Sunday, May 3, 2026
E-PAPER
Homeసోపతిప్రకృతి ఫలం..తాటి ముంజలు

ప్రకృతి ఫలం..తాటి ముంజలు

- Advertisement -

వేసవి మొదలైతే పండ్లతో మార్కెట్‌ కళకళలాడుతుంది. మామిడి తీపిని పంచుతుంది. పుచ్చకాయ చల్లదనాన్ని అందిస్తుంది. ద్రాక్ష, బత్తాయి, జామ, దోసకాయలు… ఇలా అనేక పండ్లు తమ తమ రుచులతో ఆకట్టుకుంటాయి. కాలానుగుణ ఫలాల సరసన నిశ్శబ్దంగా వచ్చి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేది తాటి ముంజలు. ఇవి కేవలం రుచికోసం తినేవి కాదు. ప్రకతి గర్భంలో సహజంగా రూపుదిద్దుకున్న స్వచ్ఛమైన శీతలాహారం. ఎలాంటి రసాయనాల జాడ లేకుండా, కత్రిమ పక్వం తాకకుండా, చెట్టు గుండెలో పుట్టి నేరుగా మన చేతికి చేరే సహజ అమతం. అందుకే తాటి ముంజలు వేసవిలో దాహం తీర్చటమే కాదు.. శరీరానికి చల్లదనం, ఆరోగ్యానికి రక్షణ, పల్లె సోయగానికి ప్రతీక.

ఒకప్పుడు తాటి ముంజలు పల్లె జీవనంలో భాగం. చెరువు గట్టు, పొలం అంచు, తాటి తోట.. ఇవే వాటి ప్రపంచం. నేడు అదే ముంజలు పల్లె గడప దాటి పట్టణ నగర వీధుల్లోనూ రహదారుల వెంట కనిపిస్తున్నాయి. తెల్లవారుజామునే గ్రామాల నుంచి తాటి ముంజల గెలలు తెంపుకొని రహదారుల వెంట, కూడళ్లలో, మార్కెట్‌ ప్రాంగణాల్లో అమ్మకానికి చేరుతున్నాయి. హైదరాబాద్‌ వంటి మహానగరాలకు ప్రత్యేకంగా ఆటోలు, చిన్న లోడింగ్‌ వాహనాల్లో గెలలతో తరలించి అక్కడి మార్కెట్లలో విక్రయిస్తున్నారు. పల్లె నేల నుంచి వచ్చిన ఈ సహజ ఫలానికి నగరవాసుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కూల్‌డ్రింక్‌ల కంటే ముంజలే మేలు అన్న అవగాహన పెరుగుతోంది.
గీత కార్మికుడి జీవన పోరాటం
తాటి ముంజల విక్రయం వెనుక గీత కార్మిక కుటుంబాల శ్రమ ఉంది. ఎత్తైన తాటి చెట్లెక్కి గెలలు కోయడం సాధారణ పని కాదు. మండే ఎండలో ప్రాణాలకు తెగించి చెట్టు ఎక్కాలి. గెలల గుత్తులు కోసి కిందికి దించాలి. వాటిలోని ముంజలను వేరు చేసి శుభ్రం చేయాలి. ఈ కష్టసాధ్యమైన ప్రక్రియలో కుటుంబమంతా పాలుపంచుకుంటుంది. పురుషులు చెట్లు ఎక్కితే, మహిళలు శుభ్రపరిచి అమ్మకానికి సిద్ధం చేస్తారు. కొద్ది రోజుల సీజన్‌నే నమ్ముకుని బతికే ఈ కుటుంబాలకు ముంజల అమ్మకం ప్రధాన ఆదాయం.
ప్రస్తుతం ఒక డజను ముంజలను రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. చిన్న పట్టణాల్లో రోజుకు రూ.2,000 నుంచి రూ.4,000 వరకు అమ్మకాలు సాగుతుండగా, హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో రోజువారీ విక్రయాలు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు నమోదవుతున్నాయి. వేసవిలో ఈ స్వల్ప కాలం గీత కార్మిక కుటుంబాలకు ముఖ్యమైన ఉపాధి మార్గంగా మారుతోంది.
తాటి ముంజల ప్రత్యేకత
తాటి ముంజలను ప్రత్యేకంగా నిలబెట్టేది వాటి స్వచ్ఛత. నేటి మార్కెట్‌లో కనిపించే అనేక పండ్లు నిల్వ కోసం, రంగు కోసం, పక్వం కోసం రసాయనాలపై ఆధారపడుతున్నాయి. కానీ తాటి ముంజలు మాత్రం ప్రకతి సిద్ధమైన ఫలం. చెట్టు గర్భంలో నీటి సారం, నేల గుణం, ఎండ తాపం కలిసి సహజంగా వాటిని మలుస్తాయి. ఎలాంటి కెమికల్‌తో పండించరు. నిల్వ కోసం మందులు చల్లరు. రంగు మార్చరు. రుచి కోసం కలపరు. కోసిన వెంటనే తినదగిన స్వచ్ఛమైన జీవరసం ఇవి. అందుకే ముంజలు వేసవిలో అత్యంత స్వచ్ఛమైన సహజ ఆహారంగా నిలుస్తాయి. అందుకే దానిని ఐస్‌ ఫ్రూట్‌ అంటారు.
పోషకాలు పుష్కలం
తాటి ముంజల్లో నీటి శాతం అధికం. అందుకే ఇవి శరీరానికి తక్షణ చల్లదనాన్ని అందిస్తాయి. సహజ గ్లూకోజ్‌ శక్తిని ఇస్తుంది. పొటాషియం, సోడియం వంటి ఖనిజలవణాలు చెమటతో తగ్గిపోయే లవణాలను భర్తీ చేస్తాయి. కాల్షియం ఎముకలకు బలం ఇస్తుంది. ఐరన్‌ రక్తహీనతను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఫాస్ఫరస్‌ శరీర కణజాలానికి మేలు చేస్తుంది. విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్‌ బి శరీరానికి శక్తిని అందిస్తుంది. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని లోపలి వేడి ప్రభావం నుంచి రక్షిస్తాయి.
ఆరోగ్యానికి ముంజల మేలు
తాటి ముంజలు వేసవిలో శరీరానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. దాహాన్ని తగ్గిస్తాయి. డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి. శరీర వేడిని సమతుల్యంలో ఉంచుతాయి. కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తాయి. జీర్ణవ్యవస్థను సరిచేస్తాయి. తక్కువ కేలరీలతో ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. చెమటకాయలు, వేడి కురుపులు తగ్గించడంలో ఉపయోగపడతాయి. మూత్ర సంబంధ ఇబ్బందులను తగ్గిస్తాయి.
కూల్‌డ్రింక్‌ కంటే ముంజే మిన్న
కత్రిమ పానీయాలు క్షణిక చల్లదనమే ఇస్తాయి. తాటి ముంజలు మాత్రం శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తాయి. రంగు లేదు. రసాయనం లేదు. నిల్వ పదార్థం లేదు. ప్రకతి ఇచ్చిన స్వచ్ఛమైన శక్తి మాత్రమే ఉంది. ఒకవైపు ఆరోగ్యం కాపాడుతాయి. మరోవైపు గీత కార్మిక కుటుంబాలకు ఆదాయం అందిస్తాయి.
ముంజను ఆదరిద్దాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
తాటి ముంజలు వేసవిలో దొరకడమే కాదు, ప్రకతి ప్రసాదించిన స్వచ్ఛమైన ఆహారం. శరీరానికి చల్లని ఉపశమనం. పల్లె జీవనానికి గుర్తు. కష్టజీవి కుటుంబాలకు ఆధారం. ఈ వేసవిలో కత్రిమ పానీయాలకు బదులుగా తాటి ముంజలను ఎంచుకుంటే ఆరోగ్యం మన సొంతం.. ఆదరణ గీతన్నకు సొంతం.

  • గడగోజు రవీంద్ర చారి, 9848772232
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -