Friday, September 18, 2026
E-PAPER
Homeజిల్లాలురైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ

రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ-సంగారెడ్డి 
రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జి.సాయిలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరారు.

రైస్ మిల్లర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని, రైస్ మిల్ పరిశ్రమపై ఆధారపడ్డ అన్నిరకాల కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 5-6 సంవత్సరాలుగా ఎఫ్సిఐ, సిఎస్సి స్పెసిఫికేషన్లకు అనుగుణంగా సూపర్పైన్ క్వాలిటీ బియ్యం అందించే విధానం వల్ల మిల్లింగ్ సమయంలో షార్టేజ్, సార్టెక్స్, గ్రేడింగ్ తదితర కారణాలతో మిల్లర్లకు భారీగా నష్టాలు వస్తున్నాయని, క్వింట ధాన్యానికి 15-20 శాతం వరకు లోటును మిల్లర్లే భరించాల్సి వస్తోందన్నారు. మరోవైపు సిఎంఆర్ బియ్యం సకాలంలో తీసుకోకపోవడంతో మిల్లులు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్నాయని తెలిపారు.

ప్రభుత్వం ధాన్యం కేటాయింపులు, మిల్లింగ్ సామర్థ్యం, నిల్వ సామర్థ్యం, సిఎంఆర్ బాధ్యతలు, బియ్యం స్వీకరణ గడువుల మధ్య సమన్వయం తీసుకురావాలని, ప్రతి క్రాప్ కు సిఎంఆర్ బియ్యం స్వీకరణకు స్పష్టమైన గడువు, ప్రణాళిక ప్రకటించి, ఒక క్రాప్ పూర్తయ్యే విధంగా తగిన సమయం ఇచ్చిన తర్వాతే తదుపరి ధాన్యం కేటాయింపులు చేయాలన్నారు. నిర్ణయించిన గడువులో బియ్యాన్ని క్రమం తప్పకుండా స్వీకరిస్తూ 100 శాతం సిఎంఆర్ బియ్యం అందించేందుకు సిద్ధంగా ఉన్న మిల్లర్లపై అనవసర ఒత్తిడి, కఠిన చర్యలు, కేసులు పెట్టకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు. ధాన్యం, సిఎంఆర్ లెక్కలు పారదర్శకంగా ఉండేలా చూడాలనీ, మిల్లింగ్ ఛార్జీని ప్రస్తుతం ఉన్న చార్జిపై రూ.150కు పెంచడంతో పాటు మిల్లర్లపై ఉన్న 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ భారాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

రైస్ మిల్లులు మూతపడటం వల్ల మిల్లర్లతో పాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోతారని, రైస్ మిల్లు డ్రైవర్లు, దినసరి కూలీలు, గుమస్తాలు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, ఇతర రైస్ మిల్లు ఆధారిత కార్మికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు కూడా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విజిలెన్స్, పోలీస్ తనిఖీల పేరుతో మిల్లర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించి, సమస్యలను వేధింపులతో కాకుండా చర్చలు, సమన్వయంతో పరిష్కరించాలని పిలుపునిచ్చారు. లేనియెడల మిల్లర్లు చేపట్టే తదుపరి ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలకు సీఐటీయూ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి. విద్యాసాగర్ నాయకులు షబ్బీర్, రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -