పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
గోదావరిఖని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన నేతలు
నవతెలంగాణ-గోదావరిఖని
‘‘వర్షం వస్తే గదులు కారుతాయి. కిటికీలకు తలుపులు లేవు.. తరగతి గదుల్లోకి కోతులు వస్తున్నాయి.. వాటర్ ప్లాంట్ పనిచేయక విద్యార్థులు ఇండ్ల నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు..అబ్బాయిలకు బాత్ రూంలు లేక బయటికి పోతున్నారు.. అమ్మాయిల బాత్ రూంలకు నీళ్ల ట్యాప్ లు లేవు.. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు..’’ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ హైస్కూల్‌ను సందర్శించారు. బాత్‌రూమ్‌లు, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల పట్ల ప్రభుత్వం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం చెప్పే మాటలకు ఆచరణకు పొంతన లేదని విమర్శించారు. బెంచీలకు డెస్క్ లు లేక తలుపు చెక్కలు పెట్టుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. మధ్యాహ్నం భోజనం వంటగదిని స్టోర్ రూమ్‌గా మార్చారని, సిమెంట్ బస్తాలు, పైపులు వేయడంతో వంట చేయడానికి స్థలం లేదన్నారు. స్కూల్ రికార్డులు భద్రపర్చుకోవడానికి అవసరమైన బీరువాలు లేవన్నారు. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు తుమ్మల రాజారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, ఎం.రామాచారి, గోదావరిఖని పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, కమిటీ సభ్యులు మెండే శ్రీనివాస్, నాయకులు ఆరెపెల్లి రాజమౌళి, అంబాల రాజ్ కుమార్, సందీప్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.. అధికారుల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు
సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పోరాట మార్గాన్ని ఎంచుకున్న సింగరేణి అధికారులకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఎస్. వీరయ్య అన్నారు. కోల్ ఇండియాలో అమలవుతున్న బేసిక్ పేను తమకు అమలు చేయాలని, రెండేండ్లపెండింగ్ పీఆర్సీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో సింగరేణి అధికారులు దీక్ష చేపట్టారు. శిబిరాన్ని వీరయ్య సందర్శించి మద్దతు తెలిపారు. కార్మికులే కాకుండా అధికారులు కూడా తమ సమస్యల కోసం పోరాట మార్గాన్ని ఎంచుకోవడం మంచి శుభ పరిణామం అన్నారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై భవిష్యత్‌లో అధికారులు, కార్మికులు కలిసి పోరాటాలు చేసి ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పాలకులు కేవలం రాజకీయ ప్రకటనలు, సంస్థను ఆర్థికంగా దోచుకోవడానికి తప్ప సంస్థ అభివృద్ధికి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శిథిలావస్థలో సర్కార్ బడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



