పదిహేను సంవత్సరాల క్రితం కోదాడ, లాల్, బంగ్లాలో జరిగిన సభలో ఒక ప్రజా వాగ్గేయకారుడిని చూశాను. శ్రీశ్రీ కవితలా, శివసాగర్ పాటలా ఉన్నాడు. శ్రీపాద శ్రీహరి ఆశయస్ఫూర్తిలా కనిపించాడు. అతని కంఠం విప్లవశంఖంలా మారుమ్రోగుతుంది. అతని పాటచైతన్య నదిలా సభాసదుల హృదయ క్షేత్రాలను సస్యశ్యామలం చేస్తుంది. సభానంతరం జరిగిన కవిసమ్మేళనంలో నేను ఒక కవిత చదివితే, అది విని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అప్పటివరకు ఎరుపెక్కిన ఆయుధంలా సమరోత్తేజాన్ని రగిలించిన ఆ గాయకుడు ఇప్పుడు మంచు గడ్డలానిలువెల్లా కరిగిపోతున్నాడేమిటి? అని ఆశ్చర్యపోయాను. నిరంకుశత్వాన్ని ధిక్కరించే ధీరోదాత్తగుణం, సాటిమనిషి దుఃఖానికి చలించే, ఆర్ద్రస్వభావం అతని హృదయంలో సంగమించాయనిపించింది. అందుకే అతను ప్రజా వాగ్గేయకారుడయ్యాడు. జై భీమ్ అంటూ అతడిని పలకరించాను. లాల్ సలాం అంటూ అతను బదులిచ్చాడు. ఆ ప్రజా వాగ్గేయకరుడే అరుణోదయ నాగన్న.
వర్గ సమాజ నిర్మూలన కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పాటే ప్రాణంగా ఐదు దశాబ్దాలు ఆవిశ్రాంతంగా ఉద్యమించిన సాంస్కృతికయోధుడు నాగన్న. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో పరకాల పాపయ్య, లచ్చుమమ్మ దంపతులకు నాగన్న జన్మించాడు. పేదరికం కారణంగా రెండో తరగతిలోనే చదువుకు సెలవు చెప్పిన నాగన్న భూస్వామి దగ్గర ’పాలబుగ్గల జీతగాడు’గా చేరాడు. ఆకలిని చేతబట్టుకొని, కల్లు గీత కార్మికుడయ్యాడు. వలస కూలిగా మారాడు. పనితో పాటు సహజంగానే నాగన్న గొంతులో పాటచిగురించింది. తల్లిదండ్రులు అలపించే భజన పాటలు, కోలాటం పాటలు వింటూ, స్వగ్రామంలో భిక్షాటన చేసే జానపదుల పాటల స్ఫూర్తితో గాయకుడిగా నాగన్న తొలి అడుగులు వేశాడు. కానూరి వెంకటేశ్వరరావు శిక్షణలో బుర్రకథ నేర్చుకొని, అరుణోదయ రామారావు సాంగత్యంలో గాన కళాసాధన చేసి, శ్రీపాద శ్రీహరి నేతృత్వంలో సామాజిక, రాజకీయ పాఠాలు అభ్యడేంచాడు. ఎమర్జెన్సీ చీకటి పాలనకు బలై పోయిన శ్రీహరి, రామనరసయ్య స్మృతిలో నాగన్న మనసు గాయపడింది. ఈ గాయాల్లో నుండి రాజ్య ధిక్కార నైజాన్ని అందిపుచ్చుకొని, అరుణారుణ గేయాలు ఆలపించాడు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల వెలుగుల్లో, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మార్గదర్శకత్వంలో శక్తివంతమైన కళాకారుడిగా నాగన్న రూపుదిద్దుకున్నాడు.
సారా వ్యతిరేక పోరాటం నుండి ప్రత్యేక తెలంగాణ వరకు సాగిన అనేక ప్రజా ఉద్యమాలకు తన పాటతో నాగన్న సరికొత్త కళాఉత్తేజాన్ని అందించాడు. సామ్రాజ్యవాదంపై గళమెత్తి గర్జించాడు. నాగన్నగానం, పాట ఆలపించే శైలి మిగతా కళాకారులకంటే విలక్షణంగా, విశిష్టంగా ఉంటుంది.”వీరగాథలు పాడరా!విప్లవ వీరచరితలు పాడరా!”అంటూ రసభరితమైన రాగపాశంతో ప్రజాసమూహాన్ని నాగన్న కట్టిపడేస్తాడు. పల్లవి ప్రారంభంలోనో, చరణం ముగింపులోనో ఆయన చేసే అద్భుతమైన రాగాలపనతో, మనోహరమైన గమకాలతో, ఆరోహణ, అవరోహణలతో కూడిన నాగన్న గాన విన్యాసం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. పద్యనాటకాల్లోని రాగాలాపన, జానపద బాణీ కలగలిసిన అపూర్వ గాన శైలి నాగన్న గాత్రంలో ధ్వనిస్తుంది. అందుకనే వందలాది సభావేదికలపైన, నిరసన ప్రదర్శనల్లో నాగన్న పాటల జల్లుల్లోప్రేక్షకులు పరవశించిపోతారు. ప్రజా పోరాటంలో అశువులుబాసిన అమరవీరులనుపేరు పేరున తలచుకుంటూ నాగన్న ఎన్నో పాటలు ఆలపించాడు. వారి అసమాన త్యాగాలను రాగరంజితంగా గానంచేశాడు.
రామనరసయ్య లాంటి పోరాటాయోధుల అమరత్వాన్ని వారి సమరతత్త్వాన్ని నాగన్న గానం చేస్తుంటే కన్నీళ్లు పెట్టని కార్యకర్త ఉండడు. పాటను, కేవలం ఒక ప్రక్రియలా కాకుండా, ప్రాణవాయువులా నాగన్న శ్వాసించాడు. మూడు తరాలక వులు రాసిన వందలాది పాటలను, పాటల్లోని భావధారను సజీవంగా తన స్వరంలో పలికించాడు. తన శిష్యులైన యశ్ పాల్, యోచన్ రాసిన ఎన్నో పాటలకు నాగన్న స్వర ఆయుషు పోసి వాటికి విస్తృతమైన ప్రాచుర్యం కల్పించాడు. నాగన్న వాగ్గేయకారుడే కాదు, నాయకుడు. నటుడు, బహుముఖీన ప్రతిభ కలిగిన గొప్ప కళాకారుడు. సామాజిక, సాంస్కృతిక కార్యకర్త. అన్నింటికీ మించి ఆయన ప్రజాకవి. నాగన్న పాటల గురించి చర్చ జరగలేదు. ఉద్యమ అవసరాల దృష్ట్యా ఆయన గాయకుడిగా దూసుకు పోతూనే ఎన్నో పాటలు రాసి స్వరపరిచి, తానే ఆలపించాడు. తనపాటల ద్వారా ప్రజా పోరాటాల ఆశయాలను చాటి చెప్పాడు. పాటలో అమ్మను దర్శించాడు. ”పాటమ్మా నీపాదాలకు వందనం/ జానపదుల నోట బుట్టి /జాతికి అంకితమయ్యి/ ప్రతి నిత్యం పల్లవించే తల్లివమ్మా” అంటూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు వివిధ ఉద్యమాల ప్రస్థానంలో పాట నిర్వహించిన పాత్రను, దాని పరిణామక్రమాన్ని నాగన్న ప్రతిభావంతంగా విశ్లేషించాడు.
మట్టికి మనిషికి మధ్య పెనవేసుకున్న మహోన్నత అనుబంధాన్ని ఈ పాటలో నాగన్నతేట తెల్లం చేశాడు. ‘పోరాట నాగారా’అని పాటను అభివర్ణించాడు. స్మృతిగీతాలను రాయడంలోను ,ఆలపించడంలో నాగన్నది ప్రత్యేక శైలి. ”చెట్లన్నీమౌనంగా సెల్యూట్ చేసి /తమ రంగు రంగులపూలన్నీ రాల్చివెళ్లాయా”/మీ రక్తం చుక్కల అడుగున/ మొక్కలు నాటాము విప్లవాల పంటలకై” [కాచనపల్లి అడవుల్లో] వంటి పాటల్లో నాగన్న అభివ్యక్తి ఉన్నతమైనది. ‘నీరు లేక ఏడుస్తున్న పంటభూమి’ వలపోతను ఆయన పాటలుగా మలిచాడు. సారా వ్యతిరేక ఉద్యమంలో నాగన్న క్రియాశీలకంగా పాల్గొని అనేక పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించాడు. ఆయన రాసిన ”సారా తాగేటి అన్నో” వంటి పాటల్లో మద్యపానం వల్ల కలిగే అనర్థాలను సరళసుందరంగా ప్రబోధించాడు. ‘అయ్యమ్మెఫ్’ అప్పురో దేశానికి ముప్పురో /దేశాలను బట్టి నమిలి పిప్పిజేశారా’ అంటూ ఆర్థిక తీవ్రవాదంతో షరతులు విధించి దేశాలపై పెత్తనం జేసే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ లోగుట్టును తన పాటతో నాగన్న బట్టబయలు చేశాడు.’దోపిడిపీడన లేని రాజ్యం రావాలని నాగన్న కలలుగన్నాడు. ప్రధానంగా విప్లవ దృక్పథంతో పాటు దళిత, స్త్రీవాదాల స్పృహ కూడా నాగన్న పాటల్లో కనిపిస్తుంది. ”కులరక్కసి కోరలు చాచింది/ నా దళిత బిడ్డల తలనరికి పాతర వేసింది” అంటూ మనువాదంపై దండెత్తాడు. దేవాలయాలు నిర్మించి, దేవుడికి పల్లకీ తయారు చేసీన కష్టజీవులు అంటరాని వారెందుకయ్యారని పాటలో ప్రశ్నించాడు.
అంటరాని తనం నేరమని” సర్కారు చేసిన చట్టాలు మూలన బడి మూలుగుతున్నవి’ అని తనపాటలో నాగన్న ఎద్దేవా చేశాడు. శాసనాల్లోని సమానత్వం ప్రజల జీవితాల్లో ప్రతిఫలించాలని అభిలషించాడు. శ్రామిక మహిళలల సమస్యల్ని స్పృసిస్తూ నాగన్న సందేశాత్మకమైన పాటలు రాశాడు. ఏమి బతుకు ఏమి బతుకమ్మ ఆడోల్ల బతుకులు/ గడియ గడియ గండమోయమ్మా” అంటూ ప్రతినిత్యం స్త్రీలు ఎదుర్కొంటున్న దుర్భరమైన వేదనని సముచితంగా పాటలో ఆవిష్కరించాడు. ”ఎన్నడు గొట్టని నా ఈ మొగుడు- నేనేమిజేతు/ ఏటి గర్రతోని గొట్టెనమ్మో -నేనేమి జేతు/ దెబ్బతిన్ననా ఒళ్ళమ్మో- నేనేమి జేతు/ సద్దబూరె వోలె పొంగెనారమ్మో – నేనేమి జేతు” లాంటి పాటల్లో, మద్యానికి బానిసలై భార్యల్ని హింసించే భర్తల ఆగడాలను కళ్ళకు కట్టినట్లు నాగన్న వర్ణించాడు. మహిళలకు ప్రతిఘటనాత్మక చైతన్యాన్ని నూరిపోస్తూ నాగన్న రాసిన ‘కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ” అనే పాట అత్యంత ప్రజాదరణ పొందింది. ”బావో నేను బడికి పోతా’ అనే పాటలో అక్షరాస్యతా ఉద్యమ లక్ష్యాలను గానం చేశాడు. నాగన్న రాసిన చాలా పాటలు సంవాదాత్మకంగా, నాటకీయపద్ధతిలో సాగుతాయి ఏ ప్రలోభాలకు, రాజకీయ ఎరలకు లొంగని సమున్నత వ్యక్తిత్వంతో నాగన్న ప్రజల మన్ననలందుకున్నాడు. న్యూడెమాక్రసీ పార్టీ జెండా గుండెలకు హత్తుకొని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆశయాలను గొంతులో దాచుకొని పీడిత ప్రజల విముక్తి ధ్యేయంగా పోరాటాల బాటలో వడివడిగా ముందుకు సాగిపోయాడు.
దుర్భర దారిద్ర్యం వెంటాడి వేధించినా, లాఠీ దెబ్బలు తనువుపై విరిగినా, జైలు నిర్బంధం సహనానికి పరీక్ష పెట్టినా నాగన్న ఎవరికీ తల వంచలేదు. ఎత్తిన జెండా దించలేదు. వ్యక్తిగత ప్రయోజనం కంటే ఉద్యమ ప్రయోజనమే ముఖ్యమని ఆయన విశ్వసించాడు. కీర్తిప్రతిష్టల కోసం నాగన్న ఏనాడూ తాపత్రయ పడలేదు. రెండేళ్ల క్రితం సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం మాత్రం ఆయన మహదానందంతో స్వీకరించాడు. తాను ఆలపించే పాటల్లోని ఆదర్శాలను బతుకులోకి బట్వాడ చేసుకొని, నిరాడంబరంగా జీవించాడు. మాసిపోయిన బ్యానర్ లను, పాత ప్లెక్సీలను గోడలుగా మలచుకొని, ఆ గుడిసెలోనే నాగన్న చాలాకాలం నివసించాడు. నాగన్న నిజాయితీకి, నిబద్దతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ? కంటికి రెప్పలాగా , పాటకు పల్లవిలాగా నాగన్న జీవితానికి లక్ష్మక్క. వీరు భార్యాభర్తలుగా కంటే కళా కార్య కర్తలుగానే సదా మెలిగారు. నాగన్న పాట పాడితే ఆమె కోరస్ అయింది. బుర్రకథ చెబితే ఆమె వంత పాడింది. నాగన్న కుమారుడు అజయ్ కూడా ‘పితృగాన పరిపాలకుడై’ ప్రజా కళాకారుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాడు. అంతనమైన కళా, సాంస్కృతిక సంపదల్ని జాతికి అందించి సెలవంటూ నాగన్న వెళ్ళిపోయాడు. ఎంతోమంది కవులు, కార్యకర్తలు, నాయకులు ప్రజాస్వామ్య వాదులు నాగన్న స్మృతిలో పాటలు, కవితలు, వ్యాసాలు రాశారు. వాటిని విప్లవ సాంస్కృతిక సేనాని నాగన్న’,‘ అరుణోదయ నాగన్న స్మృతిపథంలో’ సంకలనాలుగా నాగన్న జీవిత, కళా ప్రస్థానాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నాగన్న పాటలను విని మైమరచిపోవడమే కాకుండా, ఆ పాటల్లోని ఆశయసాధన కోసమే పాటుపడాలి. ఆ గాన ఋషికి ఇదే నిజమైన నివాళి.
కె. కోటేశ్వరరావు, 9440480274



