Monday, May 4, 2026
E-PAPER
Homeదర్వాజనాకెలాంటి సమస్య లేదు …!

నాకెలాంటి సమస్య లేదు …!

- Advertisement -

నాలోకి నేనే వెళ్లి వస్తుంటాను
నాకెలాంటి సమస్య లేదు!
నా నుండి విడివడి నా వైపు నేనే చూసుకుంటాను
అంతా బాగానే ఉంటుంది
నెరిసిన జుట్టు, కళ్లద్దాలు ఆకర్షణీయంగానే ఉంటాయి
వేసుకున్నదుస్తులు మడతలు లేకుండా ఇస్త్రీ చేయబడ్డాయి
దేహాన్నికప్పివుంచిన చర్మంపై మడతలు
అనుభవాలకు సంకేతమై నా అస్తిత్వపు జెండాను ఎగురవేస్తున్నాయి …
ఐనా –
కనబడని సంకెళ్లు ఇంకా నా చేతులను కట్టి పడేసేవున్నాయి
పెదవుల పైన మౌనం, కంటి నిండా విషాదం, దూరమైన నిద్ర ..
నాకెలాంటి సమస్య లేదు!
జైలు లాంటి గదిలో బంధువులను కలిసే స్వేఛ్ఛ వుంది
కొందరి సమాధులను దర్శించే స్వాతంత్య్రం వుంది
మిత్రుల తల పైన మొలిచిన కొమ్ములు నన్నేమి బాధించవు
నాలుగు గోడల మధ్య వదిలివేయబడిన స్వేచ్ఛాపక్షిని
కనబడని గాయాలకు చికిత్స లుంటాయా?
అనేక సందిగ్దతలను దాటుకొని నా అస్తిత్వం రూపుదిద్దుకుంది
నాలోనే ప్రకతి, పరిమళం, నాలోనే నీడల చిత్రికలు
అవహేళనలు చేసిన దుఃఖాల నుండి ప్రవహించిన
విషాద నదులు ముంచేసినా
త్యాగ గంగలో మునిగి తేలిన ఆనందం నా స్వంతం
మనిషిగా జన్మనిచ్చిన స్త్రీతత్త్వంలోని
ఉదారత్వం నిష్క్రియాపరమైనందుకు
నాకెలాంటి సమస్య లేదు!
నేను చెక్కిన శిల్పాన్నిమట్టిగా మార్చి
మరో అడవిని పునర్నిర్మించే ధైర్యం, శక్తి నాలో ఉన్నంత వరకు
నాకెలాంటి సమస్య లేదు!
అనేక నిరాశల మధ్య ఒక్క విషయం మాత్రం
ధైర్యాన్ని నిలబెడుతుంది…
మరణం తర్వాత జీవితం ఉంటుందని!
మరణం తరువాత జీవితంతో నాకెలాంటి సమస్య లేదు
కానీ, ఒక్క ప్రశ్న మాత్రం ఎప్పుడూ కలతబెడుతూ వుంటుంది,
మరణానికి ముందు జీవితం ఉంటుందా? యని
డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, 91778 57389

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -