ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన కాలపట్టిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో వివరించాలని సూచిస్తూ, ప్రస్తుతం అమలులోకి తీసుకువచ్చిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంపై గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ప్రయివేటు కాలేజీలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది ఎస్. రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయడానికి కొంత గడువు అవసరమని కోర్టును కోరారు. ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలకు టోకెన్లు జారీ చేసిన మేరకు చెల్లింపులు జరుగుతున్నాయనీ, సంబంధిత సంక్షేమ శాఖల ద్వారా రీయింబర్స్ మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. కొత్త విధానం ప్రకారం ప్రభుత్వం ఫీజులను విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నదనీ, అనంతరం విద్యార్థులు ఆయా కాలేజీలకు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. ఈ ప్రక్రియపై జీవోలోని నిబంధ నలకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడానికి గడువు కావాలని కోరుతూ, పాత బకాయిల చెల్లింపుల బాధ్యతను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించబోదని స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ ఈ విధానం అమలులో ఉంటే కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే పరిస్థితి లేకుండా పోతుందని వాదించారు. అందువల్ల ఆ నిబంధనను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి, ప్రస్తుత విద్యాసంవత్సరం దృష్ట్యా జూన్ 24లోగా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అంతవరకు సంబంధిత నిబంధనపై ఉన్న మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
స్పష్టమైన కాలపట్టిక ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



