శాసనసభలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
నవతెలంగాణ-ఆలేరుటౌను
ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. శాసనసభలో శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో మాట్లాడారు. ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు యువతకు కల్పించబడతాయని, ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని చెప్పారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఆలేరు నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీలకు తగిన స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
మున్సిపాలిటీలకు ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ ప్రజలకు మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సేవలను అందిస్తున్నామని తెలిపారు. యాదగిరిగుట్టకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన అనేక సేవలను మున్సిపాలిటీ అందిస్తోందని తెలిపారు. గతంలో యాదగిరిగుట్ట గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఆలయ ఆదాయంలో 30 శాతం వరకు గ్రామ పంచాయతీకి కేటాయించేవారని, ప్రస్తుతం మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆ విధమైన ఆదాయ వాటా అందడం లేదని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి స్వంత ఆదాయం పరిమితంగా ఉన్నందున ఆలయ ఆదాయం నుంచి నిధులు కేటాయించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధి కోసం భూసేకరణలో భాగంగా ఇళ్లు, షాపులు, భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సైదాపూర్‌లోని 329.314 సర్వే నంబర్ పరిధిలో ఉన్న అర్హులైన వారికి పట్టాలు అందించాలని కోరారు. గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆలేరు నియోజకవర్గం కేంద్రమైనప్పటికీ పేరుకే మున్సిపాలిటీగా ఉందని, గత పాలకుల హయాంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని పేర్కొన్నారు. ఆలేరు మున్సిపల్ నిధులు కేటాయించి, సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలో మౌలిక వసతులు, అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుచుట, రహదారులు, సాగు త్రాగునీరు ఇతర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సభ ముందు విజ్ఞప్తి చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలేరు నియోజకవర్గం ముందంజలో ఉందని, లబ్ధిదారులు సొంత ఇళ్లు నిర్మించుకొని సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించి, ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ బీర్ల అయిలయ్య కోరారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య ప్రస్తావనకు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఉథం ఇచ్చారు. యాదగిరిగుట్ట దేవాలయానికి రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారని అందుకే మున్సిపాలిటీలకి నిధులు కేటాయించాలని కోరుతూ 200 షాపులకు ఇబ్బంది కరంగా ఉన్న బ్రిడ్జిని తొలగించాలని కోరారు. అదేవిధంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ గా మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి తెలిపారు.



