Friday, May 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహైదరాబాద్‌ పోలీసుల 'వ్యూహం'.. దేశానికే దిక్సూచి

హైదరాబాద్‌ పోలీసుల ‘వ్యూహం’.. దేశానికే దిక్సూచి

- Advertisement -

ఢిల్లీని కదిలించిన ఆపరేషన్‌ ఆక్టోపస్‌ ఉన్నత స్థాయి సమీక్షకు దారితీసిన పోలీసుల తెగువ ‘మ్యూల్‌’ ఖాతాల వేటకు జాతీయ కార్యాచరణ
రంగంలోకి ఐ4సీ, సీబీఐ, ఆర్బీఐ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నగరంలో తమ పంజా విసురుతున్న సైబర్‌ నేరగాళ్ల అక్రమ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేం దుకు హైదరాబాద్‌ పోలీసులు ఎక్కుపెట్టిన ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ అస్త్రం ఇప్పుడు దేశవ్యాప్త సమరానికి దిక్సూచిగా మారింది. 32 మంది బ్యాంక్‌ అధికారులను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగర పోలీస్‌ యంత్రాంగం ప్రదర్శించిన అసమాన తెగువ, వ్యూహాత్మక చొరవ దేశ రాజధాని ఢిల్లీని కదిలించడమే కాక, కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించేలా ప్రేరేపించింది.డిజిటల్‌ ఆర్థిక మోసాల్లో కీలకమైన ‘మ్యూల్‌’ ఖాతాల అక్రమ చలామణీని ఛేదించడంలో హైదరాబాద్‌ పోలీసులు సాధించిన అద్భుత విజయాలను కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) ఒక ఆదర్శ నమూనాగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నేతత్వంలో ఢిల్లీలో గురువారం జరిగిన కీలక సమావేశం.. సైబర్‌ నేరాల నియంత్రణలో ఒక నవశకానికి నాంది పలికింది. ఈ సమావేశంలో హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ పాల్గొన్నారు. ముఖ్యంగా అమాయకుల పేరిట తెరిచే మ్యూల్‌ ఖాతాలను నేరగాళ్లు ఎలా వినియోగించు కుంటున్నారో పక్కా ఆధారాలతో సహా బహిర్గతం చేయడంతో కేంద్రం అప్రమత్తమైంది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అందించిన క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ఐ4సీ, సీబీఐ, ఆర్బీఐ వంటి అగ్రశ్రేణి సంస్థలతో పాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులతో కేంద్రం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. ఈ భేటీలో హైదరాబాద్‌ పోలీసుల పనితీరును ప్రత్యేకంగా కొనియాడడమే కాకుండా, ఇక్కడి విజయవంతమైన మోడల్‌ను దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించింది. నేరగాళ్ల వేటలో మరింత వేగం పెంచేందుకు ‘మ్యూల్‌ హంటర్‌. ఏఐ’ అనే కత్రిమ మేధస్సు సాధనాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమన్వయ లోపం లేకుండా పోలీసులు, బ్యాంకులు రియల్‌ టైం డేటాను పంచుకోవాలని, ఎస్‌ఎల్‌బీసీల ద్వారా ప్రజల్లో విస్తత అవగాహన కల్పించాలని ఈ సమావేశం దిశానిర్దేశం చేసింది.హైదరాబాద్‌ పోలీస్‌ యంత్రాంగం ప్రదర్శించిన ఈ కార్యదక్షత మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని కేంద్ర అధికారులు అభిప్రాయపడ్డారు. వెరసి, హైదరాబాద్‌ పోలీసుల అలుపెరగని పోరాటం ఇప్పుడు దేశవ్యాప్త సైబర్‌ భద్రతకు ఒక కొత్త మార్గదర్శిగా నిలుస్తూ, మోసగాళ్ల ఆట కట్టించేందుకు యావత్‌ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -