Monday, May 4, 2026
E-PAPER
HomeNewsరూపాయి పాపాయి

రూపాయి పాపాయి

- Advertisement -

డాలరు చుట్టూ రూపాయి
ప్రదక్షణలు చేస్తోంది
తను చూడని అగాథాలను చూడాలని
పురాణ కథల పాతాళలోకాన్ని
తొవ్వుకుంటూ పోతోంది
కట్టప్ప మందహాసాల నడుమ
ఎంతకీ తొక్కడం ఆగడం లేదు
రూపాయి నెత్తి మీది డాలరు కాళ్ళు
మేకిన్‌ ఇండియా మేకపోతు గాంభీర్యం
తోలు ఒలిచి
దిగుమతుల సునామీ
వంటగది పొయ్యి మీద కుతకుతలాడ్తోంది
రూపాయి ముఖం మీద
తెల్లగుడ్డ కప్పిన
ఐఎస్‌ ఐ ముద్రలేని పాలనలో
తక్కువ వడ్డీ రేట్లకే
దేశ కార్పోరేట్‌ రంగం విదేశీ కండలు పెంచుకుంటుంటే
స్విస్‌ బ్యాంకు కులుకుల నల్లనమ్మ
భారత పాలకముఖానికి నల్లగుడ్డ కప్పింది
ఉత్పాదక పెట్టుబడి భార్య నొదిలేసి
రాజ్యం డాలరు భక్తి
ఎర్ర తివాచీ పరిచిన
స్టాక్‌ మార్కెట్‌ వ్యభిచారి ముద్దుల్లో తేల్తున్న
విదేశీ పెట్టుబడులు
ఏరోజు కారోజు చెమట నమ్ముకునే
నడుం మీద
అదానీ అంబాని ఆస్తుల్లా పెరిగీ పెరిగీ
ధరలు భూమి కన్నా బరువెక్కాయి
-వడ్డెబోయిన శ్రీనివాస్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -