Sunday, April 26, 2026
E-PAPER
Homeసోపతిఆధ్యాత్మిక భారతం భౌతిక పాశ్చాత్యం ముగ్గురు టాగోర్‌లు

ఆధ్యాత్మిక భారతం భౌతిక పాశ్చాత్యం ముగ్గురు టాగోర్‌లు

- Advertisement -

19వ శతాబ్దం మారే సమయానికి భారతీయుల స్వదేశీ సిద్ధాంతం ఒక ద్వంద్వ ఆలోచనల మధ్య తిరుగాడుతోంది. భారతీయులది ఆధ్యాత్మిక మార్గం. యూరోపియన్లది భౌతిక మార్గం. ఇవి వ్యతిరేకం అనే ఆలోచన ప్రబలింది. మనదేశ ఆధ్యాత్మిక మార్గాన్ని, ప్రాచీన భారతీయ సమాజ సంస్కృతిని పునర్జీవింపచేయాలనే ఆలోచన కొందరు కళాకారులదైతే యూరోపియన్ల ఆధునికతపై రాగద్వేషాల ద్వంద్వ భావనలు రెండూ కళాకారులలో కనిపించాయి. కొందరు కళాకారులు మనసంస్కృతి పునర్జీవనం ఒక్కటే మార్గం అంటే కొందరు ఆధునిక ఆలోచనలూ కలుపుకుని వెళ్లాలని సూచించారు.

18వ శతాబ్దంలో వచ్చిన ఇండిస్టియల్‌ రెవల్యూషన్‌ బ్రిటిష్‌ వారు ఇక్కడికీ తీసుకొచ్చినందు వలన మన హస్తకళలపై కూడా ప్రభావం పండింది. కళావస్తువులను కర్మాగారాలలో ప్రతిరూపాలు (కాపీలు) అనుకరణ వస్తువులు తయారు చేయటం సులభం అయింది. ఈ వస్తువుల ఇండిస్టియల్‌ ప్రదర్శనలని 1850 – 70ల మధ్య బ్రిటన్‌లో జరిపించారు బ్రిటీష్‌వారు. భారతదేశం వారి అధికారంలోనే వుండడంలో భారతదేశ కళలను కర్మాగార వస్తువులను ప్రదర్శించడం జరిగింది. భారతీయ కర్మాగార కళావస్తువులకు ఎక్కువ అమ్మకాలు జరగడంతో బ్రిటిష్‌వారు మన వస్తువులను అలంకరణ వస్తువులుగా ప్రకటించి వీటినే ప్రఖ్యాతి చేయదలచుకున్నారు. అందులో వారి అర్థం మనవి కళలు కావనీ, వారివి సిద్ధాంత పూరిత ఆలోచనా పూరిత కళలనీ మనవి తక్కువ హోదాలో చూడాల్సిన అలంకరణ కళలనీ వారు చెప్పక చెప్పడమైంది. అక్కడే మొదలైంది బ్రిటీష్‌ అధికార ఉద్దేశాలపై భారతీయ కళాకారుల వ్యతిరేక భావనలు.
భారతీయ కళలలో ఆధ్యాత్మిక భావాలు నిండి వుండగా బ్రిటీష్‌ వారి కళలు భౌతిక ప్రాపంచిక భావం మటుకే వుందని నొక్కి చెప్పదలిచారు భారతీయ కళాకారులు. ఇందులో ముందడుగు వేసి కళాప్రపంచంలో కళల పునర్జీవనం గురించి ఆలోచించిన ముఖ్యులు బెంగాలీలు. బ్రిటీష్‌ వారి ప్రభావమూ అక్కడ ఎక్కువే వుండింది. ముందుగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపారం పేరు మీద బ్రిటీష్‌ వారు వచ్చింది బెంగాలే కదా!
1860లో భారతీయ కళలు సాహిత్యం మీద ఎన్నో చర్చలు జరిగాయి. బర్డ్‌ వుడ్‌ వంటి బ్రిటీషర్లు మన సంప్రదాయ కళలను ప్రోత్సహించిన తీరు వలన కళా విద్యార్థులూ ఉత్సాహం పొందారు. నాబా గోపాల్‌ మిత్ర ‘హిందూమేళా’ పేరు మీద బెంగాలులో ప్రాంతీయ చేతి పనుల సంత ఏర్పాటు చేశాడు. ఇందులో స్త్రీలు కుట్టిన, అల్లిన అల్లికలు, జైలులో ఖైదీలు చేసిన తివాచీ జంపకానాలు, ఆర్ట్‌ స్కూల్‌ విద్యార్థులు చేసిన హస్త కళలు ప్రదర్శించబడ్డాయి. కుమ్మరి వాళ్లు చేసిన హిందూదేవతల, గ్రీకు దేవతల బొమ్మలు ప్రదర్శించబడ్డాయి. ఈ మేళా కొంతకాలం వరకూ ప్రతీ సంవత్సరమూ జరిగింది. ఇందు ప్రదర్శించడానికి మన స్వదేశీ వస్తువులే తీసుకురావాలని ప్రచారం మొదలైంది. కాళిదాసు కవితలపై ఆధారపడిన చిత్రాలకూ ప్రాధ్యాన్యం దక్కడం మొదలైంది. ఈ మేళా బ్రిటీష్‌వారి ఇండిస్టియల్‌ ప్రదర్శనకు విరుద్ధంగా తల పెట్టిన ప్రదర్శన అని చెప్పకనే అర్థం అవుతుంది. పాశ్చాత్యులు కళలే కాదన్న మన కళలకు పట్టం కట్ట దలిచారు దేశాభిమాన కళాకారులు. స్వదేశీ భావం చక్కగా ప్రబలింది ఈ కార్యక్రమాల వలన.
ఆ సమయానికి పాశ్చాత్యుల ఆధునిక కళలు మన కళా సమాజంలో ప్రబలి వున్నాయి. ఏ విధంగా ఆధునిక సిద్ధాంతాలను భారతీయ సమాజ పునరుద్ధరణకు భారతీయ కోణంలో సమాజ ఉద్ధారకులు ఉపయోగించుకున్నారో అలాగే చాలామంది మన కళాసంస్కృతి ప్రేమికులు భారతీయ ఆధునికతను కళావేదికపైకి తెచ్చారు. బ్రిటీష్‌ వారు మనకళలను, సంస్కృతి ప్రాముఖ్యత విలువ తగ్గించే ప్రయత్నంలో వున్నారు. వారి తెల్ల గర్వానికి జవాబిచ్చి మన కళా సంస్కృతి విలువలను కొత్త పంథాలో వెలికి తీశారు స్వదేశీ ప్రేమికులు.

స్వదేశీ భావజాలం : భారతీయుల కళలు ఆధ్యాత్మిక ఆలోచనా ప్రధానం అనీ ఆ విలువలను వెలికితీయాలనీ, బ్రిటీష్‌ కళలు భౌతిక ప్రధానం అనీ, అవి తమ విరుద్దమనీ నిరంతర ప్రకాశం మొదలెట్టిన భారతీయ కళా సంస్కృతి వేదికకు చేయూతనిచ్చిన వారు ఇ.బి.హవెల్‌ బ్రిటీషరు (1861-1934) అనే కళా చరిత్రకుడు, సిస్టర్‌ నివేదిత (1867 – 1911), అనే ఐరిష్‌ స్త్రీ, స్వామి వివేకానంద శిష్యురాలు, సంఘసంస్కర్త, లేఖకి, భారతీయ ఆధ్యాత్మిక తత్వవేత్త. ఆనంద కుమార స్వామి (1877 – 1947) సిలోన్‌ చరిత్రకారుడు భారతీయ తత్వశాస్త్రవేత్త. ఈయననే భారతీయ కళల సరైన భావనని పాశ్చాత్యులకు విప్పి చెప్పాడు.
జపాన్‌ నుండి 1902లో భారతదేశం వచ్చిన ఓకాకురాకకుజో (1863 – 1913), కళా పరిశోధకుడు, వివేచకుడు. ఇతను కలకత్తా చేరాడు. భారత దేశానికి మల్లే జపాన్‌ యూరోపియన్ల కాలనీ కాకపోయినా వారి అధికారం, ప్రభావం ప్రతి రంగంలోనూ అధిక్యత కొనసాగించారు. అందువలన అక్కడా ఇలాంటి స్వదేశీ భావనలు వున్నాయని ఇక్కడి వారికి అర్థం అయింది. అందువలన ప్రాంతీయంగా స్వదేశీ కళ అనే కంటే ‘పాన్‌ – ఏశియన్‌’ లేదా ఓరియంటల్‌ (తూర్పు దేశాల) కళగా, బ్రిటీష్‌కి వ్యతిరేకంగా ముందడుగు వేయించవచ్చని కలిసికట్టుగా నిర్ణయించారు. ఇందుకు నాయకత్వం వహించి, ముందడుగు వేసింది ముగ్గురు బెంగాలీలు, రవీంద్రనాథ్‌ టాగోర్‌, అబనీంద్రనాథ్‌ టాగోర్‌, గగనీంద్రనాథ్‌ టాగోర్‌. వీరు ఒకాకురాకు తమ ఇంటనే ఆతిథ్యం ఇచ్చారు.

అబనీంద్రనాథ్‌ టాగోర్‌ (1871 -1951) : బెంగాలీ కళా సంస్కృతులను పునర్జీవనం చేయదలచిన మొదటి కళాకారులల్లో ముఖ్యమైన కళాకారుడు అబనీంద్రనాథ్‌ టాగోర్‌. భారతదేశ స్వదేశీకళల పునర్జీవన నాయకుడు అని కూడా చెప్పాలి. ధనవంతులైన టాగోర్‌ కుటుంబంలోని వాడు అబనీంద్రనాథ్‌. కలకత్తాలో జోరాసాంకోలో టాగోర్‌ కుటుంబం నివసించింది. అక్కడి అందరి ధనవంతుల ఇళ్లలాగే వీరి ఇంట్లో ‘బైఠక్‌’ హాలులో యూరోపియన్‌ శిల్పాలు, లోపలి ‘జెనానా’ గదులలో భారతీయ కళలు ప్రదర్శించబడ్డాయి. ఆ కుటుంబంలో ఎందరో లేఖకులు, కవులు, కళాకారులు వున్నారు. రవీంద్రనాథ్‌ టాగోర్‌కి అన్న కొడుకులు గగనేంద్రనాథ్‌, అబనీంద్రనాథ్‌ టాగోర్‌. అబనీంద్రను దృశ్యకళ ఆకట్టుకుంది. చార్ల్స్‌ పాల్మర్‌ అనే కళాధ్యాపకుడి వద్ద తైల వర్ణ చిత్రం వేయడం నేర్చుకున్నాడు. ఇతనికి యూరోపియన్ల చిత్ర కళా పద్ధతి నచ్చలేదు. చిన్నతనంలో అతను చూసిన హిందూమేళా, అందులోని స్వదేశీ ఆలోచనలు అతని మనసులో నాటుకున్నాయి. అతని పినతండ్రి రవీంద్రనాథ్‌ టాగోర్‌ అప్పటికే సాహిత్యంలో చరిత్ర పునర్జీవనం చేసే ప్రయత్నంలో వున్నాడు. సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న అబనీంద్రకు రవీంద్రనాథ్‌ టాగోర్‌ ఇచ్చిన రవివర్మ చిత్రాల ప్రింటులు భారతీయ కళా సంస్కృతివైపు ఇతని మనసు తిప్పింది. ఆపై జైపూర్‌ లఘుచిత్రాలు ఇతన్ని ఆకర్షించాయి. ఇదే సమయంలో ఇ.బి.హవెల్‌, కలకత్తా ఆర్ట్‌ స్కూల్‌కి వచ్చాడు. 1896 నుండి 1906 వరకు ఇక్కడ వున్న ఈయన భారతీయ విద్యార్థులకు భారతీయ కళలు నేర్పించాలని, యూరోపియన్‌ పద్ధతి కాదని, కొన్ని విరుద్ధ చర్యలు కూడా నిర్వహించాడు.

రణదాప్రసాద్‌ దాస్‌ గుప్త వంటి చాలామందికి హవెల్‌ చర్యలు నచ్చక జుబేలీ ఆర్ట్‌ అకాడమీ, కలకత్తాలో తెరిచారు. ఇదీ స్వదేశీ భావజాలంతోనే నడించింది కానీ పద్ధతి భారతీయ పురాతన పద్ధతులే వుండాలని నిర్బంధించలేదు. టాగోర్‌ కుటుంబం, వారి సహచరులు స్వదేశీ సంస్కృతి పునర్జీవనం చెయ్యాలనీ, మరో సమూహం వారు బ్రిటీష్‌ వారి పాలన పోవాలి, స్వదేశీ పాలన రావాలి కానీ పాశ్చాత్యుల వలన వచ్చిన అభివృద్ధి ముందుకు సాగాలన్నారు. ఈ రెండు సమూహాలు, వారి ఆలోచనలు, ఆధునికత వైపే ప్రయాణించాయి. బిటీష్‌వారి ఆధునికత ఆపాదించుకుని మన సమాజం కోణంలో చూశారు మరికొందరు.
హవెల్‌ తన వారసుడిగా అబనీంద్రని కలకత్తా ఆర్ట్‌ స్కూల్‌కి అధ్యాపకుడిగా ఎన్నుకున్నాడు. ఈ సమయాన అబనీంద్రనాథ్‌ కొన్ని ముఖ్య చిత్రాలు హిందూ సంస్కృతి మీద వేశాడు. మొగలు చిత్రాలు అతనిని ఆకర్షించాయి. బహదూర్‌షాని బంధీ చేయడం, తాజ్‌ మహల్‌ నిర్మాణం, షాజహాన్‌ ఆఖరి సమయం, బుద్ధ సుజాత వంటి కొన్ని చిత్రాలు ఈయనకు పేరు తెచ్చాయి. మొగలు చిత్రాల పద్ధతి భారతీయత ఎలా అవుతుందనే ప్రశ్నలూ వచ్చాయి. ఆపై అబనీంద్రనాథ్‌ తక్కువ రంగుల జపాన్‌ పద్ధతి మొదలెట్టాడు. ముందు పేపర్‌ని తడిపి దానిపై నీటిరంగులను వేస్తే ఒక నీటి పొరలాంటి కల లాంటి చిత్రాలు వస్తాయి. ఇది జపాన్‌ వారి పద్ధతి. అబనీంద్రనాథ్‌ పాశ్చాత్య పద్ధతి పూర్తిగా దూరం పెట్టి జపాన్‌ వారి పద్ధతిలో భారతీయ చిత్రాలు వేశాడు. మేఘదూతం, విలపిస్తున్న యక్ష వంటి చిత్రాలు వేశాడు. ముందు బంగమాత చిత్రం చిత్రించి తరువాత ఆ చిత్రానికి భారతమాతగా పేరు పెట్టాడు. ఆ స్త్రీ అన్నం, వస్త్రం, శిక్ష, దీక్ష అనే విశేష వస్తువులు చేత పట్టి వుంది. ఇది కళాత్మక చిత్రం కన్నా రాజకీయ చిత్రంగా ఆనాటి స్వదేశీ పోరాటానికి గుర్తుగా పేరుపొందింది. ఈ చిత్రం బకించంద్ర వారి వందేమాతరానికి రూపం. ఈయన తన కళల ఆలోచనల ద్వారా బెంగాలు కళల ఆధునిక సిద్ధాంతాన్ని నిలబెట్టాడు. తన అన్నగారైన గగనేంద్రనాథ్‌ టాగోర్‌తో కలిసి స్వదేశీ విలువలు నిలబెట్టగోరి తూర్పు దేశాల కళల భారతీయ సంస్థ (ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఓరియంటల్‌ ఆర్ట్‌) ని నిలబెట్టిన ముఖ్యుడు. యూరోపియన్‌ కళల పద్ధతికి విరుద్ధంగా, అజంతా, మొగలు, రాజపుత్‌, మన సాహిత్యం, ఆధ్యాత్మిక విలువలను తీసుకుని, మన ఆలోచన జోడించి పురోగమన పద్ధతిన చిత్రం గీయాలని సందేశం ఇచ్చాడు. ఇది అబనీంద్రనాథ్‌ చిత్రించిన ఆధునిక చిత్రం.

రవీంద్రనాథ్‌ టాగోర్‌ (1861 – 1941) :
ఈయన పేరు సాహిత్య రంగంలో పండిత పామరులందరికీ విదితమైంది. ఎంతో చిన్నతనం నుండే ఈయన రచనలు చేశాడు. భారతీయ స్వదేశీ భావనను అంతర్జాతీయతతో జోడించి పురోగమన భావాలతో రచనలు చేశాడు. భారతీయ సంస్కృతి పునర్జీవనం ఎంత ముఖ్యమో అంతర్జాతీయ అవగాహన, మానవతా దృక్పథం అంతే ముఖ్యమన్నది ఈయన ఆధునికత. తన అన్న కొడుకైన అబనీంద్రునకు స్వదేశీ పునర్జీవనం అనే ఆలోచనలో ఇరుక్కు పోవద్దని సలహా ఇచ్చాడు. ఈయన 67వ సంవత్సరంలో అగ్నిపర్వతం బద్దలైనట్టు చిత్రం గీయటం మొదలెట్టాడు. ఈయన తన రచనలు రాస్తున్నప్పుడు కొట్టేసిన పదాలను ఒక దానితో ఒకటి కలిపేవాడు. అలా డూడుల్స్‌గా కలిపిన గీతలు ఒక చిత్రంలా తేలేవి. అవి ఆయన మొదటి చిత్రాలైతే, ఆపై పోట్రేటులు, ప్రకృతి దృశ్యాలు చిత్రాలుగా వేశాడు. ఆయన చిత్రాలు చిన్నపిల్లల చిత్రాలుగా అనిపిస్తాయి. ఆయన చిత్రాలకు, రచనలకు మధ్య సంబంధం, లయ అని ఆయనే చెప్పాడు. ఆయన పోట్రేటు చిత్రాలు, గార్డ్‌నర్‌ అనే ఆయన కవితల సంపుటిలోని అర్థం గోచరిస్తాయి. అలాగే ఆయన ప్రకృతి చిత్రాలు, ఆయన గీతాంజలి రచనా సంపుటిలోని తత్వం చిత్రంగా చూపుతున్నాయా అని అనుమానం రాక మానదు. అలాగని ఆయన చిత్రాలు రచనల మధ్య నేరుగా సంబంధం చూపలేము.

చిత్రం గీయటానికి గానీ, రచన చేయటానికి కానీ ఆయన ఏ శిక్షణా పొందలేదు. ఆయన ప్రకృతి చిత్రాలు అవి ఏదో ప్రాంతానివి అనిపించదు. లేదా అవి ఏవో నిజంలో కనిపించే చెట్లని పోల్చలేం. ఆ చిత్రాలు ఏదో జీవిత రహస్యాలు అనిపిస్తాయి. అవి ప్రకృతిలోని నిశ్శబ్దానికి నిర్వచనాలు, ఒంటరి బాటసారి ప్రయాణానికి తత్వార్థాలు. ఆయన చిత్రాలలో ఒక విచారపూరిత గీతలుంటాయి. తత్వ విచారాలు, ఏ దిక్కునున్న మానవులకైనా ఒకేరకమైన అనుభూతులు. ఇవి ఆయన ఆధునికత నిర్వచనాలు.
1912లో గీతాంజలి కవిత సంపుటి రాస్తే దానికి 1913లో నోబెల్‌ బహుమానం వచ్చింది. 1920లో శాంతినికేతన్‌ బెంగాల్‌లో స్థాపించాడు. ఇది బ్రిటీష్‌ రాజ్‌ విద్యా పద్ధతులకు విరుద్ధంగా భారతీయ గురుకుల పద్ధతిలో నిర్మాణం చేశాడు. విద్యార్థులకు ఏ కళ నేర్చుకోవాలన్నా నియంత్రణ లేదు. తను ఉపన్యాసాలిచ్చిన చందాలతో ముందు ఈ కేంద్రం పని చేయించాడు.
ఈయన 13 ఏళ్లకే కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లండన్‌ యూనివర్సిటీలో చదువుకున్నాడు. 20 ఏళ్లకు నృత్య నాటికలు రాసి వేదికనెక్కించాడు. సంగీతం, సాహిత్యం, నాటకం, చిత్రం ఇన్ని కళారూపాల మధ్య ఒక మాధ్యమంలో వ్యక్తం చేయని భావాన్ని మరో రూపంలో భావప్రకటన చేస్తూ కళలలో పరిపూర్ణ ఆనందం పొందాడు.
గగనేంద్రనాథ్‌ టాగోర్‌ (1867 – 1938) : ఈయన రవీంద్రనాథ్‌ అన్న కొడుకు. అబనీంద్రనాథ్‌కి అన్న. ఈయనా జోరాసాంకో కలకత్తాలోనే పుట్టి పెరిగాడు. సినీ తార షర్మిలా టాగోర్‌కి ముత్తాత. జోరాసాంకోలోని వీరి కుటుంబం బెంగాల్‌ ఆధునిక కళా సంస్కృతులకు రూపం ఇచ్చింది. ఈయన ఆర్ట్‌ స్కూల్లో చేరి చదువలేదు కానీ హరినారాయణ చటోపాధ్యాయ వద్ద నీటిరంగుల చిత్రం వేయటం నేర్చుకున్నాడు. తన తమ్ముడు అబనీంద్రనాథ్‌తో కలిసి ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఒరియంటర్‌ ఆర్ట్‌ని బెంగాల్‌ ఆధునిక కళల సంస్థగా నిర్మించారు. ఈయన అబనీంద్రనాథ్‌కి మల్లే బ్రిటిష్‌ వారికి విరుధంగా భారతీయ సంస్కృతి పునర్జీవనం ఒక్కటే భారతీయుల ఆధునిక సిద్ధాంతం అనే ఆలోచనల నుండి బయటకు వచ్చాడు. తన చుట్టుపక్కల సమాజంలోని వ్యక్తుల అసమాన వ్యవహారాలను, బ్రిటీష్‌ వారిపైన, వారి ఆర్ట్‌ కళాశాలల మీద విరుద్ధంగా హాస్య చిత్రాలు చిత్రించాడు. ఈయన చిత్రం ఒకటి ఆర్ట్‌ స్కూల్‌ మిషను నుండి, విద్యార్థుల రబ్బరు ముక్కల్లా బయటకు విడుదలవుతున్నట్టు చిత్రించాడు. రూపం అనే కళా పత్రికని ప్రచురించిన సంస్థలో ఈయనా భాగమే. 1906 -10 మధ్య జపాన్‌, చైనా వారి కళా పద్ధతులను నేర్చుకున్నాడు. ఓకాకురా అనే జపాన్‌ కళా వివేచకుడు తెలిపిన జపాన్‌ వారి నల్లటి ఇంకు గీతల పద్ధతి ఈయన చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తుంది. 1912లో రవీంద్రనాథ్‌ టాగోర్‌ ఆత్మచరిత్ర, జీవన సృతి అనే రచనకు ఈయన వేసిన చిత్రాలలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ముందు బెంగాల్‌ కళాకారుల సంస్థలో వలెనే తానూ భారతీయ సంస్కృతి పునర్జీవనం కోసం ఆలోచించి చిత్రించినా, తరువాత అవి వదిలేసి హాస్య చిత్రాలు వేయమొదలెట్టాడు. అంతేకాదు ఆనాటి పాశ్చాత్య కళా పద్ధతి, ఫ్రాన్స్‌ నుండి వెలవడిన క్యూబిజం పద్ధతి తన చిత్రాల్లో అలవర్చుకున్నాడు. తన హాస్య చిత్రాలలో చూపమొదలెట్టాడు. ఈయన నాటకం, పిల్లల పుస్తకంలోనూ రచన స్పూర్తి తీసుకున్నాడు. తన చుట్టూ వున్న సమాజంలోని మంచి చెడులను తన చిత్ర పద్ధతిలో హాస్య చిత్రాలు వేస్తూ వివేచకుడిగా పని చేసిన ఆధునికుడు.

రవీంద్రుడు, గగనేంద్రుడు తన సమాజ పరిస్థితులకు అవసరమైన కళాసంస్థ, చిత్ర రచన చేస్తూ చూపిన సమాజ స్పృహ వారి ఆధునికత. వీరు భారతీయ విషయంపైనే పని చేసినా బ్రిటీష్‌ పద్ధతి కోసం విరుద్ధం అనలేదు. అందు మంచి భావప్రకటన ఎలా అయితే ఏమి అనుకున్నారు. అబనీంద్రుడు యూరోపియన్‌ పద్ధతిని విరోధించటమే, మన సంస్కృతిక పునరుజ్జీవనం అదే మన ఆధునికం అన్న ఆధునికుడు. ఆధునిక సిద్హాంతం, ఎవరి ఆలోచనా పద్ధతికి సరిపడా వారికి అర్థం ఇవ్వగల వత్తం.

డా||యం.బాలామణి, 8106713356

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -