Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవినీతిని ప్రశ్నిస్తే బెదిరింపులా?

అవినీతిని ప్రశ్నిస్తే బెదిరింపులా?

- Advertisement -

– సర్పంచ్, ఉపసర్పంచ్‌పై 9వ వార్డు సభ్యురాలు ప్రత్యూష రాములు ఆరోపణలు
నవతెలంగాణ – కామారెడ్డి

తమ సహాయం కోరిన వారే ప్రస్తుతం తమపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఫిర్యాదులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫరీద్‌పేట్ గ్రామ 9వ వార్డు సభ్యురాలు దేవోల్ల ప్రత్యూష రాములు ఆరోపించారు. శుక్రవారం పరిధి పేట గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ కోల బాలగౌడ్ తీరుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్సీ మహిళా రిజర్వేషన్‌లో 9వ వార్డు సభ్యురాలిగా ఎన్నికైనప్పటి నుంచి తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రత్యూష తెలిపారు. తనను అసభ్య పదజాలంతో దూషించడం, బెదిరించడం, ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వాపోయారు.

గతంలో సంబంధిత వ్యక్తిపై కేసులు, బైండోవర్ చర్యలు జరిగినప్పటికీ ప్రవర్తనలో మార్పు కనిపించలేదని పేర్కొన్నారు. సర్పంచ్‌కు సంబంధించిన అవినీతి వ్యవహారాన్ని తన భర్త రాములు బయటపెట్టారని, అనంతరం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించినట్లు ప్రత్యూష తెలిపారు. ఈ పరిణామాల తరువాత తమపై కక్ష‍్య పెంచుకుని సీఎం సచివాలయం, జిల్లా కలెక్టర్ ప్రజావాణి, ఎస్సీ కమిషన్ తదితర వేదికల్లో ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో విచారణ సందర్భంగా కొందరు తప్పును అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తుల ద్వారా రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ తమ భర్త రాజీకి అంగీకరించలేదని తెలిపారు. అనంతరం తమపై గ్రామంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బెదిరింపులు ఆపాలి
తాను మహిళా ప్రజాప్రతినిధి అయినప్పటికీ గౌరవం లేకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రత్యూష ఆరోపించారు. ప్రాణహాని కలిగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇకపై తమ కుటుంబ సభ్యుల జోలికి రాకుండా గ్రామపంచాయతీ కార్యాలయంలో బాండ్ పేపర్‌పై రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పంచాయతీ కార్యదర్శిపైనా ఫిర్యాదు
గ్రామపంచాయతీ కార్యదర్శి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్పంచ్, ఉపసర్పంచ్ సూచనల మేరకు వ్యవహరిస్తున్నారని ప్రత్యూష ఆరోపించారు. పంచాయతీ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమపై తప్పుడు ప్రచారం, బెదిరింపులు, వేధింపులు కొనసాగితే చట్టపరమైన చర్యలు కోరుతామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన విషయాలను క్షమించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇకపై ప్రశాంతంగా ఉండేందుకు సహకరిస్తే వివాదాన్ని ఇంతటితో ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని దేవోల్ల ప్రత్యూష రాములు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -