Thursday, May 7, 2026
E-PAPER
Homeమానవిరచనలే నా మనసుకు ఓదార్పు

రచనలే నా మనసుకు ఓదార్పు

- Advertisement -

క్రీష్టం రామలక్ష్మి… కంటి చూపు తగ్గినపుడు దృఢ సంకల్పంతో అడుగు ముందుకేశారు. ఎదురైన అవమానాలన్నింటినీ సవాళ్లుగా స్వీకరించారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత దృష్టి కొంత మెరుగుపడింది. ఇక జీవితంలో వెనుదిరిగి చూడలేదు. కంటి అద్దాల సాయంతో కవితలు, పాటలు రాస్తూ పిల్లల కోసం ఓ యూట్యూబ్ నడుపుతున్నారు. అంతేకాదు ‘అమ్మ ముద్ద’ అనే పేరుతో ఇంట్లోనే సాంబార్ పౌడర్ చట్నీలు తయారుచేసి అమ్ముతున్నారు. ఆర్డర్ ఇస్తే కొరియర్లో పంపుతారు. పుస్తకాలనే నేస్తాలుగా భావించి పట్టుదలతో రాణిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

మా నాన్న రామకృష్ణ. మా అమ్మ పద్మావతి దేవి. నాన్న కోపరేటివ్ బ్యాంకులో ఫైర్ సెక్రటరీగా పని చేసేవారు. మా తల్లిదండ్రులకు పెళ్లయిన ఏడు సంవత్సరాల తరువాత నేను పుట్టాను. చిన్నప్పటి నుంచే నా జీవితం సవాళ్లతో మొదలైంది. నాకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో మా అమ్మ నన్ను పెంచడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. నాచురోపతి ద్వారా కొంత ఉపశమనం లభించింది. చిన్న వయసులోనే కష్టాలు ఎదురైనా కథలంటే నాకు చాలా ఇష్టం. మా తాతగారు చదివిన చందమామ కథలు నా ఊహాశక్తికి బలాన్ని ఇచ్చాయి.

చిన్న మనసును బాధించినా…
పోషకాహారం లోపం వల్ల కంటి చూపు మందగించింది. ఆ సమయంలో ఇతరుల మాటలు నా చిన్న మనసును ఎంతో బాధించేవి. చదువులో కూడా నేను యావరేజ్ స్టూడెంట్ మాత్రమే. కొంతమంది టీచర్లు కొట్టడం వల్ల చదువంటే భయం పెరిగింది. ఒక రోజు టీచర్ కొట్టినప్పుడు మా నాన్నమ్మ చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చాయి. “పిల్లలను కొడితే చదువు రాదు, ప్రేమతో నేర్పాలి’’. ఆ మాటలే నా మనసులో ఒక సంకల్పాన్ని నాటాయి. నేను ఒక మంచి టీచర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. పదవ తరగతిలో నాలుగు సార్లు ఫెయిల్ అయినప్పుడు.. “నేను పనికిరానిదానినా?” అనే ప్రశ్న నన్ను బాధించింది. పైగా బంధువులందరూ దూరంగా ఉండటం మరింత బాధ కలిగించింది. కానీ మా నాన్న మాత్రం ఎప్పుడూ నన్ను వదల్లేదు. నన్ను గ్రంథాలయానికి తీసుకెళ్లి పుస్తకాలు చదివించారు. నేను చదివిన మొదటి నవల “అమృత కలశం”అక్కడే చాలా నేర్చుకున్నాను.

జీవితానికి ఓ మలుపు…
పుస్తకాల నుండి నేర్చుకున్న జ్ఞానంతో మన విలువను మనమే నిరూపించుకోవాలి పట్టుదల ఆమెలో పెరిగింది. పెదనాన్న ప్రోత్సాహంతో 1999లో పదవ తరగతి పూర్తి చేశాను. 2003లో ఎలక్ట్రానిక్స్లో మెకానికల్ డిప్లొమా పూర్తి చేశాను. 2004లో ప్రీ-ప్రైమరీ టీచర్‌గా పనిచేయడం నా జీవితానికి ఓ మలుపు. అక్కడే పుస్తకాలపై మరింత ప్రేమ పెరిగింది. 2014లో హ్యాండ్‌రైటింగ్ టీచర్‌గా పిల్లలకు మంచి అక్షరాలు నేర్పుతూ ఆనందం పొందాను. సైన్స్‌పై నా ఆసక్తిని గుర్తించిన గురువులు నాకు అవకాశాలు ఇచ్చారు. నా మార్గదర్శకత్వంలో చేసిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి చేరాయి. ఇవి నాపై నాకు నమ్మకాన్ని ఇచ్చాయి. 2005లో నా వివాహం జరిగింది. తరువాత వచ్చిన విమర్శలను నేను సవాళ్లుగానే తీసుకున్నాను. “నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి” అని నిర్ణయించుకున్నాను.

పుస్తకం నాకు నేస్తం
జీవితంలో ఎన్నో బాధలు, ఒత్తిడులు వచ్చినప్పుడు వాటి నుండి బయటపడేందుకు నేను ఒక చిన్న అలవాటు చేసుకున్నాను. నాకు బాధ కలిగితే ఓ బుక్‌లో రాసుకుంటాను. దాంతో పుస్తకం నాకు ఓ నేస్తంగా మారిపోయింది. నా బాధ, నా ఆనందం, నా ఆశలు.. అన్నింటినీ ఆ పుస్తకంతోనే పంచుకుంటాను. అలా రాయడం అలవాటుగా మారి అదే కవిత్వంగా మారింది. నా భావాలు కవితలుగా మారి నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. 2022లో “గ్రంథాలయాలు” కవితతో నా సాహిత్య ప్రయాణం ప్రారంభమైంది. నా గురువులు, స్నేహి తులు ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు సాగాను. వారి మార్గదర్శకత్వం నాకు ఓ దిశను చూపింది. ఇప్పటి వరకు “మనసు ముద్దాడే పదాలు” (కవితలు), “తిరుపావై గీతారచన”, 50కు పైగా భక్తి గీతాలు, 100కు పైగా బాలల గీతాలు రచించాను. కోవిడ్ సమయంలో మా కూతురు ప్రారంభించిన “బాలానందం పిల్లల ప్రపంచం” యూట్యూబ్ ఛానల్ ద్వారా నా రచనలు ప్రజల్లోకి చేరాయి.
– అచ్యుతుని రాజశ్రీ

గుర్తింపులు- విజయాలు
“హెల్మెట్ పెట్టుకో నాన్న” గీతానికి మంచి గుర్తింపు. అలాగే “సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదాం” అనే షార్ట్ స్టోరీకి ఉత్తమ షార్ట్ స్టోరీ అవార్డు వచ్చింది. 2024 – తెలుగు భాషా సేవా ప్రతిభా పురస్కారం, 2025 – మహిళా శిరోమణి అవార్డు, 2026 – ఉగాది కవిసమ్మేళనం సత్కారం అందుకున్నాను. ఒకప్పుడు నన్ను విమర్శించినవారే “ప్రౌడ్ ఆఫ్ యూ” అని చెప్పిన రోజు నా జీవితంలో గొప్ప క్షణం. నా బలం నా కుటుంబం, నాచెల్లి భార్గవి, స్నేహితులు, గురువులు. వీరంతా నా జీవితంలో ఒక వెలుగు. ప్రత్యేకంగా నా భర్త“ఎవరినీ పట్టించుకోవద్దు.. నీ దారిలో నడుస్తూ నీ లక్ష్యాన్ని చేరుకో” అని ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తారు. దీనికి నేనెంతో గర్వపడతాను. జీవితంలో నాకు అండగా నిలిచిన నా భర్త శ్యాంసుందర్ పేరుతో నా పేరు రామలక్ష్మిని కలిపి ‘లక్ష్మిశ్యం’ అనే కలం పేరును పెట్టుకున్నాను. ఇది నాకు కేవలం కలం పేరు మాత్రమే కాదు అది మా బంధానికి ప్రతీక. మా వారు ఫోటో స్టూడియో నడుపుతారు. మా అమ్మాయి బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతుంది.

పిల్లల ఆరోగ్యానికి…
ప్రస్తుత రోజుల్లో పాఠశాలకు వెళ్లే పిల్లలకు, ముఖ్యంగా కొత్తగా బడికి వెళ్లే చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయడం చాలా ముఖ్యం. వారు ఇష్టపడే విధంగా పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి. అయితే, ఏ రకమైన ఆరోగ్యకరమైన ఆహారాలు పిల్లలకు ఎలా ఇవ్వాలి అనే విషయంలో తల్లులకు తరచుగా సందేహాలు వస్తుంటాయి. అందుకే, పాఠశాలకు వెళ్లే పిల్లలకు పోషకాలు నిండిన కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డు : ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచేది గుడ్డు. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా, పిల్లలకు కండరాల పటుత్వాన్ని అందించడంలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం అల్పాహారంలో గుడ్డును చేర్చడం వల్ల వారికి రోజంతా శక్తి లభిస్తుంది. వేరుశనగలు, రాగులు: ఇవి సులభంగా లభించే ఆహార పదార్థాలు. వేరుశనగలలో జింక్, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలకు అద్భుతమైన ఆహారం. వీటిని స్నాక్స్‌గా లేదా పొడిగా చేసి వివిధ వంటకాలలో కలిపి ఇవ్వవచ్చు. వేరుశనగలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రాగులు ఐరన్, కాల్షియంతో నిండి ఉంటాయి. పిల్లలకు అధిక శక్తిని అందించడానికి రాగులు ఉత్తమ ఆహారం.

చేపలు: చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల మెదడు అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అలాగే, చేపలలో విటమిన్ డి, ఎముకల బలానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీ పిల్లలు చేపలను ఇష్టపడితే, వారానికి 2 నుంచి 3 సార్లు ఇవ్వవచ్చు. చేపలను కూరగా లేదా ఫ్రై చేసి అందించవచ్చు. అయితే, చిన్నపిల్లలకు ముళ్ళు లేకుండా జాగ్రత్తపడాలి.
పండ్లు: పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. అలాగే, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అరటిపండ్లు, ఆపిల్, నారింజ, బెర్రీలు వంటివి పిల్లలకు రోజూ అందించడం వల్ల వారికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
పిల్లలకు బలవంతంగా కాకుండా, వారు ఇష్టపడే విధంగా ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను అందించడం ముఖ్యం. విభిన్న రకాల పదార్థాలను వారి ఆహారంలో చేర్చడం వల్ల అన్ని పోషకాలు అందుతాయి. ఇంటి భోజనం, ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను అలవాటు చేయడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు పునాది వేయవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -