Tuesday, May 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్యుత్‌ కొనుగోళ్లపై సీబీఐ విచారణ

విద్యుత్‌ కొనుగోళ్లపై సీబీఐ విచారణ

- Advertisement -

భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టులపై కూడా..భూముల ధరల సవరణకు ఆమోదం
ప్రతి గింజా కొంటాం..రైతులు ఆందోళన పడొద్దు
ఎన్‌డీడీబీతో మదర్‌డెయిరీ ఎంఓయూ..19 సబ్‌స్టేషన్ల వద్ద సోలార్‌ప్లాంట్లు
ప్రభుత్వ సంస్థల పన్నులు, జలమండలి నిధుల క్లియరెన్స్‌ కోసం ఓటీఎస్‌
సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు : వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యుత్‌ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ కు సంబంధించిన కమిషన్‌ నివేదికను సీబీఐకు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేసులో ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుండటం తో నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు వివరించింది. జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ నేతృత్వంలోని కమిషన్‌ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందనీ, 2025 జనవరి 4న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించిందని తెలిపింది. ఆ తర్వాతనే సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు విషయాలపై చర్చించింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రు లు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో కలిసి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.

రాష్ట్రంలోని భూముల ధరలను సవరించాలనీ, వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చు తగ్గులున్న భూములను క్రమబద్ధీకరించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ అవసరాల కోసం తీసుకునే భూములకు చెల్లించే పరిహారం విషయంలో ప్రభుత్వం ఇచ్చే రేటుకు, మార్కెట్‌ రేటుకు భారీ వ్యత్యాసం ఉండటంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. మార్కెట్‌ విలువలు రేషనలైజేషన్‌ చేయడానికి రిజిస్ట్రేషన్‌ శాఖకు అనుమతులు ఇచ్చామన్నారు. ఈ నెల 26 కల్లా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరలను సవరిస్తామని తెలిపారు. హిల్ట్‌ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామనీ, భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవాలనీ, దానికి ఇన్‌చార్జీ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని(మదర్‌ డెయిరీ) నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందనీ, పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్‌ నిర్వహణ, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ ఎన్‌డీడీబీ చూసుకుంటుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని 19 సబ్‌స్టేషన్ల పక్కనున్న ప్రభుత్వ భూముల్లో 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

క్యూర్‌ పరిధిలోని గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్లలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల పన్నులను క్లియర్‌ చేసేందుకు వన్‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌కు వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఆ పన్నుల జరిమానాలు, వడ్డీలు మినహాయించి రూ.1,686 కోట్లు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని చెప్పారు. హైదరాబాద్‌ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్‌ ఫ్లడ్‌ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు), పాలిటెక్నిక్‌లు, టీ శాట్‌లను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌లో ఆధునిక కూరగాయల మార్కెట్‌ కోసం 42 ఎకరాల భూమిని మార్కెటింగ్‌ శాఖకు అప్పగించనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -