Wednesday, May 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిడీలిమిటేషన్: ప్రజల కోసమా? పవర్ కోసమా?

డీలిమిటేషన్: ప్రజల కోసమా? పవర్ కోసమా?

- Advertisement -

డీలిమిటేషన్ అంటే సింపుల్‌గా జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు మార్చడం. ఇది భారత రాజ్యాంగం ప్రకారం జరిగే ప్రక్రియే కానీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న చర్చలు చూస్తే ఇది కేవలం పరిపాలనా ప్రక్రియగా మిగలకుండా, రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే పవర్‌ఫుల్ టూల్‌గా మారిపోయిందనే అనిపిస్తోంది. దీన్ని రాజకీయ అస్ర్తంగా వాడుకోవాలని చూసిన బీజేపీకి పార్లమెంట్‌‌లో ప్రతిపక్ష‍ాల ఐక్యత దాన్ని తిప్పికొట్టింది. కానీ, దీన్ని ఏదో ఓ రూపంలో మళ్లీ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అసలు డీలిమిటేషన్‌ ప్రక్రియ వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ప్రజలందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించడం. ఒక ప్రాంతంలో జనాభా పెరిగితే అక్కడి ప్రజలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం, తగ్గితే సరిచేయడం. కానీ, పేపర్‌పై కనిపించే ఈ లాజిక్, ప్రాక్టికల్‌గా అమలు చేయడానికి వస్తే అనేక అనుమానాలు, అసమానతలు బయటపడుతున్నాయి. 1976లో మొదటిసారి డిలిమిటేషన్‌ ఫ్రీజ్ చేయడం, తరువాత 2001లో మరోసారి ఆ ఫ్రీజ్‌ను పొడిగించడం వెనుక ఒక బలమైన కారణం ‌లేకపోలేదు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరగకూడదనేది ముఖ్యం. అంటే, దేశం మొత్తానికి ఒక మెసేజ్ ఇచ్చారు “మీరు కుటుంబ నియంత్రణ పాటిస్తే, మేము మీ ప్రాతినిధ్యాన్ని తగ్గించము” కానీ, ఇప్పుడు 2026 తర్వాత ఈ ఫ్రీజ్ ఎత్తివేస్తే, అదే మెసేజ్ రివర్స్ అవుతుందా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.

దక్షిణ భారత రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ఇవి గత కొన్ని దశాబ్దాలుగా జనాభా నియంత్రణలో ముందున్నాయి. ఉదాహరణకు తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేట్ రెండు కంటే తక్కువగా పడిపోయింది, అంటే ఒక కుటుంబానికి సగటున ఇద్దరికంటే తక్కువ పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇది కేవలం సంఖ్యల విషయం కాదు; ఇది ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, ఆర్థిక స్థిరత్వం ఆల్ ఇండికేటర్స్ ఆఫ్ డెవలప్మెంట్.అదే సమయంలో ఉత్తర భారత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఇంకా ఎక్కువ జనాభా వృద్ధితో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డిలిమిటేషన్ పూర్తిగా జనాభాపైనే ఆధారపడి జరిగితే, సీట్ల పునర్విభజనలో భారీ మార్పులు రావడం ఖాయం.నిపుణుల అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న ఎనభై సీట్ల సంఖ్య 110-120 దాటే అవకాశం ఉంది. బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా అదేవిధంగా లాభపడతాయి. కానీ అదే సమయంలో దక్షిణ రాష్ట్రాల వాటా తగ్గిపోతుంది. అంటే ఒక ప్రాంతం తన బాధ్యతగా జనాభా నియంత్రణ పాటిస్తే, దాని ఫలితం రాజకీయంగా బలహీనతగా మారే పరిస్థితి వస్తుంది. ఇదే విషయం చాలా మందికి అసహజంగా అనిపిస్తోంది “జనాభా కంట్రోల్ చేసిన వాళ్లకి శిక్ష, చేయని వాళ్లకి రివార్డు” అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.

ఇంకో కీలక విషయం ప్రస్తుతం కూడా రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంలో అసమానత ఉంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో ఒక ఎంపీకి సగటున 25-30 లక్షల మంది ప్రాతినిధ్యం ఉంటే, దక్షిణ రాష్ట్రాల్లో అది 15-20 లక్షల మధ్యే ఉంది. అంటే ఒక ప్రాంతంలో ఒక ఓటు విలువ మరొక ప్రాంతంతో పోలిస్తే తగ్గినట్టే అవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే లేదా మరింత పెరిగితే, ప్రజాస్వామ్యంలో సమానత్వం అనే మూల సూత్రం దానికదే ప్రశ్నార్థకమవుతుంది. ఇదే విషయంపై మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై కురైషీ స్పష్టంగా చెప్పారు. డీలిమిటేషన్ అవసరం, కానీ అది కేవలం జనాభాపైనే ఆధారపడకూడదు; అభివృద్ధి సూచికలు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక నిపుణుడు బిబేక్ డెబ్రాయ్ కూడా ఇదే దిశగా హెచ్చరిస్తూ, ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే దేశ రాజకీయ శక్తి సమతుల్యత ఒకవైపు ఒరిగే ప్రమాదం ఉందని చెప్పారు. రాజకీయ విశ్లేషకుడు ప్రతాప్ భాను మెతా మాటల్లో చెప్పాలంటే డిలిమిటేషన్ అనేది కేవలం సరిహద్దుల మార్పు కాదు, అది దేశంలో ఎవరి వాయిస్ బలంగా వినిపించాలి అన్నది నిర్ణయించే కీలక ప్రక్రియ.

ఇక్కడే రాజకీయ కోణం బయటపడుతుంది.బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలు ఎక్కువగా ఉత్తర భారతంలోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే రాష్ట్రాలు. ఇప్పుడు డిలిమిటేషన్ వల్ల ఈ రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే, రాజకీయంగా ఎవరికి లాభం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం అనుకోవాలా? లేక ఒక రాజకీయ వ్యూహంగా చూడాలా? అన్నది ఇప్పుడు పెద్ద డిబేట్‌గా మారింది. ప్రజల్లో కూడా ఈ అనుమానం పెరుగుతోంది“డిలిమిటేషన్ అంటే నిజంగా ప్రజల ప్రాతినిధ్యం పెంచడానికా… లేక ఒక పార్టీకి ప్రాబల్యం పెంచడానినా?” అని. ఇదే కారణంగా చాలా మంది నిపుణులు, విశ్లేషకులు “డిలిమిటేషన్ కాదు ఇది..పవర్ డిస్ట్రిబ్యూషన్!” అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక దక్షిణ రాష్ట్రాల దృష్టిలో ఇది కేవలం ఒక పాలసీ ఇష్యూ కాదు, ఇది వారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇప్పటివరకు ఈ రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూట్ చేశాయి, టాక్స్ ఎక్కువ చెల్లించాయి, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌‌లో ముందున్నాయి. కానీ అదే సమయంలో లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం తగ్గిపోతే, దేశ పాలసీ నిర్ణయాల్లో వారి వాయిస్ కూడా తగ్గిపోతుంది. అంటే ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడే పరిస్థితి వస్తుంది. ఇది ఫెడరల్ స్రక్చర్‌‌కు పెద్ద సవాల్. అందుకే నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు చాలా క్లియర్‌గా ఉన్నాయి జనాభా ఒక్కటే కాకుండా అభివృద్ధి సూచికలు, టాక్స్ కాంట్రి బ్యూషన్, సామాజిక ప్రగతి వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే మల్టీ-ఫాక్టర్ ఫార్ములా అవసరం. అంతేకాకుండా డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలి, రాజకీయ ప్రభావం లేకుండా ఒక స్వతంత్ర కమిషన్ ఆధ్వర్యంలో జరగాలి.

ఈ నేపథ్యంలో దక్షిణ రాష్ట్రాలు కూడా మౌనంగా ఉండకూడదు. ఇది ఎమోషనల్ ఇష్యూకాదు, స్ట్రాటజిక్ ఇష్యూ. కలిసికట్టుగా తమ వాయిస్ వినిపించాలి, అవసరమైతే లీగల్, కాన్సిట్యూషనల్ మార్గాల్లో పోరాడాలి. తమ ఆర్థిక శక్తిని రాజకీయ శక్తిగా మార్చుకునే దిశగా ఆలోచించాలి. లేదంటే డిలిమిటేషన్ అనే పేరు పెట్టి ఒక పెద్ద రాజకీయ రీడిజైన్ జరుగుతుండగా, వారు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.చివరికి ఒక నిజం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం సంఖ్యల ఆట కాదు; అది న్యాయం, సమానత్వం, సమతుల్యత. సీట్లు పెరగడం ఒక్కటే పరిష్కారం కాదు; అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించడమే అసలు లక్ష్యం కావాలి. లేకపోతే, “అభివృద్ధి చేసినవాళ్లకి శిక్ష పడే సిస్టమ్‌”గా ఇది మారిపోతుంది. అప్పుడు ప్రజాస్వామ్యం పేరు మాత్రమే మిగులుతుంది, లోపల మాత్రం రాజకీయ లెక్కల గేమ్ నడుస్తుంది. అందుకే ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి పౌరుడు అడ గాల్సినది డిలిమిటేషన్ ప్రజల కోసం జరుగుతుందా? లేక రాజకీయ లాభాల కోసమా? ఆ ప్రశ్న‌కు వచ్చే సమ ధానమే ఈ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించబోతుంది.

విజయ చీలి
7989200759

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -