Wednesday, July 1, 2026
E-PAPER
Homeఆటలుఅగ్రజట్ల ధమాకా

అగ్రజట్ల ధమాకా

- Advertisement -

భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టీ20 నేడు
గత సిరీస్‌ ఓటమి నైరాశ్యంలో ఇరు జట్లు!
రాత్రి 10 నుంచి స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో..

భారత్‌, ఇంగ్లాండ్‌ ‌టీ20 సిరీస్‌ ఆరంభం కాబోతుంది. అటు ఆతిథ్య ఇంగ్లాండ్‌ ‌శిబిరంలో, ఇటు టీమ్‌ ఇండియా డ్రెస్సింగ్‌‌రూమ్‌‌లోనూ ఒకింత నైరాశ్యం. స్వదేశంలో న్యూజిలాండ్‌ ‌చేతిలో టెస్టు సిరీస్‌ ఓటమి నుంచి ఇంగ్లాండ్‌ ‌బయటపడలేదు. పసికూన ఐర్లాండ్‌ ‌చేతిలో టీ20 సిరీస్‌ ‌భంగపాటు నుంచి భారత్‌ ‌కోలుకోలేదు. ఓటమి విశ్లేషణకు సైతం ఇరు జట్లకు సమయం లేదు. అయినా, గత సిరీస్‌ ‌నైరాశ్యం నుంచి బయటపడేందుకు ఐదు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌ ధమాకాకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. చెస్టర్‌ ‌లె స్ర్టీట్‌‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ ‌తొలి టీ20 నేడు.

​నవతెలంగాణ-చెస్టర్‌‌ లె స్ర్టీట్‌
భారత్‌, ఇంగ్లాండ్‌ ఏ ఫార్మాట్‌లో తలపడినా అభిమానులకు బ్లాక్‌‌బస్టర్‌ ‌షో ఖాయం. గత రెండు టీ20 ప్రపంచకప్‌‌లలో ఇంగ్లాండ్‌‌ను సెమీఫైనల్లో ఓడించిన భారత్‌.. ఓ ద్వైపాక్ష‍ిక సిరీస్‌‌లో 4-1తో గెలుపొందింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ ‌సెమీఫైనల్లో 254 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ ఆఖరు వరకు ఆతిథ్య జట్టును భయపెట్టింది. ఈ ఫార్మాట్లో ఇరు జట్లకు నాణ్యమైన క్రికెటర్లు, ఫైర్‌ పవర్‌ ఉండటంతో ఐదు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఐదు మ్యాచ్‌‌ల్లోనూ పరుగుల వరద పారించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం తొలి టీ20 నేడు రాత్రి 10 గంటలకు ఆరంభం కానుంది.

​వైభవ్‌‌కు అవకాశం ఇస్తారా?
ఐపీఎల్‌‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన 15 ఏండ్ల వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్‌‌తో సిరీస్‌‌లో అవకాశం ఇస్తారని భావించినా, నిరాశే ఎదురైంది. ఓపెనర్లలో సంజు శాంసన్‌‌ను పక్కనపెట్టి సూర్యవంశీకి చోటు కల్పించే ఆలోచన ఉంది. లేదంటో లోయర్‌ ఆర్డర్‌‌లో సూర్యాన్షు షెడ్జె/వాషింగ్టన్‌ ‌సుందర్‌ ఆడుతున్న స్థానంలో సంజు శాంసన్‌‌ను దింపే ఆలోచన సైతం జట్టు మేనేజ్‌‌మెంట్‌ ‌చేస్తోంది. బ్యాటింగ్‌ ‌లైనప్‌‌లో ఇషాన్‌ ‌కిషన్‌, కెప్టెన్‌ ‌శ్రేయస్‌ అయ్యర్‌ అంచనాలను అందుకోవటం లేదు. తిలక్‌ ‌వర్మ నిలకడగా రాణించటం భారత్‌‌కు శుభపరిణామం. స్పిన్నర్‌ ‌వరుణ్‌ ‌చక్రవర్తి రాకతో పేసర్లు ప్రిన్స్‌ ‌యాదవ్‌, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌‌లో ఒకరు బెంచ్‌‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. శివమ్‌ ‌దూబె, అక్ష‍ర్‌ ‌పటేల్‌ ఆల్‌‌రౌండ్‌ ‌పాత్రకు న్యాయం చేయాల్సి ఉంది.

​సొంతగడ్డ ఉత్సాహం!
ఇంగ్లాండ్‌ ‌జట్టులో టెస్టు సిరస్‌లో ఆడిన ఆటగాళ్లు తక్కువే. దీంతో భారత్‌‌తో పోల్చితే ఆతిథ్య జట్టే తొలి మ్యాచ్‌ ‌ముంగిట మెరుగ్గా కనిపిస్తోంది!. ఫిల్‌ ‌సాల్ట్‌, జోశ్‌ ‌బట్లర్‌, జాకబ్‌ ‌బెతెల్‌, టామ్‌ ‌బాంటన్‌‌లకు ఈ ఫార్మాట్‌‌లకు మంచి రికార్డులు ఉన్నాయి. విధ్వంసక ఇన్నింగ్స్‌‌లు ఆడగల సత్తా ఈ బ్యాటర్ల సొంతం. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ ‌పొట్టి ఫార్మాట్‌ ‌సక్సెస్‌‌తో రెడ్‌‌బాల్‌ ఫార్మాట్‌ ‌కెప్టెన్సీ సైతం సొంతం చేసుకునే జోష్‌‌లో కనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌‌లో బ్రూక్‌ ‌కోసం భారత బౌలర్లు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాల్సి రావచ్చు. కివీస్‌‌తో టెస్టులో ఆడిన జోఫ్రా ఆర్చర్‌ ‌తొలి మ్యాచ్‌‌లో ఆడకపోవచ్చు. సోనీ బేకర్‌, ల్యూక్‌ ‌వుడ్‌‌లలో ఒకరు అతడి స్థానంలో తుది జట్టులో నిలువనున్నారు. ఆదిల్‌ ‌రషీద్‌, సకిబ్‌ ‌మహమూద్‌, విల్‌ ‌జాక్స్‌, లియాం డాసన్‌‌లు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.

​వర్షం ముప్పు?
చెస్టర్‌ ‌లె స్ర్టీట్‌ ‌పిచ్‌ ‌స్వభావంపై స్పష్టమైన అంచనా, గణాంకాలు లేవు. ఇక్కడ ఈ ఏడాది జరిగిన టీ20ల్లో మిశ్రమ గణాంకాలు నమోద య్యాయి. పిచ్‌ ‌నుంచి బ్యాటింగ్‌‌కు మొగ్గు ఉండవచ్చు. బుధవారం ఇక్కడ చిరు జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం. వర్షం నేపథ్యంలో టాస్‌ ‌నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే వీలుంది.

​తుది జట్లు (అంచనా)
భారత్‌
: సంజు శాంసన్‌/‌వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ ‌శర్మ, ఇషాన్‌ ‌కిషన్‌ (‌వికెట్‌ ‌కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (‌కెప్టెన్‌), తిలక్‌ ‌వర్మ, సూర్యాన్షు షెడ్జె, శివం దూబె, అక్ష‍ర్‌ ‌పటేల్‌, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌, హర్షిత్‌ ‌రానా, ప్రిన్స్‌ ‌యాదవ్‌/‌వరుణ్‌ ‌చక్రవర్తి.
ఇంగ్లాండ్‌ : ఫిల్‌ ‌సాల్ట్‌, జోశ్‌ ‌బట్లర్‌ (‌వికెట్‌ ‌కీపర్‌), హ్యారీ బ్రూక్‌ (‌కెప్టెన్‌), జాకబ్‌ ‌బెతెల్‌, టామ్‌ ‌బాంటన్‌, విల్‌ ‌జాక్స్‌, శామ్‌ ‌కరణ్‌, లియాం డాసన్‌, సోనీ బేకర్‌/‌ల్యూక్‌ ‌వుడ్‌, సకిబ్‌ మహమూద్‌, ఆదిల్‌ ‌రషీద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -