Friday, September 18, 2026
E-PAPER
HomeNewsమమతా బెనర్జీ పోరాటానికి రాహుల్ గాంధీ మద్దతు

మమతా బెనర్జీ పోరాటానికి రాహుల్ గాంధీ మద్దతు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ‘బీజేపీ ఓట్ల దొంగతనం.. ప్రభుత్వ దొంగతనం.. ఇప్పుడు పార్టీ దొంగతనానికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పేరు, ఎన్నికల గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం ఆయన పై విధంగా స్పందించారు. ఇది కేవలం మమతా బెనర్జీ పోరాటం కాదని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను కోరుకునే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఓటరు పోరాటమని ఆయన పేర్కొన్నారు. మమతా బెనర్జీ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఒక పార్టీనే పూర్తిగా అపహరించగలిగినప్పుడు, లక్షలాది మంది భారతీయుల ఓట్లను అపహరించడం పెద్ద ఆశ్చర్యకరం కాదని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఓట్ల దొంగతనం, ప్రభుత్వ దొంగతనం, ఇప్పుడు పార్టీ దొంగతనం.. ఇవి ప్రజాస్వామ్య పతనానికి చిహ్నాలుగా మారాయని అన్నారు. ప్రజా తీర్పును కాపాడటం ఎన్నికల సంఘం (ఈసీ) రాజ్యాంగ బాధ్యత అని, అయితే ప్రజా తీర్పును తారుమారు చేసే శక్తులకు అది సహకరిస్తోందని ద్వజమెత్తారు. శివసేన, ఎన్‌సిపి, ఇప్పుడు టిఎంసి విషయంలోనూ ఇదే విధానం కనిపిస్తోందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ప్రతిసారీ ఒకే పద్ధతి.. బిజెపి, ఈసి కలిసి ఒక పార్టీని చీల్చుతాయని, ఆ తర్వాత దాని ఎన్నికల గుర్తును లాగేసుకుంటారని మండిపడ్డారు. ఈ పరిణామం కేవలం మమతా బెనర్జీకి సంబంధించినది కాదని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును కాపాడే అంశమని ఆయన అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌, రేజీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్‌ 6న ఉపఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గంతో పాటు రిటబత్ర నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం కూడా ‘టిఎంసి’ పేరును, పార్టీ గుర్తును వినియోగించరాదని గురువారం ఈసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వర్గాలూ ప్రత్యామ్నాయ పార్టీ పేర్లు, ఉచిత గుర్తుల కోసం మూడు చొప్పున ఎంపికలను సమర్పించాలని సూచించింది. ఈ మధ్యంతర ఉత్తర్వు తుది నిర్ణయం వెలువడే వరకు అమల్లో ఉంటుందని ఆదేశించింది.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా ఈసి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈసి నిర్ణయం పాలక బిజెపికి అనుకూలంగా ఉందని అన్నారు. మమతా బెనర్జీ వర్గానికి పార్టీ పేరు, గుర్తును పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -