Sunday, July 12, 2026
E-PAPER
Homeజోష్కంఫర్ట్ జోన్ దాటి రా...

కంఫర్ట్ జోన్ దాటి రా…

- Advertisement -

నువ్వు కూర్చున్న చోటు చాలా హాయిగా, సురక్షితంగా ఉండొచ్చు… కానీ గుర్తుపెట్టుకో, నౌకలు రేవులో ఉన్నంతసేపు చాలా సురక్షితంగా ఉంటాయి. కానీ అవి ఉన్నది రేవులో ఆగిపోవడానికి కాదు, తుఫానులను ఎదుర్కొంటూ సముద్రాన్ని శాసించడానికి. మన జీవితం కూడా ఇంతే. అలవాటైన పనులు, తెలిసిన దారులు, పెద్దగా కష్టపడక్కర్లేని దినచర్య… దీనినే ‘కంఫర్ట్‌ జోన్‌’ (Comfort Zone)అంటారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఏదీ కొత్తగా మొలకెత్తదు. అభివృద్ధి అనేది ఎప్పుడూ కంఫర్ట్‌ జోన్‌కు అవతలే మొదలవుతుంది. నీ కంఫర్ట్‌ జోన్‌ దాటి బయటకు రావడానికి, నీ అసలైన సత్తా ఏంటో తెలుస్తుంది. అదేలాగో ఈ వారం జోష్‌లో తెలుసుకుందాం.

కొత్త పని మొదలుపెట్టేటప్పుడు లేదా నలుగురిలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా? భయం వేస్తోందా? అయితే నువ్వు కరెక్ట్‌ దారిలోనే ఉన్నావు! ఆ భయమే నువ్వు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నావు అనడానికి సంకేతం. భయం వేసినా సరే, ఆ అడుగు వేసేరు. ఒక్కసారి భయాన్ని దాటితే, ఆ తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్‌ నిన్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది.

‘నలుగురు ఏమనుకుంటారు’ అనే రోగానికి మందు వేరు
కంఫర్ట్‌ జోన్‌ నుంచి యువత బయటకు రాకపోవడానికి అతిపెద్ద కారణం… ‘నేను విఫలమైతే పక్కింటి వాళ్ళు ఏమంటారు? స్నేహితులు నవ్వుతారా?’ అనే భయం. నిజం చెప్పనా… నువ్వు గెలిచినా, ఓడినా ఈ ప్రపంచానికి కొద్దిరోజుల కంటే ఎక్కువ గుర్తుండదు. నీ జీవితానికి హీరోవి నువ్వే అయినప్పుడు, సైడ్‌ క్యారెక్టర్ల కామెంట్ల గురించి ఆలోచించడం మానేరు.

రోజుకు ఒక చిన్న ‘సవాల్‌’ విసురుకో
ఒక్కరోజే హిమాలయాలు ఎక్కేయాల్సిన అవసరం లేదు. నీ కంఫర్ట్‌ జోన్‌ బద్దలు కొట్టడానికి చిన్న చిన్న మార్పులు చాలు: ఎప్పుడూ నలుగురి వెనుక కూర్చునేవాడివి అయితే, ఈరోజు ముందు సీట్లో కూర్చో. స్టేజ్‌ ఎక్కాలంటే భయమైతే, కనీసం ఒక మీటింగ్‌లో లేచి ఒక ప్రశ్న అడుగు లేదా నీ అభిప్రాయం చెప్పు.
నీకు రాని, కొత్తగా నేర్చుకోవాలనుకున్న స్కిల్‌ (కోడింగ్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌, కొత్త లాంగ్వేజ్‌) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించు.

తప్పులు చేయడానికి లైసెన్స్‌ ఇచ్చుకో
‘నేను పర్ఫెక్ట్‌గా చేయగలను’ అనుకున్నప్పుడే రంగంలోకి దిగుతాను అంటే, నువ్వు ఎప్పటికీ కంఫర్ట్‌ జోన్‌ దాటలేవు. తప్పులు చేయడం సహజం. గిరిజన తండాల నుంచి వచ్చే యంగ్‌ లీడర్లు గానీ, పల్లెటూళ్ల నుంచి వచ్చి ఐటీ రికార్డులు సృష్టిస్తున్న యువకులు గానీ మొదటి రోజే పర్ఫెక్ట్‌ లీడర్స్‌ కాలేదు. తప్పులు చేస్తూ, నేర్చుకుంటూ, వాటిని సరిదిద్దుకుంటూనే ఎదిగారు.

‘నా వల్ల కాదు’ అనే మాటను మార్చండి
ఏదైనా కొత్త అవకాశం వచ్చినప్పుడు ‘నాకు రాదు/నా వల్ల కాదు’ అని వెంటనే రిజెక్ట్‌ చేయకండి. ‘ప్రస్తుతానికి నాకు రాదు, కానీ నేను నేర్చుకోగలను’ అని మీకు మీరు చెప్పుకోండి. గిరిజన గూడాల నుంచి వచ్చే యువతీయువకులు మొదటి నుంచే గొప్ప లీడర్లుగా రారు. వారు ప్రతి అవకాశాన్ని ఒక పాఠంగా మార్చుకుని, నేర్చుకుంటూనే జాతీయ స్థాయికి ((National Youth Festival లాంటి వేదికలకు) చేరుకుంటారు.

‘రిజెక్షన్‌’ కు అలవాటు పడండి
మనం కొత్త పని మొదలుపెట్టినప్పుడు అందరూ అభినందించాలని లేదు. కొందరు విమర్శిస్తారు, కొన్నిసార్లు తిరస్కరణ (Rejection) ఎదురవుతుంది. బిజినెస్‌ ఐడియా ఫెయిల్‌ అవ్వచ్చు, ఇంటర్వ్యూలో రిజెక్ట్‌ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి.. ‘ప్రతి నో (NO) అనేది, మీ తదుపరి గెలుపునకు ఒక కొత్త అవకాశం (Next Opportunity).

కమ్యూనికేషన్‌ సరిహద్దులను దాటండి
మీకు అంతగా పరిచయం లేని వ్యక్తులతో, మీకంటే ఎక్కువ నాలెడ్జ్‌ ఉన్నవారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. వారి ఆలోచనా విధానం మీపై ప్రభావం చూపిస్తుంది. గ్రూప్‌ డిస్కషన్స్‌లో చురుగ్గా పాల్గొనండి. ప్రతిరోజూ చేసే పనులే చేస్తూ కూర్చుంటే, వచ్చే ఫలితాలు కూడా ఎప్పుడూ వచ్చేలాగే ఉంటాయి. నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే, నువ్వు ఎప్పుడూ చేయని పనులను మొదలుపెట్టాలి. సో.. కంఫర్ట్‌ జోన్‌ అంటూ నీకు నువ్వు నిర్మించుకున్న అందమైన జైలు నుంచి బయటకు రా. స్వేచ్ఛగా రెక్కలు విప్పు, నీ సామర్థ్యం ఏంటో నీకే తెలిసేలా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టు!

– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -