సాహిత్యం సమాజం కోసమని విశ్వసించి, కాలదోషం పట్టిన సామాజిక వ్యవస్థను, ఆలోచనలను ఖండిస్తూ మూడు దశాబ్దాల పాటు హిందీ సాహితీ రంగాన్ని అభ్యుదయ పథంలో నడిపించిన రచయిత ప్రేమ్ చంద్. మొన్న జూలై 31న ఆయన జయంతి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆయన అసలు పేరు ధనపతి రాయ్ శ్రీవాస్తవ్. ‘కాశీ’కి సమీపంలోని ‘లమహి’ అనే గ్రామంలో 1880 జులై 31వ తేదీన జన్మించిన ప్రేమ్ చంద్ పసితనం నుంచే పేదరికాన్ని అనుభవించాడు. బి.ఎ. ప్రైవేటుగా ఉత్తీర్ణుడై ‘డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్’ అయ్యాడు. 1905 నుంచి ఉర్దూ భాషలో రచనలు చేసిన ప్రేమ్ చంద్ అసలైన సాహితీ జీవితం 1907 నుండే ప్రారంభమైంది. అభ్యుదయ భావాలతో సాహితీ రంగంలోకి ప్రవేశించి తాను తనువు చాలించే వరకు సమకాలీన సమాజానికి దర్పణం పట్టే 12 నవలలు, 300 దాకా కథలు, నాటకాలు, అనువాద రచనలు, బాలసాహిత్యం, సాహిత్య వ్యాసాల్ని భారతీయ సాహిత్య రంగానికి అందించాడు. 1908 నుంచి టాగూర్ ఆంగ్ల రచనలను ఉర్దూలోకి అనువదించిన ప్రేమ్ చంద్ మొదటి కథ ‘సంసార్ కి సబ్ సే అన్ మోల్ రతన్’ (ప్రపంచంలో కెల్లా అతి విలువైన వజ్రం).
ఈ కథ అప్పటి ‘జమానా’ పత్రికలో వచ్చింది. 1905-1907 నాటి ‘వందేమాతరం’ ఉద్యమ ప్రభావంతో నాటి స్వాతంత్ర్య వీరుల త్యాగాలకు కథా రూపమిచ్చిన ప్రేమ్ చంద్ 1909లో ‘నవాబ్ రాయ్’ అనే కలం పేరుతో ‘సోజ్-ఎ-వతన్’ (పుడమితల్లి శోకం) అనే కథల సంపుటాన్ని రాశాడు. దానిలో ప్రభుత్వ వ్యతిరేక రచనలున్నాయని జిల్లా కలెక్టర్ ప్రతుల్ని ప్రేమ చంద్ కళ్ళ ముందే తగలబెట్టించి హెచ్చరించాడు. ఈ సంఘటన తర్వాత ‘జమానా’ పత్రిక సంపాదకుడి సలహాతో తన పేరు ”ప్రేమచంద్’ గా మార్చుకున్నాడు. సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం చేకూర్చాలనే ఆశయంతో బంకించంద్ర ఛటర్జీ అనువాదాలను మధించి, టాగోర్ సాహిత్యాన్ని పుక్కిలించి, టాల్ స్టాయ్ రచనలను వంట బట్టించుకుని, డికెన్స్, అనతోవ్ ఫ్రాన్స్ లను అభిమానిస్తూ గోర్కిని ‘అమ్మ’ ద్వారా దర్శించి, గాంధీ, తిలక్, గోఖలేలను దాటి ‘మహాజనీ సభ్యత’ అనబడే వ్యాపార సంస్కృతికి పట్టువేరైన పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సోషలిస్ట్ వ్యవస్థను కార్మిక కర్షకుల సంస్కృతిని అభిమానించే దాకా పరిణామం చెందిన ప్రేమ్ చంద్ ను ‘హిందీ గోర్కి’ అని సంబోధించిన విమర్శకులూ వున్నారు. పాఠకుల అభిరుచులను, ఆలోచనలను సైతం సంస్కరిస్తూ రచనలు చేసిన ప్రేమచంద్ సాహిత్య జీవితం గడచిన శతాబ్దంతోటే మొదలైంది.
మొదటి నవల ‘ఆస్రా-కె-మాబిద్’లో గుడి గట్టులను రద్దు చేస్తూ, పండాల్ని ముసుగుల్లోంచి లాగి, సమాజం ముందు దోషులుగా నిలబెడతాడు. తన రెండో నవల ‘హమ్-దార్మా- హమ్ నవాబ్’తో ‘అమృత రాయ్’ అన్నే ఆదర్శవాది ‘ప్రేమ’ అనే సుందర ప్రేయసిని సైతం వదులుకుని ”పూర్ణ’ అనే వితంతువును పెళ్లి చేసుకుంటాడు. ఈ నవలను హిందీలోకి ‘ప్రేమ’ పేరుతో తనే అనువదించుకున్నాడు. (తెలుగులో ‘ప్రతిజ్ఞ’ ‘పేరుతో అనువాదమైంది). ఈ ఆదర్శాలతోనే 1905లో ఆయన ‘శివరాణి’ అనే బాలవితంతువును వివాహమాడాడు. 1917లో రాసిన ”సేవాసదన్’ నవల ‘ప్రేమ్ చంద్ సాహితీ జీవితంలో ఒక మలుపు వంటిది. సమాజంలో స్త్రీల వ్యక్తిగత స్వేచ్ఛకు గల అవరోధాలు, అందుకు పురుషాధిక్యత ఎంతవరకూ కారణమనే వివరణకు ‘సుమన్’, ‘గజాధరుడు’ వంటి పాత్రలకు, స్త్రీజనోద్ధరణకై అహర్నిశలు కృషి నిల్చే ‘పద్మసింహ’ వంటి వ్యక్తులకు, సమాజ స్వరూపానికి దర్పణం పట్టిన” నవల ఇది. 1918లో వేశ్యల దయనీయ గాథలను కథా వస్తువుగా తీసుకుని ‘ప్రేమాశ్రమ్’ నవల రాశాడు. 1919లో జరిగిన ‘జలియన్ వాలాబాగ్’ దురంతం కలచివేసింది. రౌరత్ చట్టం, మార్షల్ లాలను తీవ్రంగా ఖండించాడు. 1920లో మహాత్మాగాంధి ‘గోరఖ్ పురా’ వచ్చినప్పుడు ఆయన దర్శనం చేసుకుని 1921లో తన ‘డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్’ ఉద్యోగాన్ని వదిలి స్వాతంత్ర్య పోరాటంలోకి ప్రవేశించాడు.
ఏనాడైతే స్వాతంత్ర పోరాటంలోకి ప్రవేశించచాడో అప్పుడే ఆయన వ్యాసాంగం ఉదృతమైంది. ‘కాయకల్ప’ నవల రాసి గాంధీజీ ఆదర్శాలను ప్రచారం చేసి, పాలకుల దురాగతాలను ఖండించాడు. 1927-28లో రాసిన ‘రంగభూమి’లో సామాజిక, ఆర్థిక పరిస్థితులను, నాటి అస్పృశ్యత, బాల, వృద్ధ వివాహాలపై దండెత్తాడు. మత విద్వేషాలను చిత్రీకరిస్తూ “మతతత్వం మూలంగానే జాతీయ భావం భంగ పడుతున్నదని, దీన్ని పెకిలించి సమైక్యంగా ఉండకపోతే మన దేశం కల్లోలితమవు తుందని హెచ్చరించాడు. స్త్రీల మానసిక సంఘర్షణలను ‘నిర్మల’ నవల ద్వారా వివరించాడు. సమాజ కట్టుబాట్ల కబంధ హస్తాల్లో చిక్కిన అభాగినుల ఆవేదనలను ‘నిర్మల’ పాత్ర ద్వారా, ఇంకా దేశంలో వరకట్న సమస్య వస్తుందని ఈ నవల ద్వారా ముందుగానే మనల్ని హెచ్చరించాడు.
శ్రమైక జీవన సౌందర్యాన్ని దర్శించగలిగేదే ఉత్తమ సాహిత్యమని విశ్వసించిన ప్రేమ్ చంద్ తన ‘కర్మభూమి’ నవలలో పరాయి పాలనకు తోడైన పేదరికాన్ని వాస్తవికతతో చిత్రించాడు, నిరుపేదల దోచుకునే ధనస్వాముల్ని, ఫ్యాక్టరీలకు వలసవెళ్ళే వర్తకుల భాధలను వర్ణించాడు. మానవుడి సమైక్యతలో గొప్ప తిరుగులేని ఆయుధం ఉందని నమ్మాడు. ఇవే అంశాల్ని తన చివరి రెండో నవల ”గోదాన్’ (1932)లో రాస్తాడు.
ప్రేమ్ చంద్ ది రైతాంగ మనస్తత్వం. భూస్వాముల నియంతృత్వాన్ని నిరంతరం వ్యతిరేకించారు. దోపిడిచే రైతుల, నిరు పేదల జీవితాలు ఆధోగతి పాలవుతున్నాయని ఆందోళన పడ్డాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ప్రేమ్ చంద్ పలుమార్లు జైలుకు వెళ్ళాడు. నూలు నడికాడు. ఖద్దరును ధరించాడు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తన వివాసాన్ని పూర్తిగా ‘కాశి’కి మార్పాడు. 1930లో ‘హంస’ పత్రికను స్థాపించి సాహిత్య రంగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాత్విక, సామాజిక, రాజకీయ రంగాలపైకి తన దృష్టిని మరల్చాడు. 1935 చివరిలో లండన్ నుండి వచ్చిన ‘అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం’ ప్రణాళికకు “నవభారత సాహిత్యానికి ఆశాకిరణం, వైతాళిక గీతి’ అని తన ‘హంస’ పత్రిక ద్వారా స్వాగతం పలికాడు. ‘మర్యాద’, ‘మాధురి’ పత్రికలకు సంపాదకత్వం వహించిన ఆయన చాలామంది యువ రచయితలను ప్రోత్సహించాడు. 1935లో “మంగళ సూతం’ నవలను ప్రారంభించాడు. కాని అనారోగ్యం వల్ల నాలుగు అధ్యాయాలే రాయగలిగాడు. 1936లో ఏప్రిల్ 10, 11 తేదీల్లో లక్నోలో జరిగిన ‘అభ్యుదయ రచయితల సంఘం’ ప్రథమ మహాసభలకు అధ్యక్షత వహించి ప్రేమ్ చంద్ చేసిన ఆనాటి ఉత్తేజ పూరితమైన అధ్యక్షోపన్యాసం అభ్యుదయ సాహిత్యోద్యమానికి బీజావాపనగా పేర్కొదగింది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పపంచ శాంతి సదస్సు పారిస్ లో జరిగింది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదిస్తూ రవీంద్రనాధ్ టాగూర్, ప్రపుల్లచంద్ర రే, నందలాల్ బోస్ లతో బాటు అంతిమ ఘడియల్లో ఉన్న ప్రేమ్ చంద్ కూడా సంతకం చేశాడు. ప్రేమ్ చంద్ మంచి కథకుడు . ఆయన కథల్లో కథనం కన్నా కథకే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చాడు. ‘సప్తసరోజ్’, ‘మానస్ సరోవర్’, ‘నవనిధి’, ‘సప్తసుమన్’, ‘ప్రేమ్ ద్వాదశి’, ‘ప్రేమ పచీస్’, ‘నమక్-కా-దారోగా’ వంటి కథల్లో సామాజిక స్పృహ కనిపిస్తుంది. కర్బల్,సంగ్రామ్, ప్రేమ్ కా బేడీ వంటి నాటకాలు కూడా రాశాడు. ప్రేమ్ చంద్ తన సాహిత్య జీవితాన్ని ఉర్దూ భాషతో ప్రారంభించి, హిందీ భాషలో కొనసాగాడు. తన ఉర్దూరచనలను తానే హిందీలోకి అనువాదం చేసుకుని ఉర్దూ హిందీ భాషల సేతువుగా తన సాహిత్య జీవితాన్ని కొనసాగించాడు. ఆఖరుకు హిందీ నవలాకారుడుగానే సాహిత్య చరిత్రలో మిగిలిపోయాడు. టాకీ చిత్రాల తొలి దశకంలో సినిమా రంగంలో రచయితగా పనిచేయడానికి వెళ్లి అక్కడి కృతకమైన ధోరణులు నచ్చక తిరిగి సాహిత్య రంగంలోకి వచ్చాడాయన. పేమ్ చంద్ సాదాసీదా జీవితం గడిపాడు.
మధ్య తరగతి బ్రతుకును చవిచూశాడు. కష్టాలకోర్చి ఆత్మస్థైర్యంతో పైకి వచ్చినవాడు. అందుకే ఆయన బ్రిటిష్ పాలకులు ‘రాయ్ సాహెబ్’ బిరుదునిచ్చినా తిరస్కరించాడు. చివరి రోజులను కాశీలోనే గడుపుతూ 1936 అక్టోబర్ 8న తనువు చాలించాడు. సాహిత్యము,జీవితము రెండూ ఒకటిగానే బతికిన ప్రేమ్ చంద్ సామాజిక సమస్యలపై తన భావాలను నిర్ద్వందంగా ప్రకటించాడు. ఆర్థిక, రాజకీయ, సామాజిక దాస్యంలో మ్రగ్గుతున్న నాటి సమాజాన్ని చిత్రించి సమానత్వాన్ని తన రచనల ద్వారా ప్రచారం చేసిన ఒక అభ్యుదయ సాహితీ స్రష్ట. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భారతీయులకు హిందీ గోర్కి.
రచయిత గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత
హెచ్.రమేష్ బాబు
7780736386
హిందీ గోర్కి- ప్రేమ్ చంద్
- Advertisement -
- Advertisement -



