– బారదాన,లారీల కొరత వెంటనే పరిష్కరించాలి
సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-ఆలేరు రూరల్
వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, బారదాన, లారీల కొరత వెంటనే పరిష్కరించాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం రోజున ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ను సీపీఐ (ఎం) ఆలేరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు మార్కెట్లో గత 15 రోజులకు పైగా వడ్లు పోసినప్పటికీ ఇప్పటివరకు కాంట కాలేదని, నిన్నటి వరకు భారదాన కొరత వల్ల రైతులు ఎదురుచూశారని ఇప్పుడు లారీల సమస్య వల్ల అంతంత మాత్రమే వడ్లు కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు.
మార్కెట్లో వచ్చిన వడ్లు తూకం అయి మిల్లుకు పోకుండా మార్కెట్లోనే ఉండడం వలన అనేక మంది రైతులు రోజు వచ్చి స్థలం లేకపోవడం వలన తమ కల్లాలలోనే వడ్లు పోసుకొని ఎదురుచూస్తున్నారని, మార్కెట్లో స్థలం లేకుండా పోవడం వలన ఇక్కడికి తీసుకురాగా కల్లాలలోనే వడ్లు పోసి ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా వర్షం పడి రైతులు ఆరుగాలం కష్టపడ్డ శ్రమ వరద నీటి పాలు అవుతుందని దిన దిన గండంగా కాలం గడుపుతున్నారని అన్నారు. మార్కెట్లో రైతులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆలేరు మార్కెట్ యార్డులో వచ్చే ధాన్యం కి సరిపోను సీసీ లేకపోవడం వలన మార్కెట్ అంతా గుంతలు గుంతలు ఉందని, ఈ పరిస్థితుల్లో గడ్డి వర్షం వస్తే మార్కెట్ కు వచ్చిన వరి ఇక్కడే మొల్కెత్తే పరిస్థితి ఉందని వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి ఆలేరు మార్కెట్ యార్డ్ కు సరిపోను సీసీ ని ఏర్పాటు చేసి రైతుల శ్రమను ధాన్యాన్ని కాపాడాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం.ఏ. ఇక్బాల్, సీఐటీయూ నాయకులు మొరిగాడి రమేష్,రైతు సంఘం నాయకులు ఘణగాని మల్లేష్,మొరిగాడి అశోక్,రైతులు ఇక్కిరి కొమరయ్య,పూల మహేందర్,బి. పాపిరెడ్డి, లక్కాకుల రమేష్,గాదరి రాములు తదితరులు పాల్గొన్నారు.



