మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
హెచ్‌సీఏ క్రికెట్ డైరెక్టర్‌గా నియామకం
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ‘అవినీతి రహిత క్రికెట్’ నా లక్ష్యమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నియామకమైన అంబటి రాయుడు మంగళవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యుల నడుమ ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ క్రికెట్ కోసం ఓ మంచి లక్ష్యంతో హెచ్‌సీఏ పెద్దలు నన్ను కలిశారు. అండర్-13 నుంచి స్కూల్, కాలేజ్, లీగ్ సహా అన్ని స్థాయిల్లో క్రికెట్ ఇక్కడ ఆడాను. హైదరాబాద్‌లోని ప్రతి గ్రౌండ్‌తో అనుబంధం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ ఓ పవర్‌హౌస్‌గా నిలవాలి. అందుకు అవినీతి రహిత క్రికెట్ నా తొలి ప్రాధాన్యత. అవినీతి విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. అటువంటి ప్రయత్నాలు జరిగితే కమిటీ వెంటనే ఏసీబీ, బీసీసీఐకి సమాచారం ఇస్తుంది. ఆ ఆటగాళ్లు లేదా అధికారులను హెచ్‌సీఏ, బీసీసీఐ బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంది. సెలక్టర్లు సైతం అవినీతి మరక లేకుండా ఉండాలి. ప్లేయర్స్ ఫస్ట్ ఆలోచన విధానంతో ఉండాలి. ప్రతిభ ఆధారంగానే టీమ్ సెలక్షన్స్ ఉండాలి. ఎటువంటి పక్షపాతం, వివక్షకు తావులేకుండా ఎంపిక విధానం ఉండాలి. ఇందులో భాగంగా క్రికెట్ ఆపరేషన్స్ (అంపైర్లు, స్కోరింగ్) వ్యవస్థను సైతం ఆటోమేషన్‌లోకి తీసుకొస్తాం. సెలక్టర్లు, అంపైర్లు సహా క్రికెట్ ఆపరేషన్స్‌లో ఉండే ప్రతి ఒక్కరి పనితీరుపై నివేదికలు తయారవుతాయి. ప్రతిభావంతులను సైతం జట్టులోకి తీసుకునేందుకు.. ఓపెన్ సెలక్షన్స్‌ను మళ్లీ ప్రవేశపెడుతున్నాం. అండర్-13లో నేను కూడా ఓపెన్ ట్రయల్స్‌లోనే ఎంపికయ్యాను. అవే లేకుంటే హెచ్‌సీఏకు ప్రాతినిథ్యం వహించేవాడిని కాదు. హెచ్‌సీఏ లీగ్స్‌లో ఆడని ప్రతిభావంతులను ఓపెన్ ట్రయల్స్ గుర్తించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ క్రికెట్‌కు సేవ చేసేందుకు ఈ బాధ్యతలు తీసుకున్నాను. హైదరాబాద్ క్రికెట్‌ను ఉన్నతమైన స్థానంలో నిలిపిచేందుకు ఈ స్థానంలోకి వచ్చాను’ అని అంబటి రాయుడు అన్నాడు. ఇక తెలంగాణ గ్రామీణ క్రికెటర్లు సైతం హెచ్‌సీఏ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందేందుకు రెసిడెన్షియల్ సదుపాయం తీసుకురావాలని రాయుడు సూచించాడు. 10-15 రోజుల పాటు అకాడమీలో శిక్షణ పొందేందుకు గ్రామీణ క్రికెటర్లకు రెసిడెన్షియల్ వసతి ఉపయోగపడుతుంది. హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఈ విషయంలో ఆలోచన చేయాలని రాయుడు అన్నాడు. హెచ్‌సీఏ సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ పి. నవీన్‌రావు, అధ్యక్షుడు అమర్‌నాథ్, కార్యదర్శి జీవన్‌రెడ్డి సహా అపెక్స్ కౌన్సిల్ సభ్యులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లాల్లో ఆరు మైదానాలు : జీవన్ రెడ్డి
తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై దష్టి పెడుతున్నాం. మహబూబ్‌నగర్, కరీంనగర్‌తో పాటు కొత్తగా నిజామాబాద్‌లో ఫస్ట్ క్లాస్ స్థాయి మైదానం అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనూ స్టేడియాల నిర్మాణంపై ఆలోచన చేస్తున్నాం. స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తే, సానుకూలంగా స్పందించారు. రానున్న 2-3 నెలల్లో ఈ మూడు జిల్లాల్లోనూ స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. తెలంగాణ గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు, జిల్లాల్లో క్రికెట్ కార్యకలాపాలు పెరిగేందుకు ఇది దోహదం చేస్తుందని హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి తెలిపారు.
హెచ్‌సీఏలో ఏసీఎస్ ఏర్పాటు
హైదరాబాద్ క్రికెట్‌కు వేధిస్తోన్న అవినీతి సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎట్టకేలకు ఓ ఆలోచనతో ముందుకొచ్చింది. సెలక్షన్ కమిటీ నుంచి క్లబ్ క్రికెట్ స్థాయి వరకు ఎటువంటి అవినీతి చోటుచేసుకున్నా.. క్రికెటర్లు, క్రికెటర్ల తల్లితండ్రులు, ప్రజలు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఓ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఫిర్యాదుకు హెచ్‌సీఏ నుంచి సమాధానం లభిస్తుంది. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు హెచ్‌సీఏలో యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ (ఏసీఎస్) విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రిటైర్డ్ ప్రిన్సిపల్ జడ్జి విజేందర్ పింగ్లే ఏసీఎస్ విభాగానికి చైర్మన్‌గా వ్యవహరిస్తారని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి వెల్లడించారు.
ప్రొఫెషనల్‌గా క్రికెట్ అకాడమీ
గత రెండేండ్లుగా హెచ్‌సీఏ క్రికెట్ అకాడమీ పని చేయటం లేదు. అంబటి రాయుడు నేతత్వంలో ఈ ఏడాది నుంచి క్రికెట్ అకాడమీ కార్యకలాపాలు జరుగుతాయి. అకాడమీకి అవసరమైన మౌలిక సదుపాయాలను హెచ్‌సీఏ సమకూరుస్తుంది. 2026 హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌లు ఈ నెల 12 నుంచి ఆరంభం అవుతాయి. హైదరాబాద్‌లోని సుమారు 10-15 గ్రౌండ్స్‌లో ఈ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌ల కోసం హెచ్‌సీఏ అన్ని ఏర్పాట్లు చేయనందని జీవన్‌రెడ్డి తెలిపారు. క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా అంబటి రాయుడు ఎటువంటి పారితోషికం తీసుకోవటం లేదు. ఆయన సారథ్యంలో తెలంగాణ క్రికెటర్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేలా తయారు కావాలని ఆశిస్తున్నానని జీవన్ రెడ్డి అన్నారు.
నా ప్రాధాన్యత అవినీతి రహిత క్రికెట్
- Advertisement -
- Advertisement -



