పనీర్‌ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. భారతీయ వంటకాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాల ఉత్పత్తి పనీర్? ఇళ్లలోనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్లు, క్యాటరింగ్ సంస్థల్లోనూ విస్తృతంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ప్రతి పనీర్ అసలైనది కాదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధరకు తయారయ్యే ‘అనలాగ్ పనీర్’ కూడా విస్తృతంగా వినియోగంలోకి వస్తోంది. అందువల్ల వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్నది నిజమైన పనీరా, అనలాగ్ పనీరా అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని తింటేనే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అసలు పనీర్ అంటే ఏమిటి?తాజా పాలను నిమ్మరసం లేదా సిట్రిక్ యాసిడ్‌తో గడ్డకట్టించి తయారుచేసే ఉత్పత్తినే పనీర్ అంటారు. ఇందులో సహజసిద్ధమైన పాల ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ B12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, క్రీడాకారులకు ఇది మంచి పోషకాహారంగా పరిగణిస్తారు.అనలాగ్ పన్నిర్ అంటే ఏమిటి..?అనలాగ్ పన్నిర్ అనేది పాలకు బదులుగా లేదా పాల పరిమాణాన్ని తగ్గించి వెజిటబుల్ ఆయిల్, స్టార్చ్, ఎమల్సిఫయర్లు, స్టెబిలైజర్లతో పాటు ఇతర అనుమతించిన ఆహార పదార్థాలతో తయారుచేసే ఉత్పత్తి. ఇది రూపంలో, రంగులో, రుచిలో పనీర్‌ను పోలి ఉన్నప్పటికీ పోషక విలువల్లో గణనీయమైన తేడా ఉంటుంది.ఇలా గుర్తించవచ్చు: ప్యాకెట్‌పై పదార్థాల జాబితా (Ingredients) తప్పనిసరిగా చదవాలి.
మొదటి పదార్థంగా పాలు ఉంటే అది అసలైన పనీర్ అయ్యే అవకాశం ఎక్కువ. వెజిటబుల్ ఆయిల్, తినదగిన ఆహారపు కొవ్వులు, పిండి పదార్ధం వంటి పదాలు ఉంటే అది అనలాగ్ ఉత్పత్తి కావచ్చు. అత్యంత తక్కువ ధరకు లభించే పనీర్ కొనుగోలు చేస్తే ముందు జాగ్రత్తలు వహించాలి. విశ్వసనీయ బ్రాండ్లు లేదా గుర్తింపు పొందిన పాల ఉత్పత్తుల విక్రయదారుల నుంచే కొనుగోలు చేయడం ఆరోగ్య శ్రేయస్కరం.వినియోగదారుల హక్కు: అనలాగ్ పనీర్ తయారు చేయడం నిషేధం కాదు. అయితే దాన్ని అసలు పనీర్‌గా విక్రయించడం లేదా వినియోగదారులకు తెలియజేయకుండా అందించడం మాత్రం నిషేధం. అందుకే ఆహార భద్రతా నిబంధనల ప్రకారం ఉత్పత్తిపై సరైన లేబులింగ్ ఉండాలి.నిపుణుల సూచనలు : పిల్లలకు, వృద్ధులకు, రోగులకు పాలతో తయారైన అసలైన పనీర్ ఇవ్వడం మంచిది. హోటళ్లలో పన్నిర్‌తో చేసిన వంటకాలు ఆర్డర్ చేసే ముందు ఉపయోగిస్తున్న పన్నిర్ గురించి అడగాలి. కొనేటపుడు ప్యాకెట్‌పై ఉన్న వివరాలు చదివి మాత్రమే కొనుగోలు చేయాలి. పోషక విలువల కోసం పనీర్ తినేవారు అసలు పాల పనీర్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు తినేది ఏమిటో తెలుసుకోవడం మీ హక్కు. లేబుల్ చదవడం మీ బాధ్యత. సరైన సమాచారం, ఆరోగ్యకరమైన ఆహారం సురక్షితమైన జీవనం. ఆవగాహనతో కొనండి, లేబుల్ చదవండి.

లేబుల్ చదవండి. అవగాహనతో కొనండి
అనలాగ్ పనీర్‌ను తయారు చేయడం లేదా విక్రయించడం నిషేధం కాదు. అయితే అది అసలు పాల పనీర్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తి అనే విషయాన్ని స్పష్టంగా లేబుల్‌పై పేర్కొనాలి. వినియోగదారులు కూడా ఉత్పత్తి వివరాలను చదివి, పదార్థాల జాబితా (Ingredients), పోషక విలువలు (Nutrition Facts), తయారీ వివరాలను పరిశీలించి కొనుగోలు చేసే అలవాటు పెంపొందించుకోవాలి. సరైన సమాచారం ఆధారంగా తీసుకునే ఆహార ఎంపికలే ఆరోగ్యాన్ని కాపాడతాయి. ‘లేబుల్ చదవండి. అవగాహనతో కొనండి’ అనే సందేశం ప్రతి వినియోగదారునికి చేరాలి.
ప్రొఫెసర్ డా.పి.మురళీధర్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, రసాయన శాస్త్ర విభాగం
డా.తలారీ శ్రీనివాసరావు, 9347488350



