హార్ముజ్‌లో మళ్లీ కాల్పుల మోతలు
మా నౌకలపై దాడి చేస్తే తుడిచిపెడతాం : ట్రంప్
దూకుడుగా వ్యవహరిస్తే ఊబిలో పడతారు : ఇరాన్
యూఏఈ ఓడరేవుపై ఇరాన్ డ్రోన్ దాడి
ముగ్గురు భారతీయులకు గాయాలు
టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో మరోసారి ఘర్షణలు మొదలయ్యాయి. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నదీ లేనిదీ తెలియని పరిస్థితి నెలకొంది. హార్ముజ్ జలసంధిలో ఇరు పక్షాలు కాల్పులకు దిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నదా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చిన 19 క్షిపణులు, డ్రోన్లను తన గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని, డ్రోన్ దాడిలో ఫుజైరా ప్రాంతంలో ని చమురు ఓడరేవు వద్ద మంటలు వ్యాపించాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ఇదిలావుండగా పర్షియన్ గల్ఫ్‌లో తమ నౌకలపై దాడి చేస్తే ఈ భూమి పైనే లేకుండా తుడిచిపెడతానని ఇరాన్ దళాలను ట్రంప్ హెచ్చరించారు. రాజకీయ సంక్షోభానికి సైనిక పరిష్కారం ఉండదు : ఇరాన్ రాజకీయ సంక్షోభానికి సైనిక పరిష్కారం ఉండదని హార్ముజ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు నిరూపిస్తున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. దుందుడుకు చర్యలకు పాల్పడితే ఊబిలో కూరుకుపోతారని ఆయన అమెరికా, యూఏఈలను హెచ్చరించారు. పాకిస్తాన్‌తో జరుపుతున్న చర్చలు పురోగతిలో ఉండగానే అమెరికా ఊబిలోకి దిగుతోందని, దాని మిత్రదేశం యూఏఈ కూడా అదే పని చేస్తోందని అన్నారు. హార్ముజ్ జలసంధి నుంచి నౌకలను బయటికి పంపే విషయంలో సాయపడడానికి అమెరికా ముందుకు తెచ్చిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రణాళికను ఆయన ఎద్దేవా చేశారు. ఆమోదయోగ్యం కాదు : కేంద్రం యూఏఈలోని ప్రధాన చమురు ఓడరేవుపై జరిగిన దాడిలో ముగ్గురు భారత జాతీయులు గాయపడడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ చర్య ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ‘శత్రుత్వానికి వెంటనే స్వస్తి చెప్పాలని, పౌర మౌలిక సదుపాయాలను, ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం ఆపేయాల ని మేము కోరుతున్నాం’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాలన్న తన వైఖరిని పునరుద్ఘాటిం చింది. మంటల్లో చిక్కుకున్న దక్షిణ కొరియా నౌక ఇదిలావుండగా దక్షిణ కొరియాకు చెందిన ఓ నౌక సోమవారం హార్ముజ్‌లో మంటలలో చిక్కుకుంది. అంతకుముందు నౌకలో పేలుడు సంభవించింది. నౌకను తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు సమీపంలోని ఓడరేవుకు తరలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణమేమిటో తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నామని సియోల్ విదేశాంగ శాఖ తెలిపింది.
సిద్ధంగా ఉన్నాం : ట్రంప్
స్థావరాలను ఆయుధ సామాగ్రితో నింపేశాం
వాషింగ్టన్ : గల్ఫ్‌లో చిక్కుబడిపోయిన నౌకలు, వాటి సిబ్బందికి సాయపడేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్ హార్ముజ్ జలసం ధిలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. హార్ముజ్‌పై పట్టును చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ తన దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్‌కు చెందిన ఆరు చిన్న పడవలను ధ్వంసం చేశానని, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నానని అమెరికా తెలిపింది. అయితే ఈ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది. గల్ఫ్‌లోని ఇంధన చెక్‌పాయింట్ వద్ద 800కు పైగా నౌకలు, వాటిలోని 20 వేల మంది సిబ్బంది చిక్కుబడి పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ‘గతంలో కంటే మా వద్ద మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉంది. మా వద్ద అత్యుత్తమ సామగ్రి ఉంది. ప్రపంచమంతటా మాకు బలగం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మా స్థావరాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఆయుధ సామగ్రితో నింపేశాం. అవసరమైనప్పుడు వాటన్నింటినీ ఉపయోగిస్తాం’ అని చెప్పారు. ఇదిలావుండగా తమ రక్షణలో ఉన్న నౌకలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సహా ఇరాన్ దళాలు క్షిపణులు, డ్రోన్లు, వేగవంతమైన పడవలతో దాడులు చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ రాయిటర్స్ వార్తాసంస్థకు తెలియజేశారు. అయితే వాటన్నింటినీ తిప్పికొట్టామని చెప్పారు. అమెరికా చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ఆపరేషన్‌లో పదిహేను వేల అమెరికా దళాలు, నేవీ డిస్ట్రాయర్లు, వందకు పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భాగస్వాములవుతున్నాయి.హార్ముజ్‌లో ఇరాన్ అమర్చిన మందుపాతరలను విజయవంతంగా తొలగించామని, అమెరికా పతాకంతో ఉన్న రెండు వాణిజ్య నౌకల రక్షణలో వివిధ దేశాలకు చెందిన నావలను సురక్షితంగా జలసంధిని దాటిస్తున్నామని అమెరికా చెప్పింది. అయితే హార్ముజ్‌ను గత కొన్ని గంటలుగా వాణిజ్య నౌకలేవీ దాటలేదని ఐఆర్‌జీసీ తెలిపింది.



