Sunday, May 3, 2026
E-PAPER
Homeకథనడిచే దీపాలు

నడిచే దీపాలు

- Advertisement -

రమేశ్‌ ”పెరుగుందా?” అని అడగగానే ఆమె ముఖం మ్లానంయింది ”అయ్యో! చెప్పడం మర్చిపోయా. పోయిన అమావాస్యనాడు మన ముసలి గేదె చనిపోయింది. పశువుల దవాఖానా డాక్టర్‌ని తెప్పించినా, మూడు వందల రూపాయల మందులు వేసినా బతకలేదు” అంటూ ముక్కు చీదుకుంది. చీర అంచుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ”ఆ గేదెతో తోపాటు మన పది కూడా పోయినట్టుంది రా” అని వాపోయింది
పల్లెటూరి మట్టి వాసన, పశువుల పేడ వాసన, పచ్చటి పైరు వాసన… అన్నీ కలిసిపోయి ఒక తియ్యని పరిమళంలా స్వాగతం పలికాయి. రైలు దిగి, డొంక రోడ్డు మీద పావుగంట నడిచి వస్తున్న రమేశ్‌కు ఊరి వాసన ముక్కుకు తగిలి క్షణంలోనే గుండె నిండిపోయింది.
డొంక మీదుగా పొలాల్లో కలుపు గీయడానికి వెళ్తున్న ఆడవాళ్లు ఎదురై, ”ఏరా మనవడా! ఇదేనంట్రా రాటం” అంటూ పలకరించారు. వాళ్లలో మా ఇంటి దగ్గర ఉండే నరసమ్మ కూడా, ”ఏరా మనవడా!” అని గుర్తుపట్టింది.
”అవునమ్మమ్మా” అని బదులిచ్చాడు రమేశ్‌.
పక్కన ముసలమ్మ ”ఎవరే వెళ్ళేది” అంది. నరసమ్మ నవ్వుతూ, ”నీ చూపు కాస్త మసకబారిందిగా! ఇతనే కాంతమ్మ పెద్ద కొడుకు. పట్నంలో చదువుకుంటున్నాడు” అని వివరించింది.
రమేశ్‌ ఇంటికెళ్లేసరికి తలుపుకు తాళం వేసి ఉంది. అమ్మ కూలికెళ్లి ఉంటుందేమో, అయ్య నరసింహులు గేదెలతో పొలాల్లో ఉంటాడేమో అనుకున్నాడు. వసారాలో కెక్కరిస్తున్న కోళ్లను తరిమి, అక్కడున్న కుక్కిమంచంపై వాలి కాసేపటిలోనే కునుకులోకి జారిపోయాడు.
”ఎప్పుడొచ్చావురా! అన్నం తిన్నావా? తాళం చేతులు గూట్లోనే ఉన్నాయి గదా, తీసుకుని తినలేదా?” అన్న అమ్మ గొంతు విని మెలకువ వచ్చింది.
”ఇందాకే వచ్చానమ్మా! ఏడు గంటల బండి లేటైంది” అని ఆవలిస్తూ చెప్పాడు.
అమ్మ పొయ్యి రాజేస్తూ, ”ఈ రోజు కూలికెళ్లలే. మన చేలో కలుపు ముదరిపోతదని ఆడికి పోయాను. అక్కడ పుల్లమ్మోళ్లు నువ్వొచ్చావని చెప్పగానే పరుగున వచ్చేశా” అంది.
”కాళ్లు కడుక్కొమ్మా, అన్నం తిందాం” అని చెప్పింది.
రమేశ్‌ కాళ్లు కడుక్కుని వచ్చేసరికి కోడిగుడ్డు అట్టు వాసన ఘుమ ఘుమలాడింది. ”చిన్నోడు కూడా సద్దన్నం తిని మట్టిపనికి వెళ్లిపోయాడు. కూరేమీ వండలేదు. గుడ్డు ఒకటుంది, అట్టే వేశా” అంది. కోళ్ల మంచిచెడ్డలు చెబుతూ, ”ఈ మధ్య రోగాలు వచ్చి చాలా కోళ్లు చచ్చిపోయాయి. ఒకటి పొదిగిస్తోందిలే” అని కాస్త బాధ పడింది .
రమేశ్‌కు పెద్దమ్మవాళ్లు గుర్తొచ్చారు. వాళ్లు అమ్మను ఆటపట్టిస్తూ, ”లక్ష్మమ్మకు కాపీనం ఎక్కువ, కోడి కోసి పెట్టదు. చచ్చిపోతే మాత్రం తెగ బాధపడిపోతుంది” అని.
అలా తల్లి, కొడుకు మధ్య సంభాషణ సాగుతుండగా, ఊరి సంగతులు చెప్పింది. ”అప్పులేస్తూ అంజయ్య రెండెకరాలు అమ్మేశాడు. వెంకటరెడ్డి ఇరవై ఎకరాలు సంపాదించినా మంచం మీద నెల రోజులు పడి చనిపోయాడు. చివరికి అన్నీ వధానే కదా” అంటూ ఊరిలో జరిగిన మార్పులు గురించి చెప్పింది.
రమేశ్‌ ”పెరుగుందా?” అని అడగగానే ఆమె ముఖం మ్లానంయింది ”అయ్యో! చెప్పడం మర్చిపోయా. పోయిన అమావాస్యనాడు మన ముసలి గేదె చనిపోయింది. పశువుల దవాఖానా డాక్టర్‌ని తెప్పించినా, మూడు వందల రూపాయల మందులు వేసినా బతకలేదు” అంటూ ముక్కు చీదుకుంది.
చీర అంచుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ”ఆ గేదెతో తోపాటు మన పది కూడా పోయినట్టుంది రా” అని వాపోయింది.
ఆ మాట విని రమేశ్‌ గుండె బరువెక్కింది. మనిషి చనిపోతేనే అంతలా బాధపడని ఈరోజుల్లో, తల్లి ఒక గేదె కోసం ఇంతగా విలపిస్తోంది అని అనుకున్నాడు. వెంటనే తన ఆలోచనకే సిగ్గుపడ్డాడు. నిజానికి ఆ గేదె కుటుంబానికి ఐదో మనిషిలాంటిది. పాలు, పెరుగు, డబ్బు… అందరికీ ఆదారం అదే.
ఆ జ్ఞాపకంతో రమేశ్‌ చిన్ననాటి సంఘటనలు గుర్తుచేసుకున్నాడు. ఒకసారి వర్షంలో అయ్య గేదెను మేపకపోవడంతో అమ్మ తిట్టింది. తండ్రి కోపంతో అమ్మను కొట్టాడు. చిన్న వయసులోనే రమేశ్‌ మనసు మండిపోయింది. ఆ గొడవకూ కారణం గేదెనే. కానీ అది లేకపోతే సంసారం కదలదు, చదువు ఆగిపోతుంది.
చదివి ఉద్యోగం సంపాదించాలని కలలు కన్న రమేశ్‌, ప్రతిసారి పరీక్షల్లో విఫలమవుతూ నిరాశ చెందేవాడు. తండ్రి ”నీ పుస్తకాలతో మా పొట్ట నిండుతుందా?” అని విసుక్కుంటే, తల్లి మాత్రం, ”నాయనా, నీ చదువు వెలుగు ఇస్తుంది. నేను నీకు తోడుంటాను” అంటూ ధైర్యం ఇచ్చేది.
ఇప్పుడు నిజానికి సంపాదించే గేదె పోయింది. కుటుంబం మరింత కష్టాల్లో పడింది. రమేశ్‌ మనసు తట్టుకోలేక, చెరువు గట్టుకు వెళ్లాడు. అక్కడ ముగ్గురు పిల్లలు మట్టిలో ఆటలాడుతున్నారు. రమేశ్‌ అడిగాడు, ” కిట్టూ బాబూ, స్కూల్‌కి వెళ్ళటం లేదా?”
కిట్టు భుజాలు ఎగరేసి, ”స్కూలే లేదు అన్నా! చదివి మేమేం చేస్తాం? అడవిలో కట్టెలు కొట్టుకోవడమే మా పని” అన్నాడు. మిగతా ఇద్దరూ కూడా అదే సమాధానం ఇచ్చారు.
ఆ మాట రమేశ్‌ హదయాన్ని కుదిపేసింది. రాత్రంతా ఆలోచనలో మునిగిపోయాడు.
”నాకు ఉద్యోగం రాకపోవచ్చు. కానీ జ్ఞానం ఉంది. దాన్ని పంచకపోతే వధా కదా! ఇప్పుడు ఏదో రకంగా ఇక్కడే ఉండి కుటుంబానికి ఆసరా కావాలి. అలాగే నాకు వచ్చిన విద్యనూ నలుగురికి పంచడం కూడా అవసరమే .అనిపించింది.
మరుసటి రోజు ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలను పిలిచాడు. మట్టిలో కర్రతో అక్షరాలు గీయడం మొదలుపెట్టాడు. వాళ్ళు, ”అన్నా, అక్షరాలు పొట్ట నింపుతాయా? గడ్డి కోయడం, పుల్లలు ఏరుకోవడమే బాగుంటుంది” అన్నారు

రమేశ్‌ నవ్వుతూ, ”పొలం అన్నం ఇస్తుంది రా. కానీ అక్షరాలు వెలుగు ఇస్తాయి. వెలుగు ఉంటే దారి తప్పం” అన్నాడు.

కొద్ది రోజుల్లోనే ఊరంతా ఈ విషయమే చెప్పుకుంటున్నారు మొదట ఇద్దరు పిల్లలతో మొదలయి తర్వాత నలుగురూ, ఆతరువాత పది, తర్వాత ఇరవై మంది చేరారు.
అయితే ఊరి పెద్ద జంగయ్య మాత్రం అడ్డుపడ్డాడు. ”నీకు ఉద్యోగం రాలేదని మా పిల్లల మీద ప్రయోగాలు చేస్తున్నావా? పుస్తకాలు పొట్ట నింపవు. నువ్వు వాళ్ళని పాడు చేయడానికి వీలు లేదు” అని బెదిరించాడు.
రమేశ్‌ ధైర్యంగా ”జంగయ్య గారూ, ఒక దీపం వెలిగితే చీకటి పోతుంది. ఈ పిల్లలే రేపటిదీపాలు .కాస్త వాళ్ళని చదువుకోనీయండి” అన్నాడు.
అదే సమయంలో ఆ వూళ్లోకి సింగల్‌ ప్రభుత్వ టీచర్‌ సావిత్రి వచ్చింది. రమేశ్‌ ప్రయత్నాలు చూసి, ”ఇది అద్భుతం! స్కూలుకి బిల్డింగ్‌ లేకపోయినా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న చోటే స్కూల్‌ ఉంటుంది. మనం ఇద్దరం కలిసి ఈ ఊరుని ముందుకు తీసుకెళ్దాం” అని ప్రోత్సహించింది.
ఇద్దరూ కలిసి పదే పదే ప్రతి గడపకూ వెళ్లేవారు. నిరక్షరాస్యులైన ఆ ఊరి వాళ్ళను చివరకు ఒప్పించారు. అలా వాళ్ళ తొలి అడుగు విజయవంతం అయింది. ఇద్దరు పిల్లల సంఖ్య పదికి చేరింది. ఆ తరువాత… పిల్లలకు పాఠాలు చక్కగా అర్థం కావడం కోసం చార్టులపై ఇంట్లోనే బొమ్మలు వేసి, పిల్లలకు వివరించేవారు. వారిలో ఆసక్తి పెంచడానికి ల్యాప్‌టాప్‌లో వీడియోలు చూపించారు. ఉదయం ప్రార్థన, సాయంత్రం ఆటలు… ఇలా అన్నీ క్రమం తప్పకుండా చేయించారు. ఇది గమనించిన గ్రామస్తులకు వాళ్ళపై గట్టి నమ్మకం ఏర్పడింది.
ఆమె సహాయంతో పుస్తకాలు తెచ్చారు. కూర్చోవడానికి పాత చెక్కలతో బల్లలు అమర్చుకున్నారు . అలా చెట్ల కింద స్కూల్‌ మొదలైంది. పిల్లలతో పాటు పెద్దవాళ్లకూ చదువు చెప్పసాగారు
అంతవరకూ చదువు అంటే చిట పటలాడిన జంగయ్య కూడా చివరికి పిల్లలతో కూర్చుని అంకెలు, అక్షరాలు నేర్చుకున్నాడు.

కొద్ది నెలల్లో జిల్లా అధికారులకి సావిత్రి ద్వారా విషయాలు తెలిసి వచ్చారు. అక్కడ పిల్లలు చదువుకునే విధానం చూసి ఆశ్చర్యపోయి, కొత్త పాఠశాలను మంజూరు చేశారు. అలాగే రమేశ్‌ను కూడా ఒక ఉపాధ్యాయుడిగా గుర్తించారు.

ఒక సాయంత్రం, సూర్యాస్తమయాన్ని చూస్తూ పిల్లలతో కలిసి నడిచి వెళుతున్న సావిత్రిని, రమేశ్‌ని చూసి, జంగయ్యతో పాటు మిగతా ఊరి పెద్దలు ”వాళ్ళు మన ఊరికి వెలుగును పంచడానికి, నడచి వచ్చిన కాంతి దీపాలు” అన్నాడు.
మణి మడ్లమాని, 9652067891

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -