నవతెలంగాణ – ఆలేరు టౌను: చేనేత రంగానికి విశిష్ట సేవలు అందించిన పద్మశ్రీ చింతకింది మల్లేశంకు హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీ మూడవ కన్వొకేషన్ కార్యక్రమంలో శనివారం గౌరవ డాక్టరేట్ (హానరరీ డాక్టరేట్) ప్రదానం చేశారు. చేనేత కళాకారుల శ్రమను తగ్గించే లక్ష్యంతో చింతకింది మల్లేశం రూపొందించిన “ఆసు యంత్రం” వేలాది మంది చేనేత మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. వారి శ్రమను గణనీయంగా తగ్గించడంతో పాటు చేనేత రంగానికి విశేష సేవలు అందించినందుకు గుర్తింపుగా అనురాగ్ యూనివర్సిటీ ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించిన పద్మశ్రీ చింతకింది మల్లేశం మాట్లాడుతూ, 2019లో గీతం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నానని, 2026లో అనురాగ్ యూనివర్సిటీ నుంచి మరోసారి ఈ గౌరవం పొందడం తనకు ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందించిన అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం చేనేత రంగానికి మరింత సేవ చేయడానికి తనకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. మూడవ కన్వొకేషన్ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రముఖులు, అధ్యాపకులు, విద్యార్థులు, ఆహ్వానితులు పాల్గొని పద్మశ్రీ చింతకింది మల్లేశంను ఘనంగా అభినందించారు.



