ధర్మవరంలో ధర్మయ్య, లక్ష్మమ్మ దంపతులు నివసించేవారు. వారికి చలపతి అనే ఒక్కగానొక్క కొడుకు.డిగ్రీ పూర్తయి రెండేళ్లు గడిచినా ఉద్యోగం చేయాలనే ఆలోచనే లేదు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గమనించే వాడు కాదు. అర్ధరాత్రి వరకు స్నేహితులతో కాలక్షేపం చేయడం, ఉదయం ఆలస్యంగా లేవడం, చిన్నచిన్న గొడవలు పడి తల్లిదండ్రులకు తలనొప్పి తెచ్చిపెట్టడం.. ఇదే అతని దినచర్య. భోజనం వేళకు మాత్రం ఎక్కడ ఉన్నా ఇంటికి చేరుకునేవాడు.ఒకరోజు స్నేహితులతో వెళ్లి, ఆ రోజంతా ఇంటికి రాలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు చలపతి. ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురుచూస్తున్న లక్ష్మమ్మ, ‘‘రా నాయనా! ఏమీ తినలేదు కదా’’ అంటూ భోజనం వడ్డించింది. ఆ దృశ్యం చూసిన ధర్మయ్య నిట్టూర్చుతూ, ‘‘గుర్రం గుడ్డిదైనా దాణాకి లోటు లేదంటారు.. మన పరిస్థితికూడా అలాగే ఉంది!’’ అన్నాడు.భోజనం చేస్తూనే చలపతి మెల్లగా, ‘‘అమ్మా.. నాన్న ఎందుకు అలా అన్నారు?’’ అని అడిగాడు.“అది ఒక సామెత బాబూ! పూర్వం ఒక రైతు గుర్రాన్ని కొన్నాడు. ఇంటికి తెచ్చాక అది గుడ్డిదని తెలిసింది. అది పొలంలో పని చెయ్యలేదు. బండి లాగలేదు. అమ్మేద్దామంటే ఎవరూ కొనరు. కానీ రోజూ దాణా పెట్టకపోతే అది బతకదు.
పనికిరాకపోయినా దాన్ని పోషించడం అతనికి తప్పలేదు. ఆ పరిస్థితిని చూసిన పెద్దలు ‘గుర్రం గుడ్డిదైనా దాణాకి లోటు లేదు’ అని అనేవారు. అలా ఆ సామెత వాడుకలోకి వచ్చింది.నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. చదువుకున్నావు. అయినా బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. మేం తల్లిదండ్రులం కాబట్టి నిన్ను ఆకలితో ఉంచలేం. కానీ ఎంతకాలం నీకు అండగా ఉంటామో తెలియదు. అందుకే మీ నాన్న అలా అన్నారు. ఇకనైనా నీ కాళ్లపై నువ్వు నిలబడే ప్రయత్నం చేయి’’ అని కొడుకు కళ్లలోకి చూస్తూ మెల్లగా అంది.ఆ మాటలు చలపతి గుండెల్లో గునపాల్లా దిగాయి. ఇన్నాళ్లూ తన కోసం తల్లిదండ్రులు పడిన కష్టం గుర్తుకొచ్చి ఆ రాత్రంతా నిద్రపోలేదు. మరుసటి ఉదయం బయోడేటాతో తండ్రి ముందుకొచ్చాడు. ‘‘నాన్నా.. ఇకపై మీకు భారంగా కాదు, భరోసాగా ఉంటాను. ఈ రోజే ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెడతాను’’ అన్నాడు.ఆ రోజే ఉద్యోగాలకోసం దరఖాస్తులు పంపించాడు. కొడుకులో వచ్చిన మార్పును చూసి లక్ష్మమ్మ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. ధర్మయ్య ముఖంలో తృప్తి నిండిన చిరునవ్వు విరిసింది.
కాశీవిశ్వనాథం పట్రాయుడు, 9494524445



