Wednesday, August 26, 2026
E-PAPER
HomeNewsఉద్యోగుల హక్కుల సాధనకు రేపు మహాధర్నా

ఉద్యోగుల హక్కుల సాధనకు రేపు మహాధర్నా

- Advertisement -

వేలాదిగా తరలిరావాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మేరుగు ప్రసన్న పిలుపు
నవతెలంగాణ – పరకాల 

తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 27న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు వేలాదిగా తరలిరావాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి మేరుగు ప్రసన్న పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు చూపిన ఐక్యత, త్యాగం, తెగువ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ప్రసన్న పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగుల న్యాయమైన హక్కులు, సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు.

పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు.ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో వేతన సవరణ సంఘాన్ని వెంటనే అమలు చేయడం, పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడం, పెండింగ్‌ బిల్లులు, పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే చెల్లించడం ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జీవో 317తో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని, ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే మొదటి దశలో పాఠశాల స్థాయిలో నిరసనలు, రెండో దశలో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేసినట్లు ప్రసన్న తెలిపారు. మూడో దశలో భాగంగా తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌ తరలివెళ్లే కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. రేపటి జిల్లా మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు అజ్మీరా రాజారాం, బిక్షపతి, రజియా సుల్తానా తదితరులు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -