Sunday, August 9, 2026
E-PAPER
Homeదర్వాజవాళ్ళు వస్తారు…. మళ్ళీ మళ్ళీ వస్తారు

వాళ్ళు వస్తారు…. మళ్ళీ మళ్ళీ వస్తారు

- Advertisement -

హమ్ దేఖ్ లేంగే
యే భగత్ సింగ్ కా దేశ్ హై
హమ్ దేఖ్ లేంగే…( షేర్ సింగ్)
వాళ్లు
ఎవరి ఇంటని ముట్టడి చేయడానికి రాలేదు…
ఏ కట్టడాన్ని కూల్చడానికి రాలేదు
కనీసం
పార్లమెంటులో పొగబాంబులేయడానికైనా రాలేదు
వాళ్ళ చేతుల్లో కర్రలు లేవు… పుస్తకాలున్నాయి.
పెదవులపై ద్వేషం లేదు… ప్రశ్నలున్నాయి.
మాటల్లో అధికార దాహం లేదు… భవిష్యత్తుపై ఆందోళన ఉంది
కళ్ళల్లో క్రౌర్యం లేదు…కోటి వసంతాల వెలుగుంది.
పసిప్రాయపు అమాయకత్వముంది
కౌమారపు పరిహాసముంది
వాళ్ళు
ఈ దేశపు మనస్సాక్షిని తట్టి లేపడానికి వచ్చారు
దశాబ్దకాలంగా గడ్డకట్టిన నిశ్శబ్దాన్ని
బద్దలు కొట్టడానికి వచ్చారు.
కాళ్ళు విరిగిన వ్యవస్థకు కట్లు కట్టడానికి వచ్చారు
నిరాశనిండిన నడిసంద్రంలోని నావకు తెరచాపలై వచ్చారు
చిక్కటి చీకటి చుట్టుముట్టిన అడవిలో వెన్నెలై వచ్చారు
మరణశయ్యమీది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువై వచ్చారు
నాలుగు బాటల కూడలిలో చేవచచ్చి చతికిలబడ్డ
మన బాధ్యతల బరువు భుజాలకెత్తుకొని వచ్చారు.
వాళ్ళేమడుగుతున్నారు?
ఆజాదీ….
అవును‌… ఆజాదీ
పేదరికం నుంచి ఆజాదీ, నిరుద్యోగం నుంచి ఆజాదీ
పీడన నుంచి ఆజాదీ, ఆధిపత్యాలనుంచి ఆజాదీ
మతవాదం నుంచి ఆజాదీ, మనువాదం నుంచి ఆజాదీ
వివక్ష నుంచి, విభజనలనుంచి ఆజాదీ..
ఆజాదీ…
పుష్కరకాలంగా పొగచూరి మసిపట్టి తెగబలిసిన
బాధ్యతారాహిత్యం
మదమెక్కి పంజా విప్పిన నియంతల అహంకారం
వారిని స్వాగతించింది ఇనుప బారికేడ్లతో
వారిని పలకరించింది లాఠీల భాషతో
వారి కలలను ఛిద్రం చేసింది టియర్ గ్యాస్ తో..
పాలకులారా! ప్రశ్నలంటే మీకు ఎందుకంత భయం?
ప్రజలంటే ఎందుకంత తృణీకారం?
ఒక విద్యార్థి ప్రశ్నలో వేల తరాల భవిష్యత్తు
దాగి ఉంటుంది కదా
ఒక యువకుడి ఆవేదనలో దేశం
తన ప్రతిబింబాన్ని చూసుకుంటోంది కదా
ప్రశ్న పత్రాలు లీక్ చేయించుకొని
ఉద్యోగాలు పొందిన మీరు
మతాల మధ్య మంటలు పెట్టి పదవులు పొందిన మీరు
దొంగనోట్ల , దొంగ ఓట్ల ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న మీరు
పార్లమెంటును పశువుల సంతగా మార్చిన మీరు
పెట్టుబడికి పుట్టిన వికృత రాకాసి శిశువుల కొమ్ముకాసే మీరు
ఫోర్ పిల్లర్ డెమోక్రసీని ఒంటి స్తంభపు
వంచన సౌధంగా మార్చిన మీరు
దిక్కు చూపిన చూపుడు వేలును కత్తిరించి వెక్కిరించిన మీరు
పుస్తకాల కన్నా లాఠీలను నమ్ముకున్నరు
సంభాషణ కన్నా దమనాన్నే ఎంచుకున్నరు
కానీ…
ప్రతి లాఠీ దెబ్బ ఒక కొత్త ప్రశ్నను పుట్టిస్తుంది.
ప్రతి గాయం వేలాది గొంతులను మేల్కొలుపుతుంది.
ప్రతి బారికేడ్ ఒక ఉద్యమానికి మొదటి మెట్టవుతుంది.
గుర్తుంచుకోండి…
పార్లమెంటు కేవలం ఒక భవనం కాదు
ప్రజల ఆశలు, యువత కలలు
రాజ్యాంగపు హక్కులు కలిసే ఒక వేదిక
లీకయ్యింది ప్రశ్నా పత్రం మాత్రమే కాదు
ఒక నమ్మకం
కూలిపోతున్నది విద్యా వ్యవస్థ మాత్రమే కాదు
ఒక దేశ భవిష్యత్తు
వాళ్ళు
వస్తారు.. మళ్ళీ మళ్ళీ వస్తారు
కొత్త ప్రశ్నల బాణాలతో వస్తారు
సరికొత్త ఆలోచనల వసంతమై వస్తారు
చేతుల్లో అగ్నివీణను మీటుతూ వస్తారు
స్వరాల్లో వైప్లవ్య గీతాలాలపిస్తూ వస్తారు.
తూరుపు వాకిళ్ళ ద్వారాలు తెరుస్తూ వస్తారు
వినూత్న చరిత్ర సృష్టికర్తలై వస్తారు
వాళ్ళు వస్తారు… మళ్ళీ మళ్ళీ వస్తారు
డా. కాసుల లింగారెడ్డి
(షేర్ సింగ్.. జంతర్ మంతర్ లో విద్యార్థుల మీద లాఠీఛార్జీ చేయడానికి నిరాకరించి తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఒక కానిస్టేబుల్)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -