Sunday, July 5, 2026
E-PAPER
Homeనెమలీకఅసూయ మహా చెడ్డది

అసూయ మహా చెడ్డది

- Advertisement -

హరితారణ్యానికి రాజు కేసరి అనే సింహం. దానికి మంత్రి హస్తి అనే ఏనుగు. హస్తి బాగా ముసలిది అయ్యాక కేసరిని అనుమతి అడిగి విశ్రాంతి తీసుకోసాగింది. అడవిలో బాగా తెలివయిన వారెవరా అని ఆలోచించి కేసరి నక్కను తనమంత్రిగా నియమించుకుంది. నక్కను మంత్రిగా నియమించుకున్నప్పటి నుండి నక్క మీద మిగిలిన అడవి జంతువులకంతా అసూయ ఎక్కువయి పోయింది. ఒకరోజు తోడేలు కేసరిని కలిసి, ‘పోయి పోయి నక్కను మంత్రిగా చేసుకున్నారే! అదొక జిత్తులమారి’ అన్నది. ఆ విషయం కేసరి నక్కతో అన్నది. నక్క ఆశ్చర్యపోయింది. తోడేలు తనకు బాల్యమిత్రుడు. అతడే తనను అలా అన్నాడే అని బాధపడింది. తరువాత కొద్దిరోజులకు కుందేలు కేసరిని కలిసి ‘మీరేమిటీ? ఎవరూ దొరకనట్టు నక్కను మంత్రిగా పెట్టుకున్నారు. జాగ్రత్త. సమయం చూసి ముంచేయగలదు’ అన్నది.. ఆమాట కేసరి నక్కతో అన్నది. ‘అరే ఏమిటీ? కుందేలు అలా అన్నదా? కనపడగానే నక్కమామా అంటూ ఆప్యాయంగా పలకరిస్తుందే’ అని నక్క బాధపడింది.

తరువాత జింక కేసరిని కలిసి, ‘ప్రభూ! జాగ్రత్త! నక్క అసలే మంచి జంతువు కాదు’ అన్నది. ఈ విషయం కూడ కేసరి నక్కతో చెప్పింది. నక్క బాధ అంతా యింతా కాదు. ఎందుకంటే తనను జింక చూసినప్పుడల్లా’ అన్నా అంటూ ఆప్యాయత చూపిస్తుందే.. అలాంటి జింకే ఇలా అన్నదంటే ఏమనుకోవాలి? అనుకుంటూ కనిపించిన జంతువుకల్లా తోడేలు, కుందేలు, జింక చేసిన పని చెప్పిబాధ పడసాగింది. ఆ సంగతి కేసరికి తెలిసి,’ ఎంత మనకు దగ్గరవారయినా మనకు ఏదైనా గొప్ప మేలు జరిగినపుడు అసూయపడడం సహజం. ఆ అసూయ ద్వేషాన్ని కలిగించి చెడుగా మాట్లాడేటట్టు చేస్తుంది. అది విని మనం బాధ పడకూడదు. మన పని మనం చేసుకుంటూపోవాలి. అంతే తప్పవారి మాటలు గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు.. నీకీ విషయం తెలియజేయడానికే నిన్ను ఎవరేమన్నా వెంటనే నీకు చెప్పాను’ అన్నది కేసరి. మంచి పాఠం నేర్చుకున్నానని నక్క సంతోషించింది.

-డా . గంగిశెట్టి శివకుమార్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -