా రాసి ఉన్నాయి. ఆ చేతివ్రాత చూడగానే రాముకి అది తన స్నేహితుడు శ్రీనుదేనని వెంటనే అర్థమైపోయింది. రాము మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. వెంటనే అమ్మను వెతుకుతూ పెరట్లోకి పరుగెత్తాడు. అక్కడ అతనికి మరో పెద్ద ఆశ్చర్యం ఎదురైంది. విరిగిపోయిన ఆ మామిడి మొక్క, చనిపోలేదు సరే కదా… కొత్త చిగుర్లతో పచ్చగా కళకళలాడుతోంది! అమ్మ దానికి ఎంతో ప్రేమగా నీళ్ళు పోస్తోంది. ”అమ్మా! ఇది… ఇది ఎలా సాధ్యమైంది…?” ఆశ్చర్యంతో నోట మాట రాక మొక్కను చూపిస్తూ అడిగాడు రాము.
అమ్మ నవ్వుతూ, ”రామూ… నీకు జ్వరం వచ్చిన రోజు నుండి శ్రీను ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడికి వస్తున్నాడు.
నువ్వు లేకపోయినా ఈ మొక్క ఎండిపోకూడదని దీనికి ఎంతో జాగ్రత్తగా నీళ్ళు పోసి కాపాడాడు. అంతేకాదు, నువ్వు చదువులో వెనకబడకూడదని రోజు బడిలో ఏం జరిగిందో తెలుసుకుని, నీ నోట్సులన్నీ తనే కూర్చుని రాసాడు” అంది. అమ్మ మాటలు వినగానే రాము కళ్ళు నీటితో నిండిపోయాయి. కోపంతో తను చేసిన తప్పు, శ్రీను చూపించిన నిఖార్సయిన స్నేహం అతనికి అర్థమయ్యాయి. కళ్ళు తుడుచుకుంటూ, పశ్చాత్తాపంతో ఆ మొక్క పక్కనే ఉన్న ఒక రాయి మీద చాక్ పీస్ తో పెద్ద అక్షరాలతో ఇలా వ్రాసాడు. ”క్షమాగుణం స్నేహానికి మూలం” ఆ వాక్యాన్ని, కొడుకు మారిన మనసును చూసి అమ్మ కళ్ళు ఆనందంతో మెరిసాయి. ఆ మరుసటి రోజు నుండి రాము, శ్రీనుల స్నేహం ఆ మామిడి మొక్కలాగే మరింత బలంగా చిగురించింది.
– కె.వి.సుమలత, 9492656255



