Monday, May 4, 2026
E-PAPER
Homeదర్వాజచింతల చేను ఒక చలనచిత్రం

చింతల చేను ఒక చలనచిత్రం

- Advertisement -

చిన్నారి కథలు, చిట్టి పొట్టి కథల తర్వాత ఇప్పుడు తన మూడవ నవలగా, 22వ పుస్తకంగా ‘చింతల చేను’ పాఠకుల ముందుకు తీసుకొచ్చారు ఆర్సీ కృష్ణస్వామి రాజు. వీరి కథల ప్రత్యేకత స్థానికత ఉట్టిపడే పాత్రలు, వాటి భాష, నుడికారం, చమత్కారం, కించిత్‌ విషాదం… అన్నీ కలిస్తే కష్ణస్వామి రాజు రచన అవుతుంది.

చింతచేను, చింతల చేనుగా మారిన కథ. ఒకరి దగ్గర పని చేసిన స్థాయి నుండి ఒకరికి పని ఇచ్చే స్థాయికి వెళ్లేందుకు పోరాటం చేసిన ఒక ట్రాక్టర్‌ యజమాని కథ ఈ ‘చింతల చేను’ నవల. ‘చిన్న పుస్తకమైనా విస్తారమైన జీవన ప్రవాహం పరవళ్ళు తొక్కడం చూసి ఆశ్చర్యపడతారు’ అని అంటారు ముందుమాట రాసిన వాడ్రేవు చిన వీరభద్రుడు. నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మాటల్లో ”భూమిని నమ్ముకున్న రైతే కాదు, రైతును నమ్ముకున్న ఇతర వత్తుల వాళ్లు కూడా నిలువుగా మునిగిపోతున్నారనే పచ్చి వాస్తవాన్ని ఈ నవల ఆవిష్కరించింది’ అంటారు.

ఈ నవలలోని ఇతివత్తం ఏమిటంటే.. ఒక ట్రాక్టర్‌ సెకండ్‌ హ్యాండ్‌ ది అయినా సరే, కొనుక్కుంటే ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందనుకునే గుణశేఖరుడు, అతడి తల్లి నారాయణమ్మ, అతడి భార్య హైమావతి, కొడుకు బాలాజీ ముఖ్యపాత్రలు. కథ ఈ చిన్ని కుటుంబం చుట్టూతనే తిరుగుతుంది.
కథా క్రమంలో అక్కడక్కడ రచయిత అలవోకగా చేసే వ్యాఖ్యానాలు, ఇచ్చే స్టేట్మెంట్లు మనసుకు హత్తుకు పోతాయి. ‘రచయితకు జీతాలు ఎవరూ ఇవ్వరు. ఆయనే చాలామందికి జీవితాలు ఇస్తాడు’ అన్న వాక్యం దగ్గర ఒకింత సేపు ఆగిపోతాం.

గుణశేఖరుడి తల్లి నారాయణమ్మ ‘ఎదిగేటప్పుడు తొక్కేటోళ్లు- ఎదిగాక మొక్కేటోళ్లు ఎప్పుడూ ఉంటారు, అదంతా పట్టించుకోవద్దు కొడుకా” అని ఒక సందర్భంలో చెప్పిన మాట అద్భుతం. ‘కొంగున ఇంగువ లెక్కన’ ఏ విషయమైనా ఊరంతా ఇట్టే తెలిసిపోతుంది’ అని పల్లెలో ఏ విషయమైనా దాచిపెట్టడానికి సాధ్యం కాదని చెప్పడానికి ఇచ్చిన ఒక పోలిక.
‘ఒక పంచాయతీలో వాన పడితే మరో పంచాయతీలో వాన పడుతుందన్న గ్యారెంటీ లేదు’ అని చెబుతూ అందుకు ఉదాహరణగా ఒక మండలంలో వచ్చే వార్తలు మరో మండలంలో రాకపోవడాన్ని… వానలు పడకపోవడంతో జత కలిపి, రచయిత సందర్భోచిత వ్యాఖ్యానాన్ని చేస్తారు. ఒకనాటి తన పాత్రికేయ జీవితం నుంచి, తన బాల్యం నుంచి ఏ ఒక్క అనుభూతినీ విడిచి పెట్టకుండా, మర్చిపోకుండా. ఒక క్రమ పద్ధతిలో వాటిని తన రచనల్లో స్థానం కల్పించుకుంటూ వస్తున్నాడీ విలక్షణ రచయిత.

ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా తగిలే కరువు దెబ్బను ఈ నవల మన కళ్ళకు చూపిస్తుంది.
బండికి ఇన్సూరెన్స్‌ ఎందుకు చేయించలేదంటే.. ‘పలుపు దారం కొనలేని వాడు, పశువుని ఇంటికి తోలుకొచ్చినట్టుంది నా పరిస్థితి’ అంటాడు గుణశేఖరుడు. వెన్న పడే సమయానికి బాన పగిలినట్లు, గుణశేఖర్‌ జీవితం అలా కష్టాలపాలు కావడం, సాలిగూట్లో చిక్కుకున్న ఈగ మాదిరి తనకులాడటం నవలంతా కనిపిస్తుంది. అప్పు మొదట్లో చిన్నదిగానే కనబడుతుంది నది పుట్టుకలాగా. రోజులు గడిచే కొద్దీ వడ్డీలకు వడ్డీ కలిపిన చక్రవడ్డీగా అది చాంతాడంత అవుతుంది’ అన్న మాటల్లో రైతు భారతం అప్పుల బాగోతంగా మారడాన్ని చూస్తాము ఈ నవలలో.
అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయేటందుకు వారేమైనా రాజకీయాలు తెలిసినవారా? రాజకీయ నాయకులా? మరి. అప్పు చేసి ట్రాక్టర్‌ కొని చింతలేని జీవితం గడపాలనుకున్న గుణశేఖర్‌ జీవితం చివరకు ‘కుండకు ‘అప్పు’ అనే చిన్న చిల్లు పడి… ఆ తరువాత ఎన్ని నీళ్లు పోసినా కుండలో నీళ్లు నిలబడని రీతిలో అప్పులు పాలై తన సంసారం కూడా ఎగబడి రాదనే జ్ఞానోదయం కలుగుతుంది గుణశేఖరానికి.

కథాక్రమంలో కర్నూలు జిల్లా రైతుల ఎర్రగడ్డల ఘాటు ఏడుపులు, కడప జిల్లా అరటి రైతు ఆర్తనాదాలు, చిత్తూరు జిల్లా రైతు వాడిన పూలు, అనంతపురం జిల్లా వేరుశనగ వేదనలు చదువుతూ ఉంటే ఏ రైతూ తాను సుఖంగా ఉన్నానని చెప్పడం లేదన్న యథార్థం పాఠకుల మనసును నొచ్చుకునేలా చేస్తుంది. కప్పల మూట విప్పితే ఒక్కసారిగా కప్పలు ఎగిరెగిరి దుముకినట్లు, నిద్రపోతున్న తల్లి నారాయణమ్మ కొడుకు బాలాజీ గాడు భార్య హైమావతి లను చూస్తూ గుణశేఖరుడి ఆలోచనల మనసు పుట్టలోంచి తీసిన మాటలుగా రచయిత శైలికి ఉదాహరణ.
‘కప్పలు గిత్తలకన్నా గట్టిగా అరవగలవు. అంతమాత్రాన అవి పొలంలో నాగలిని లాగ గలవా?’ అని ..అప్పిచ్చిన సిద్దిరాజు అనడం విని తన శరీర భాగాలు ఎవరో కోసి వేస్తున్నంత బాధ కలుగుతుంది సున్నిత మనస్కుడైన గుణశేఖరుడుకి. కష్టాల గండాలు, సుడిగుండాలలో పడిపోయిన గుణశేఖరుడు ఆఖరు ప్రయత్నంలో తనకున్న స్థలం అమ్మి అప్పుల్లోంచి బయటపడాలనుకుంటాడు.
అయితే స్థలం- కబ్జాదారుల కోరల్లో చిక్కుబడిపోయి, కోర్టు వివాదాల్లో ఉన్న భూమిని అమ్మడం ఇప్పుడు కుదరదని తెలుసుకున్నాక గుణశేఖరుడి పరిస్థితిని రచయిత ఎలా సంకేతమాత్రంగా చెబుతాడో చూడండి… ‘ఏటిగట్టున కప్పను మింగుతున్న పాము, సగభాగం పాము నోటిలో ఉన్నా కప్ప పట్టు విడవలేదు. పెనుగులాడుతోంది మొండి ధైర్యంతో’.

అలాగే ఏటి గట్టున మామిడి చెట్టు పైన పిల్ల కోతి ‘మనం మానవులుగా మారేది ఎప్పుడు? అన్నట్లుగా అమ్మ వైపు చూస్తే, అమ్మ కోతి గుణశేఖర్‌ ని చూపిస్తూ ‘మానవుడిగా పుడితే తెలుస్తుంది ఎన్ని కష్టాలు ఉంటాయో, అయినా నీకేల తొందర? కోరి కష్టాలు తెచ్చుకోవాలని ఉందా? అని సమాధానం ఇవ్వడం రచయిత పరిపక్వతకనిపిస్తుంది. పదిహేనేళ్ల తర్వాత కొడుకు బాలాజీ పెద్ద ఉద్యోగస్తుడై తన వారిని శ్రీవారి దర్శనానికి సొంత కారులో తీసుకు వెళుతుండగా నవల ముగుస్తుంది. ఇప్పుడు గుణశేఖరుడు ఈమలిదశలో మరో నాలుగు కొత్త ట్రాక్టర్ల ఆసామే కాదు, ట్రాక్టర్ల కంపెనీ డీలర్‌ కూడా! అంటూ నవల ముగుస్తుంది. మొత్తానికి చింతల చేను జీవితం నుండి చింతలేని జీవితాన్ని, గుణశేఖరుడు రైతుగా సాధించలేని విజయాన్ని ఉద్యోగస్తుడైన కొడుకు మూలంగా పొందినట్లు చెప్పి రచయిత కుశాల పడతాడు.. పాఠకుడిని కూడా కొంత కుశల పరుస్తాడు. మొత్తానికి సీమ రైతు చరిత్రలో సేద్యం ప్రకరణంలో మరొక కొత్త కోణాన్ని కష్ణస్వామి రాజు చరిత్ర బద్దం చేశారు.

  • మల్లేశ్వరరావు ఆకుల, 79818 72655

చింతల చేను జీవితం నుండి చింతలేని జీవితాన్ని, గుణశేఖరుడు రైతుగా సాధించలేని విజయాన్ని ఉద్యోగస్తుడైన కొడుకు మూలంగా పొందినట్లు చెప్పి రచయిత కుశాల పడతాడు.. పాఠకుడిని కూడా కొంత కుశల పరుస్తాడు. మొత్తానికి సీమ రైతు చరిత్రలో సేద్యం ప్రకరణంలో మరొక కొత్త కోణాన్ని కష్ణస్వామి రాజు చరిత్ర బద్దం చేశా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -