ఉమెన్ సేఫ్టీవింగ్ డీజీ చారుసిన్హా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
డిజిటల్ మాధ్యమాల్లో మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘స్టాండ్ విత్ హర్’ ప్రచారంలో భాగంగా సోమవారం లక్డీకాపూల్‌లోని డీజీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ”డిజిటల్ హుందాతనం – గౌరవం” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భద్రతా విభాగం డీజీ చారుసిన్హా మాట్లాడుతూ.. అంతర్జాల వినియోగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ముఖ్యంగా ఎదుటివారి ఏకాంతాన్ని, అంగీకారాన్ని గౌరవించడమే డిజిటల్ హుందాతనమని వివరించారు.డిజిటల్ వేదికలపై మనం చేసే పోస్ట్‌లు లేదా సమాచార మార్పిడి ఇతరుల మనోభావాలను ఎలా దెబ్బతీస్తాయో అర్థం చేసుకోవడమే డిజిటల్ సానుభూతి అని ఆమె వివరించారు. సైబర్ స్టాకింగ్, ట్రోలింగ్, బల్లీయింగ్, డాక్సింగ్ వంటి వేధింపుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేయకుండా సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ వేధింపులపై మౌనంగా ఉండటం నేరస్తులను మరింత ప్రోత్సహించినట్టేనని, బాధితులకు మద్దతుగా నిలిచి వేధింపులను అడ్డుకోవడంలో సమిష్టి బాధ్యత అవసరమని ఆమె స్పష్టం చేశారు.వేధింపులకు గురైతే వెనుకాడకుండా సైబర్ క్రైమ్ పోర్టల్స్ లేదా పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని, బాధితులకు అండగా ఉండేందుకు చట్టపరమైన నిబంధనలు అందుబాటులో ఉన్నాయని డీజీ భరోసా ఇచ్చారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, సైబర్ భద్రత మరియు చట్టపరమైన అంశాలపై విద్యార్థులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానమిచ్చారు. యువతలో డిజిటల్ భద్రత పట్ల అవగాహన పెంచేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తుందని ఆమె పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
‘డిజిటల్ హుందాతనం’ అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



