Sunday, July 5, 2026
E-PAPER
Homeజాతీయం20 నుంచి ఆగ‌స్టు 13 వ‌ర‌కుcపార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు

20 నుంచి ఆగ‌స్టు 13 వ‌ర‌కుcపార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు

- Advertisement -


25 రోజుల పాటు స‌మావేశాలు..19 సిట్టింగ్‌లు
అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఎక్స్ వేదిక‌గా వెల్లడించారు. ఈ సమావేశాల్లో దేశానికి సంబంధిచిన కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని అన్నారు. దేశానికి సంబంధించిన అంశాలపై సానుకూల చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటీవల పలు కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓడిపోవడం, బీజేపీ అధికారంలోకి రావడం, ఆ పార్టీకి చెందిన ఎంపీలు రెబల్స్‌గా మారడం, ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో మరోసారి చీలిక, ఆప్ ఎంపీలు బీజేపీలో చేరడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర మరోసారి సభలో ప్రవేశపెట్టబోతుంది. వివాదాస్ప‌ద‌మైన 130 రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును ప‌రిశీలిస్తున్న జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీ (జేపీసీ) జులై 17న త‌న నివేదిక‌ను ఆమోదించే అవ‌కాశం ఉంది. తీవ్ర నేరాల‌కు సంబంధించిన కేసుల్లో ప్ర‌ధాని , ముఖ్య‌మంత్రులు, కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు అరెస్టై వ‌రుస‌గా 30 రోజుల పాటు న్యాయ‌స్థాన క‌స్ట‌డీలో ఉంటే, వారు ఆటోమేటిక్‌గా ప‌ద‌విని కోల్పోవాల‌నే నిబంధ‌న‌ను య‌థాతథంగా ఉంచే సూచ‌న‌లు అందులో పొందుప‌రిచ‌నున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయ ప్రేరేపిత ద‌ర్యాప్తులు, అరెస్టులతో ఎన్నికైన ప్ర‌భుత్వాల‌ను అస్థిర‌ప‌ర‌చే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌తిప‌క్షం వాదిస్తోంది. అలాగే మ‌రోవైపు నీట్ పేపర్ లీక్ అంశంతోపాటు చమురు ధరల పెరుగుదల ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనున్నాయి. ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో దేశ సైనికుల ప్రాణ‌న‌ష్టంపై స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ప‌ష్ట‌మైన అబద్ధం చెప్పార‌ని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దీనిపై ప్రివిలేజ్ నోటీసు కూడా ఇవ్వ‌నున్నట్టు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -