Sunday, April 26, 2026
E-PAPER
Homeకథవర్షంలో ఆరని కన్నీరు

వర్షంలో ఆరని కన్నీరు

- Advertisement -

సాయంత్రం కావస్తుంది అప్పుడప్పుడే కొన్ని కొన్ని చినుకులు ఆకాశం నుంచి పడుతూ భీకరమైన వర్షంగా మారుతుంది.
నిత్యం రద్దీగా ఉండే పంజాగుట్ట సెంట్రల్‌ సర్కిల్‌ వర్షానికి మరింతగా ట్రాఫిక్‌ జామ్‌తో నిండిపోయింది. ఇంత ట్రాఫిక్‌లో డ్యూటీ చేయడం మరింతగా లేట్‌ అవుతుందని, ఇంటిదగ్గర ఉన్న పిల్లలు గుర్తుకొచ్చి కమలాకర్‌ ఒకింత అసహనానికి గురవుతున్నాడు. స్కూల్‌ నుండి వచ్చిన పిల్లలు తాను వెళ్లడం ఇంటికి లేట్‌ అవుతే భయపడతారేమోనని కంగారు పడుతున్నాడు. జోరుగా పడుతూనే ఉంది వర్షం, ఇంతలో ముగిసేటట్టు లేదు.
నాన్న ఎప్పుడొస్తున్నావ్‌?, వర్షం పడుతుంది, కరెంటు పోయింది, భయంగా ఉంది అంటూ పిల్లల నుండి ఫోన్‌. పిల్లలకి ధైర్యం చెప్పి కమలాకర్‌ ఫోన్‌ పెట్టేసాడు.

టికెట్‌! టికెట్‌!! అంటూ టికెట్‌ ఇస్తుండగా కమలాకర్‌ని చూస్తూ బస్సులోని పాసెంజర్‌, ‘కండక్టర్‌ గారు మీరు ఎప్పుడూ నవ్వుతూ బలే సరదాగా ఉంటారు’ అని అంటుండగా తనలో తానే నవ్వుకున్నాడు కమలాకర్‌.
”ఏం కండక్టర్‌! అలా నవ్వుతావేంటి?”
”హ.. ఏం లేదు”
మీ డ్యూటీ బాగుంది అందరితో మాట్లాడుతూ సంతోషంగా డ్యూటి చేస్తారు అంటుంటే కమలాకర్‌ మదిలో ”నవ్వుతూనే డ్యూటీ చెయ్యాలనే” సంస్థ నిబంధనను గుర్తుకు తెచ్చుకొని, ‘నవ్వే నా ముఖం మాత్రమే చూస్తున్నారే, హదయంలోని బాధ ఎవరు అర్థం చేసుకుంటారు?’ అని తనలో తానే నవ్వుకుని గడిచిన కాలంలోకి వెళ్ళిపోయాడు.
చదువులు అయిపోయి ఉద్యోగరీత్యా కమలాకర్‌ జగిత్యాల నుండి హైదరాబాదుకి బయలుదేరాడు. చేతిలో ప్రజా రవాణ సంస్థ నుండి వచ్చిన జాబ్‌ లెటర్‌ పట్టుకొని బస్సు ఎక్కి జేబీఎస్‌ చేరుకున్నాడు. సిటీలోని ఫారూక్‌ నగర్‌ డిపోలో కండక్టర్‌గా విధిలో చేరాడు. సిటీకి కొత్తగా కాస్త బెరుకు బెరుకుగానే ఉద్యోగం చేస్తూ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. చాలీచాలని జీతంతో ఎలాగోలా సర్దుకుంటూ హైదరాబాదులోనే నివసిస్తూ ఉన్నాడు.
ఉదయం నాలుగు గంటలు అవుతుంది, డ్యూటీకి తయారు అవుతుండగా ఫోన్‌ రింగ్‌ అవుతున్న శబ్దం రావడంతో ఎవరై ఉంటారబ్బా అని ఫోన్‌ చూస్తే అమ్మ కాల్‌ చేస్తుంది.
గుండెలో ఏదో కంగారు ఇంత పొద్దున అమ్మ ఫోన్‌ చేస్తుందేమిటి? అని ఫోన్‌ లిఫ్ట్‌ చేసాడు.
అమ్మ మాటల్లో తడబాటు, మాటలు సరిగ్గ రావడంలేదు కంగారుపడుతుంది.
ఏమయిందమ్మా? ఎందుకు కంగారు పడుతున్నావు?. నిదానంగా చెప్పు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న ఎలా ఉన్నాడు? నాన్నకి ఫోన్‌ ఇవ్వు నేను మాట్లాడతా.
నాన్నకు గుండెలో నొప్పి, కొద్దిసేపటి నుండి గుండె పట్టుకుంటూ ఒకటే నొప్పి అంటున్నాడురా. ఏం చేయాలో అర్థం కావడం లేదు? నాకు భయం వేస్తుంది. ఈ టైంలో నాన్నని ఎటు తీసుకెళ్లాలి? అంటూ అమ్మ ఏడుస్తుంది.
అమ్మకి ధైర్యం చెప్పి వెంటనే కమలాకర్‌ ఊరికి బయలు దేరాడు. నాన్నని హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసి తన తండ్రిని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో రెండు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. డిపోకి ఫోన్‌ చేసి, విషయం చెప్పి డ్యూటీకి రాలేకపోతున్నాను అని చెప్పడంతో… పై అధికారులు ‘నీవు హాస్పిటల్లో ఉంటే నీ డ్యూటీ ఇక్కడ ఎవరు చేయాలి? నీ డ్యూటీ నేను చేయాలా?’ అని కమలాకర్‌తో అన్నారు.
”నేను సిటీలో లేను సార్‌. జగిత్యాల్‌కి వచ్చాను”
”ఇప్పుడు కచ్చితంగా నువ్వు డ్యూటీకి రావాలి బస్‌లు డిపోలో ఆగినందుకు మేనేజర్‌ నన్ను తిడుతున్నాడు. నీ మంచికే చెపుతున్నాను అనవసరంగా డ్యూటీ దగ్గర ఇబ్బందులకు గురికాకు”
”హాస్పిటల్లో నాన్నకు సీరియస్‌గా ఉంది సార్‌. ఉన్న ఒక్క కొడుకుని నేనే, చూసుకోవాలి. నేనే ఎలా రావాల్సి సార్‌”
”కుటుంబం ఎంత ముఖ్యమో డ్యూటీ కూడా అంతే ముఖ్యం”
”కరెక్టే సార్‌! కాదని అనను. అలా అని ఇప్పుడు డ్యూటీకి రాలేను. నన్ను కొంచెం అర్థం చేసుకోండి సార్‌”
”నీకే కాదు మాకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మేము డ్యూటీ చేయడం లేదా?”
”సార్‌, అమ్మకి ఏమి తెలియదు. డాక్టర్స్‌తోని ఎలా మాట్లాడాలో తెలియదు. అందుకే నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది ప్లీజ్‌ సార్‌”
”నీకు ఒక అన్నలా, స్నేహితుడిలా చెప్పుతున్నాను. డ్యూటీకి రావడం ఇప్పుడు ఉత్తమం” అంటూ ఫోన్‌ పెట్టేసాడు
నాన్న పరిస్థితి చూస్తే బాగాలేదు, అమ్మేమో, ‘నిన్ను ఇంత చదివించి మా రెక్కలు ముక్కలు చేసుకొని మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇప్పుడు ఇలా నాన్నను హాస్పిటల్‌లో ఎలా వదిలేసి డ్యూటీకి వెళ్తావు, నీవు కాక మాకు ఇంకెవరు ఉన్నారు చూసుకొనడానికి’ అంటూ ఏడుస్తూ కూర్చుంది.
నాన్నని వదిలి డ్యూటీకి వెళ్ళడం ఏమాత్రం కమలాకర్‌కి ఇష్టంలేదు. ఇంటికి ఫోన్‌ చేసి భార్యకు మొత్తం చెప్పాడు. నేను బయలుదేరుతున్నాను, వచ్చి చూసుకుంటాను. మీరు వచ్చి పిల్లల్ని స్కూల్‌కి పంపించి డ్యూటీకి వెళ్ళండి” అని బరోసా ఇవ్వడంతో బరువెక్కిన హదయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ కమలాకర్‌ హాస్పిటల్‌ నుండి బయలుదేరాడు.

”టికెట్‌! టికెట్‌!! ఆధార్‌ కార్డు చూపించండి”
”నీవైతే ఫస్ట్‌ టికెట్‌ ఇవ్వు, ఇంతమందిలో ఆధార్‌ కార్డు ఎలా తీయమంటావు? నిలబడడానికి కూడా చోటు లేదు” అంటూ మహిళలు కసురుకొంటున్నారు.
కమలాకర్‌ వారికి టికెట్‌ ఇస్తూ, ”సరే ఆధార్‌ కార్డు అయితే చూపించండి” అంటూ మిగతవారికి టికెట్‌ ఇస్తున్నాడు.
మహిళలు ఆధార్‌ కొరకు వారి బ్యాగ్లో వెతుకుతుండగా బస్‌ టూరిస్టు బస్‌ స్టాప్‌ దాటి ఇంతలోనే కాచిగూడ బస్‌ స్టేషన్‌కు వచ్చింది. కాచిగూడ స్టేషన్‌ వచ్చింది దిగేవారు రెడీగా ఉండండి అంటూ చెబుతుండగా బస్‌ స్టాప్‌లో చెకింగ్‌ ఆఫీసర్స్‌ బస్సు ఎక్కారు. బస్‌లో ఇద్దరి దగ్గర ఆధార్‌ కార్డు లేదు. ‘మేము ఇంటిదగ్గరే మర్చిపోయినట్టున్నాము’ అని తెల్లమొఖం వేయడంతో కమలాకర్‌ గుండెలో ఏం కేసు రాస్తారో అని దడ మొదలైంది.
”ఏం డ్యూటీ చేస్తున్నావ్‌ కండక్టర్‌?”
”సార్‌! వారిని ఆధార్‌ చూపించమని అడిగాను. బ్యాగ్‌ లో ఉంది చూపిస్తాము ఫస్ట్‌ టికెట్‌ ఇవ్వండి మీరు అని అనడంతో టికెట్‌ ఇచ్చాను సార్‌”
”ఆధార్‌ చూపించాకె టికెట్‌ ఇవ్వాలని నీకు ఈ విషయం తెలియదా?”
”తెలుసు సార్‌! ఫుడ్‌ బోర్డ్‌ దగ్గర అంత మంది నిలబడిన వాళ్ళు ఆధార్‌ తీయడానికి ఇబ్బంది పడుతున్నారు అని ఆగాను సార్‌”
”అవన్నీ మాకు చెప్పొద్దు”
”మేము బస్‌ చెక్‌ చేసేటప్పుడు అన్ని సరిగా ఉన్నాయా లేదా అని మాత్రమే చూస్తాము. ఇకనుండి అయినా సరిగా డ్యూటీకి చేయు” అంటూ కమలాకర్‌కి ‘ఛార్జ్‌ మెమో’ ఇచ్చి వెళ్లిపోయారు.
”కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం” అన్నసామెతల ఉన్నది తన డ్యూటీ అని కమలాకర్‌ తనలోతానే అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు.
మరుసటిరోజు కమలాకర్‌ డిపోకి వెళ్లేసరికి ‘డిపోస్పేర్‌’ అంటూ కంట్రోలర్‌ తనని డ్యూటీకి తీసుకోకుండా పక్కన పెట్టేసాడు. తాను ఏదైతే కంగారు పడ్డాడో ఇప్పుడు అదే జరిగింది.
కమలాకర్‌ను వారం, పది రోజులు డ్యూటీ ఇవ్వకుండా కూర్చోబెట్టి మేనేజర్‌ దగ్గరికి పంపించారు.
”కమలాకర్‌… ఎం జరిగిందో చెప్పు” అంటూ మేనేజర్‌ అడిగాడు
”సార్‌!…” అంటూ జరిగింది అంతా చెప్పాడు.
”ఇకనుండైనా జాగ్రత్తగా డ్యూటీ చేసుకో, నీవు సరిగ్గా డ్యూటీ చేస్తేనె నీవు, మీ కుటుంబం , మన సంస్థ బాగుంటుంది”
”సార్‌! నేనేమీ కావాలని చేయలేదు సార్‌” అన్నాడు కమలాకర్‌.
”నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఎవరి డ్యూటీలోనైనా కొన్ని ఇబ్బందులు తప్పవు. అవన్నీ దాటుకొని ముందుకు సాగిపోవాలి. ఏ పరిస్థితిలోనైనా పాజిటివ్‌ మైండ్‌ ఏర్పరచుకోవాలి. డ్యూటీ అనేది భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలి. అప్పుడే మన కర్తవ్యాన్ని విజయవంతంగా చేయగలుగుతాము”
”అలాగే సార్‌!” అన్నాడు కమలాకర్‌.
”నీ పనిని నీవు సక్రమంగా చేసుకుంటు వెళుతూ ఉండు. మనసులో ఏమి పెట్టుకోకుండ మరోసారి ఇలా జరగనీయక సంతోషంగా డ్యూటీ చేసుకో” అని మేనేజర్‌ గారు కమలాకర్‌కి చెప్పి పంపించాడు.
”థాంక్యూ సార్‌” అని చెప్పి మేనేజర్‌ గారి గది నుండి కమలాకర్‌ బయటకు వచ్చాడు.
శాఖపరమైన చర్య అంటూ ‘ఇంక్రిమెంట్‌’ కట్‌ చేసి కమలాకర్‌కి మళ్ళీ డ్యూటీ ఇచ్చారు.
తాను చేయని తప్పుకి కూడా బలికావడం, ఉద్యోగ భద్రత లేకపోవడం కమలాకర్‌ని బాధకలిగించింది. ప్యాసింజర్ల మీద ఉదారత చూపించడం కూడా ఒక్కొక్కసారి కండక్టర్‌కి శాపంగా మారుతుంది. డ్యూటీ ఇయ్యకుండా కూర్చోబెట్టినన్ని రోజులు అధికారుల కౌన్సిలింగ్‌, ఆర్థిక నష్టం రెండు భరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అసలు డ్యూటీ ఇస్తారో ఇవ్వరో అనే బాధ కూడా అనుభవించాల్సి ఉంటుంది.
కచ్చితంగా బస్‌ పాస్‌ను కాని, మహిళలు అయితే ఆధార్‌ కార్డు కాని చూపించుమని ప్యాసింజర్‌ని అడిగితే దుసురుగా ప్రవర్తించాడు కండక్టర్‌ అంటూ అధికారులకు కంప్లైంట్స్‌ వెళ్తాయి. ప్యాసింజర్‌ చెప్పిందే కరెక్ట్‌ అంటూ కండక్టర్‌ తప్పు లేదని తెసిలి కూడా క్రమశిక్షణ చర్య అని ఎదో ఒక పనిష్మెంట్‌ డిపోలో ఇస్తారు.
చార్మినార్‌ నుండి సికింద్రాబాద్‌ రూట్‌లో కమలాకర్‌ డ్యూటీ చేస్తూ ఉంటాడు. రోజు ఒకే సమయం కాబట్టి ఆ సమయంలో వెళ్లే వారందరూ తన బస్సులో వస్తుండడం వల్ల అందరితో మాట్లాడుతూ వారితో కలిసి పోయేవాడు. ఆత్మీయంగా మాట్లాడే కమలాకర్‌తో కొంతమంది ఉద్యోగం కోసం ఎక్కడైనా ఉంటే చెప్పండి అని చెప్తుండేవారు. తనకు తెలిసిన వారి దగ్గర ఏమైనా ఉంటే చూసి పెట్టేవాడు. వారికి జాబ్‌ దొరికిన ఆనందంలో కమలాకర్‌తో మాట్లాడినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చూసి కమలాకర్‌ సంతోషంతో మురిసిపోయేవాడు. ఇలా తనవల్ల ఒకరికి ఉపాధి దొరికి వారి ఇంట్లో నాలుగు మెతుకులు తినే భాగ్యం కల్పించినందుకు కమలాకర్‌కి తన కండక్టర్‌ ఉద్యోగం మీద ఎంతో గౌరవం.
అందరి ఇళ్లల్లో పండగ వచ్చిందంటే కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటే, కమలాకర్‌ మాత్రం లీవులు దొరకక డ్యూటీకి వెళ్లేవాడు. పిల్లలు ఎన్నోసార్లు తనపై అలిగి అల్లరి చేసేవారు. వారి స్నేహితుల నాన్నలు పండగలకు వారి దగ్గరే ఉండి గడుపుతారని, నీవు మాత్రం డూటికి వెళ్తావని స్కూల్లో పేరెంట్స్‌ మీటింగ్‌కి కూడా రాకుండా డ్యూటీ ఉందంటావు అని అంటున్నప్పుడల్లా కమలాకర్‌ మౌనంగా తనలోనే కన్నీళ్లను దాచుకునేవాడు. పిల్లలు స్కూల్‌ నుండి వచ్చాక వారితో హోమ్‌ వర్క్‌ చేపిస్తూ సరదాగా గడపాలని ఎంతో ఉన్నా డ్యూటీ టైమ్‌ సెట్‌ కాక ఎన్నోమార్లు పిల్లలతో టైమ్‌ గడపలేకపోతున్నానే బాధ ఇప్పటికీ ఆ లోటు ఇంకా తీరలేదు.

రాత్రి ఇంటికి వచ్చేసరికి లేట్‌ కావడంతో పిల్లలు కరెంట్‌ లేక భంయంతో తినకుండా ఎదురుచూస్తుండడం వలన కమలాకర్‌ పిల్లలని దగ్గరకు తీసుకొని తినిపించి తాతయ్య హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ కాగానే అమ్మ తొందరలోనే మన దగ్గరికి వస్తుంది అనిచెప్పి పడుకోబెట్టాడు. కానీ కమలాకర్‌కి మాత్రం నిద్ర రాలేదు. పిల్లల ఊపిరి శబ్దం సున్నితంగా వినిపిస్తున్నప్పటికీ, అతని మనసు మాత్రం హాస్పిటల్‌ చుట్టే తిరుగుతుంది. ‘తండ్రిని ఆ స్థితిలో వదిలి వచ్చేసాననే ఆలోచన…’ అతని అంతరంలో అలజడి రేపుతోంది.. తండ్రి ముఖం, తల్లీ లేని ఇంటి నిశ్శబ్దం, పిల్లల అమాయక నిద్ర ఈ మూడింటి మధ్య అతని మనసు అల్లాడుతూ ఉంది. ఆ రాత్రి చీకటి ఒక్క ఇంటిని మాత్రమే కాదు కమలాకర్‌ మనసుని కూడా కమ్మేసింది. నిద్రను జయించిన ఆలోచనల అలలు అతనిలో నిశ్శబ్ద తుఫానుల్లా ఉప్పొంగాయి.
ఉదయం పిల్లలను స్కూల్‌కి పంపి డ్యూటీకి బయలుదేరాడు కమలాకర్‌. మొదటి ట్రిప్లోనే ప్యాసింజర్స్‌ బస్‌ నిండా ఉండడంతో డ్యూటీ హడావిడిలో పడిపోయాడు.
జేబులో ఫోన్‌ రింగవుతుండడంతో లిఫ్ట్‌ చేసి
‘హలో నాన్నకి ఎలా ఉంది, డాక్టర్‌ ఏమన్నారు’ అని కమలాకర్‌ భార్యతో మాట్లాడుతూ అన్నాడు.
‘మామయ్యకి ఏమాత్రం బాగోలేదు సీరియస్‌గానే ఉంది. ఇప్పుడేం చెప్పలేము’ అంటున్నారు. అత్తయ్యకి, నాకు భయమేస్తుంది. మామయ్యకి నోటి మాట రావడం లేదు. ఎవరిని గుర్తుపట్టడం లేదు. నిన్నే కలవరిస్తున్నాడు. తొందరగా హాస్పిటల్‌కి వచ్చేయండి. మామయ్య పరిస్థితి చేయిదాటిపోతుంది నీవు ఇక్కడ ఉంటె బాగుండు అనిపిస్తుంది. దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి అంటూ కమలాకర్‌ భార్య ఫోన్‌ పెట్టేసింది.
కమలాకర్‌లో తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ‘కని పెంచిన తండ్రి హాస్పిటల్‌లో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. దగ్గరుండి చూసుకోవాల్సిన నేను డ్యూటీలో ఉన్నాను’ అనుకుని కమలాకర్‌లో మరింత దుఃఖం కట్టలు తెంచుకుంది కానీ డ్యూటీలో ఉండడం వల్ల తనని తానే కంట్రోల్‌ చేసుకుంటున్నాడు. ”కొడుకు ఉద్యోగం చేస్తే చూడాలి… నా చివరి క్షణంలో నాదగ్గరే ఉండి నన్ను చూసుకోవాలి…” అంటూ నాన్న తన కొలిమి దగ్గరకు వచ్చే ఊరి వాళ్లతో చెప్పిన మాటలు ఒక్కసారిగా అతని చెవుల్లో మారుమోగాయి. కొలిమిదగ్గర ఎగసిపడే నిప్పురవ్వలు ఒంటి మీద పడుతున్నా లెక్కచేయకుండా, నన్ను ప్రయోజకుడిగా చేయడానికి ఆయన పడిన కష్టం కళ్లముందు కదలాడింది. అలా తండ్రి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా అతని హదయాన్ని కమ్మేశాయి. తనకోసం ఇంతచేసిన నాన్నని దగ్గరుండి చూసుకోలేక పోతున్నానే అని గుండెల్లో బాధ కమలాకర్‌కి మరిశీత ఎక్కువవుతుంది. నాన్నని దగ్గరుండి చూసుకుందామంటే ఉద్యోగం పోయేతట్టుంది, పోషిస్తున్న ఉద్యోగాన్ని కాదని వెళ్ళితే కుటుంబం మొత్తం రోడ్డుమీదకు వచ్చేతట్టు ఉంది. నాన్న, ఉద్యోగం రెండింటి మధ్య తాను ఎటు వైపు ఉండాలో కమలాకర్‌కి సంకటస్థితి ఏర్పడింది. మహిళలకి ‘మెటర్నిటీ లీవులు, చైల్డ్‌ కేర్‌ లీవులు’ ఉన్న లాగున ఉద్యోగం చేసే వారందరికీ ‘పేరెంట్స్‌ కేర్‌’ లీవులు కూడా ఉంటె బాగుండు అని కమలాకర్‌ తనలో తానే అనుకున్నాడు.
చేతిలో డబ్బులు లేకపోవడంతో తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువులకు ఫోన్‌ చేసి కమలాకర్‌ డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ లీవ్‌ కావాలి ఎలా అడగాలో తెలియడం లేదు.
లక్డికపుల్‌ చౌరస్తా దగ్గర రెడ్‌ సిగల్‌ పడడంతో బస్సు ఆగింది. ఒకరిద్దరూ బస్సు నుండి దిగి వెళ్లడంతో అప్పటివరకు నిలబడి ఉన్న కమలాకర్‌ ఒక సీట్‌ ఖాళీ అవడంతో కూర్చోవడానికి ప్రయత్నిస్తుండగా స్కూల్‌ నుండి కూతురు క్లాస్‌ టీచర్‌ నుండి ఫోన్‌…
”నమస్తే సార్‌! నేను మీ అమ్మాయి క్లాస్‌ టీచర్‌ మాట్లాడుతున్నాను.”
”నమస్తే! మేడంగారు చెప్పండి”
”సార్‌ మీరు అర్జెంటుగా స్కూల్‌కి రండి”
”ఏమైంది? మేడమ్‌..” అంటూ కమలాకర్‌ కంగారు పడుతున్నాడు
”కంగ్రాట్యులేషన్స్‌! సార్‌! ”
”థాంక్యూ!, ఎందుకొరకు మేడం చెప్పండి”
”ఏం లేదు సార్‌! మీ పాప ‘మెచ్యూర్‌’ అయింది, వచ్చి తీసుకెళ్లండి”
”సరే మేడం”
ఈ సంతోషకరమైన విషయాన్ని భార్యకు, అమ్మనాన్నకు ఎలా తెలియజేయాలో అర్థం కావడం లేదు. ఒకవైపు నాన్న ప్రాణాల కోసం పోరాడుతున్నాడు, ఇంకోవైపు కూతురి జీవితంలోని కీలక ఘట్టం. వాళ్లేమో హాస్పిటల్‌లో, నేనేమో డ్యూటీలో, పాప స్కూల్లో. పాపకి చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు ఎలా?. ఒకవైపు నాన్న హాస్పిటల్‌ ట్రీట్మెంట్‌, ఇప్పుడు పాపకి మెచ్యూర్‌ ఫంక్షన్‌ చేయాలి. వీటన్నిటికీ డబ్బులు కావాలి. మరోవైపు లీవ్‌ కావాలి. ఇవి రెండూ డబ్బు లేక, లీవులు లేక కష్టాల్లో చిక్కుకునేతట్టున్నాయి. ఇంతకుముందే ‘ఇంకోసారి లీవ్‌ అడిగావంటే సస్పెండ్‌ చేయాల్సి వస్తుంది’ అని పై అధికారి అనడం కమలాకర్‌కి గుర్తొచ్చి చౌరస్తాలో సిగల్‌ పడి ఆగిపోయిన బస్సు లాగే తన పరిస్థితి ఉందనుకొని ఖాళీ ఉన్న సీట్లో అలాగే కూలబడిపోయాడు.
”ప్రతీ టికెట్‌ వెనుక ఒక జీవితం ఉంటుంది. ప్రతి నవ్వు వెనుక ఒక పోరాటం ఉంటుంది.”

గాజోజి శ్రీనివాస్‌
9948483560

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -