తమిళనాడులో విజయ్ సంచలనం బెంగాల్‌లో కమలం పాగా
కేరళంలో యూడీఎఫ్..అసోం, పుదుచ్చేరిలో మరోసారి బీజేపీకే అధికారం..
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు విభిన్నమైన తీర్పునిచ్చారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో అధికార మార్పిడిని కోరుకున్న ప్రజలు అసోం, పుదుచ్చేరిలో మాత్రం అధికార పార్టీనే మరోసారి గెలిపించారు. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ విజయబావుటా ఎగరేసి అందరినీ ఆశ్చర్యపరచగా బెంగాల్‌లో పదిహేన్నేండ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెర పడింది. కేరళంలో యూడీఎఫ్ అధికారా న్ని హస్తగతం చేసుకుంది. తమిళనాడు శాసనసభలో మొత్తం 234 స్థానాలు ఉండగా టీవీకే 107 చోట్ల విజయం సాధించింది. అధికార డీఎంకే 74 స్థానాల కే పరిమితమైంది. అన్నా డీఎంకే- బీజేపీ కూటమి 52 స్థానాలతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే)కు నలుగు, కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు దక్కా యి. సీపీఐ(ఎం), ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయూఎంఎల్), సీపీఐ, విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) రెండేసి స్థానాలు గెలుచుకున్నాయి. పశ్చిమ బెంగాల్ శాసనసభలో 294 స్థానాలు ఉండగా బీజేపీ 206 స్థానాలను గెలుచుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 81 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్, అమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ)కి రెండేసి స్థానాలు వచ్చాయి. సీపీఐ (ఎం), ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ (ఏఐఎస్‌ఎఫ్) ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. కేరళంలో మొత్తం 140 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 63, సీపీఐ (ఎం) 26, ఐయూఎంఎల్ 22, సీపీఐ 8, కేఈసీ 7, ఆర్‌ఎస్‌పీ 3, బీజేపీ 3 స్థానాలు గెలుచుకు న్నాయి. ఇతరులు, స్వతంత్రులు 8 స్థానాల్లో విజయం సాధించారు. అసోంలో బీజేపీ 82 స్థానాలు గెలుచుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 19 స్థానాలు సాధించింది. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీఓపీఎఫ్), అసోం గణపరిషత్ చెరో పది స్థానాలు దక్కించు కున్నాయి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్), రైజోర్‌దళ్ చెరో రెండు స్థానాలు, తృణమూ ల్ కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకున్నాయి. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) 12 స్థానాలలో విజయం సాధించింది. డీఎంకే ఐదు, బీజేపీ నాలుగు స్థానాలు గెలుపొందగా ఇతర పార్టీలు, స్వతంత్రులు 9 సీట్లలో విజయం సాధించారు.
చరిత్ర సృష్టించిన విజయ్
తమిళనాడులో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత జోసఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలనం సృష్టించారు. తమిళ రాజకీయాలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. టీవీకేను ఏర్పాటు చేసిన రెండు సంవత్సరాల రెండు నెలల వ్యవధిలోనే ఆయన అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తద్వారా యావత్ దేశం దృష్టినీ ఆకర్షించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అప్రతిహత విజయంతో దూసుకుపోయారు. విజయ్ ప్రభావం పెద్దగా ఉండదని, ఆయన కొన్ని ఓట్లు మాత్రమే చీలుస్తారని కొందరు అంచనా వేశారు. హంగ్ ఏర్పడితే ఆయన కింగ్‌మేకర్ అవుతారని మరికొందరు జోస్యం చెప్పారు. అయితే తమిళ ఓటర్లు మాత్రం ఉవ్వెత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి విజరుకు నీరాజనం పలికారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి ప్రయత్నంలోనే విజయ్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీ యాంశమైంది. విజరు చాలా వరకూ సామాన్యులకే పార్టీ టిక్కెట్లు కట్టబెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయ వారసత్వానికి భిన్నంగా కింది స్థాయిలో పనిచేసిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చారు. తన వద్ద మూడు దశాబ్దాలకుపైగా కారు డ్రైవరుగా పనిచేసి, ప్రస్తుతం సహాయకుడిగా కొనసాగుతున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌ను చెన్నైలోని విరుగంబాక్కం స్థానం నుంచి పోటీకి దింపి గెలిపించారు. అలాగే రోయపురం స్థానంలో ఆటో డ్రైవర్ కె.విజయ్ థాముకు టిక్కెట్ ఇవ్వగా ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ జయకుమార్ (అన్నా డీఎంకే), మాజీమంత్రి రెహ్మాన్ ఖాన్ తనయుడు సుబైర్ ఖాన్‌లను ఓడించి విజయం సాధించారు.
నాటి అనుచరుడే నేటి ప్రత్యర్థి
బెంగాల్‌లో ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వెన్నంటి నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన సువేందు అధికారి ఆ తర్వాత బీజేపీ గూటికి చేరి మమతకు కంటిలో నలుసులా మారారు. మమత ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ పక్షాన ఆయనే బెంగాల్ తొలి ముఖ్యమంత్రి అవుతారన్న వార్తలు వస్తున్నాయి. నందిగ్రామ్‌లో సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి సువేందు నేతృత్వం వహించారు. మమతతో కలిసి పోరాటం సాగించారు. 2011లో ఏర్పడిన తృణమూల్ ప్రభుత్వంలో ఆయన పలు శాఖలు నిర్వహించారు. పార్టీలో నెంబర్ 2గా కొనసాగారు. అయితే పార్టీలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హవా నడవడంతో సువేందు తృణమూల్‌తో అనుబంధాన్ని తెంచుకొని బీజేపీలో చేరారు. 2021లో నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు.అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించారు.
అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం
అసోంలో బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి శాసనసభ ఎన్నికలలో విజయం సాధించింది. ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక పాత్ర పోషించారు. అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన బిశ్వశర్మ అసోం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి కీలక ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. తద్వారా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, యూసీసీ అమలు వంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించి హిందూ ఓట్లను సంఘటితపరిచారు. దుందుడుకు ప్రకటనలతో జాతీయవాదిగా గుర్తింపు పొందారు. తరుణ్ గొగోరు నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అసోంను పదిహేను సంవత్సరాల పాటు పాలించింది. దీంతో అక్కడి ప్రజలలో ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానిని అవకాశంగా తీసుకున్న బిశ్వశర్మ బీజేపీ వైపు ఓటర్లను ఆకర్షించగలిగారు.
రెండు స్థానాల్లోనూ ‘విజయ్’కేతనం
టీవీకే అధినేత విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాలలో జయకేతనం ఎగరేశారు. పెరంబూర్‌లో ఆయన తన సమీప ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి ఆర్‌డీ శేఖర్‌పై గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్‌లో అదే పార్టీ అభ్యర్థి ఇరుదయరాజ్‌పై గెలుపొందారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే నేత పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గంలో 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. కాగా తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ అభ్యర్థి తమిళసై మైలాపూర్ నియోజకవర్గంలో మూడో స్థానానికే పరిమితమయ్యారు.
తమిళనాట కలిసొచ్చేదెవరో?
తమిళనాడులో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం లభించలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో విజరుతో ఎవరెవరు కలిసొస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. టీవీకేకు కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇవ్వవచ్చని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, డీఎండీకే, లెఫ్ట్ పార్టీలు డీఎంకే కూటమిలో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కలసి రావాలని విజరు తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్‌ను కోరారు.
కేరళంలో మొదలైన కుర్చీలాట
కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించిన వెంటనే కుర్చీలాట మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, శశి థరూర్ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఆ పదవికి యూడీఎఫ్ ఎవరి పేరునూ బయటపెట్టలేదు. ‘ఎన్నికైన ఎమ్మెల్యేలు తిరువనంతపురం చేరుకొని శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చిస్తారు. ఆ తర్వాత యూడీఎఫ్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఏదేమైనా నిర్ణయాధికారం కాంగ్రెస్ అధిష్టానానిదే’ అని పార్టీ ఎంపీ కె.సురేష్ చెప్పారు. కాగా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నేతలు నూతన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడులోని కొలత్తూర్ శాసనసభ స్థానంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరాజయం పాలయ్యారు. ఆయనపై టీవీకే అభ్యర్థి వీఎస్ బాలు 8,284 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బాలుకు 76,796 ఓట్ల రాగా స్టాలిన్‌కు 68,512 ఓట్లు మాత్రమే లభించాయి.



