ఒక అడవిలో ఏనుగు, ఎలుగుబంటి, కోతి స్నేహంగా ఉండేవి. ఏనుగు, ఎలుగుబంటి ఎప్పుడూ నీరసంగా, తలదించుకుని నడుస్తూ ఉండేవి. వాటికి తమ బలం మీద తమకే నమ్మకం ఉండేది కాదు. కానీ కోతి మాత్రం ఎంతో చలాకీగా, వెన్నుముక నిటారుగా ఉంచి చెట్లపై గంతులేస్తూ ఉండేది.
ఒకరోజు తన మిత్రుల అవస్థను చూసి తట్టుకోలేక కోతి వాటి దగ్గరకు వెళ్లి, ”మిత్రులారా! మీరు అంత బలంగా ఉండి కూడా ఎందుకు అలా రోజంతా దీనంగా తలవంచుకుని తిరుగుతారు?” అని అడిగింది. దానికి ఏనుగు బదులిస్తూ, ”ఏమో కోతి బావ, మా శరీరాలు చాలా బరువుగా ఉంటాయి, అందుకే మాకు ఎప్పుడూ అలసటగా, భయంగా అనిపిస్తుంది” అని సమాధానమిచ్చింది. కోతి నవ్వి, మన శరీరాన్ని ఉంచే తీరు బట్టే మన మనసు మారుతుందని వివరించింది.
?ఒకసారి పక్క అడవి నుంచి ఒక పులి వచ్చింది. అది కనిపించిన జంతువులన్నిటినీ వేటాడి చంపి తినేది. పులి గాండ్రింపు వినగానే ఆ అడవిలోని జంతువులన్నీ బిక్కుబిక్కుమంటూ పారిపోయి దాక్కునేవి. తన మిత్రులైన ఏనుగు, ఎలుగుబంటిలకు శారీరక బలం ఉన్నప్పటికీ, మానసికంగా పులి గాండ్రింపు విని భయపడుతున్నాయని గ్రహించింది కోతి.
ఒకసారి కోతి, ఏనుగు, ఎలుగుబంటి ఆహారం కోసం వెతుకుతూ అడవిలో తిరగసాగాయి. అంతలో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. పులి గాండ్రింపు వినగానే ఏనుగు భయంతో వణికిపోతూ తన శరీరాన్ని ఇంకాస్త కుంచించుకుపోయేలా చేసింది. ఎలుగుబంటి కూడా ఎక్కడికక్కడ వంగిపోయి దాక్కోవడానికి ప్రయత్నించింది.
పులి వేగంగా వాటి వైపు రావడం గమనించిన కోతి, వెంటనే ఏనుగు చెవిలో ఒక రహస్యం చెప్పింది: ”మిత్రమా! భయపడకు, మొదట నీ వెన్నుముక నిటారుగా ఉంచి, తల ఎత్తి గంభీరంగా నిలబడు, అప్పుడు నీకేం అనిపిస్తుందో చూడు” అని కోతి గట్టిగా చెప్పింది.
వెంటనే ఏనుగు తన భారీ కాయాన్ని నిటారుగా పెట్టి, తన తొండాన్ని ఆకాశం వైపుకు ఎత్తి గంభీరంగా నిలబడింది. ఎలుగుబంటి కూడా కోతి మాటను స్వీకరించి, తన వంగిన భుజాలను వెనక్కి నెట్టి, చాతిని ముందుకు చాచి తన రెండు కాళ్ల మీద నిటారుగా నిలబడింది. కేవలం శరీర భంగిమను మార్చడం వల్ల వాటిలో అద్భుతమైన ఉత్సాహం ప్రవహించింది.
పులి వాటి ముందుకు రాగానే, భయంతో పారిపోకుండా ఏనుగు గంభీరంగా ఘీంకరించింది. అది చూసి ఆశ్చర్యపోయిన పులి, ”ఏమిటిది? నిన్నటి వరకు భయంతో వణికిపోయిన ఈ జంతువుల్లో ఇంతటి ఆత్మవిశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది?” అని మనసులో అనుకుని వెనక్కి తగ్గింది. నిటారుగా, దఢంగా నిలబడిన ఆ జంతువుల రూపం చూసి పులి భయపడి అక్కడి నుండి పారిపోయింది.
మనం ఎంత బలంగా ఉన్నామనే దానికంటే, మనల్ని మనం ఎంత ధైర్యంగా ఇతరులకు ప్రదర్శిస్తున్నాం అనేది ముఖ్యమని అవి గ్రహించాయి. ఆ రోజు నుండి ఏనుగు ఎప్పుడూ తల దించుకోలేదు, ఎలుగుబంటి కూడా ఒంగి నడవకుండా గంభీరంగా సాగింది. కోతి ఇచ్చిన ఆ చిన్న సలహా వాటి జీవితాల్లో పెను మార్పును తీసుకువచ్చింది. శారీరక స్థితి బాగుంటే మానసిక ధైర్యం దానంతట అదే వస్తుందని అవి అర్థం చేసుకున్నాయి. కోతి చెప్పిన ఆ ఆత్మవిశ్వాస రహస్యాన్ని పాటిస్తూ ఏనుగు, ఎలుగుబంటి హాయిగా జీవించాయి
పైడిమర్రి రామకృష్ణ,
92475 64699



